Home బిజినెస్ ఆస్తుల విక్రయం కోసం భారత్- 22 ఇటిఎఫ్

ఆస్తుల విక్రయం కోసం భారత్- 22 ఇటిఎఫ్

 ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
 ఇండెక్స్‌లో ఆరు రంగాలకు చెందిన కంపెనీలు

ETF

న్యూఢిల్లీ : భారత్22 పేరుతో ఇటిఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్)ను శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ముందు ముందు డిజిన్వెస్ట్‌మెంట్(పెట్టుబడుల ఉపసంహరణ) కోసం వాహకంగా ఇటిఎఫ్‌ను వినియోగిస్తామని జైట్లీ 2017-18 బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 201718లో సిపిఎస్‌ఇ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ.72,500 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు తొమ్మిది పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీల ద్వారా సుమారు రూ.9300 కోట్లు ప్రభుత్వం గుర్తించిందని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఇండెక్స్‌లో పభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్, ఎనర్జీ, ఇండస్ట్రీ, ఎఫ్‌ఎంసిజి వంటి 22 కంపెనీలు ఉన్నాయి. మొత్తం డిజిన్వెస్ట్‌మెంట్ లక్షం రూ.72,500 కోట్ల గా ఉండనుందని జైట్లీ ప్రకటించారు. భారత్-22 ఇటిఎఫ్‌లో రంగాల వారీగా బ్యాంకులు అత్యధికంగా 20.3 శాతం వాటాను కల్గి ఉన్నాయి. వీటిలో ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. 17.5 శాతం వాటాతో ఇంధన రంగం రెండవ స్థానంలో ఉంది. వీటిలో నాల్కో, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బిపిసిఎల్, కోల్ ఇండియా ఎనర్జీ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆ తర్వాత ఎఫ్‌ఎంసిజి 22.6 శాతం వాటాను కల్గి ఉండగా, దీనిలో ఐటిసి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్‌బిసిసి ఉన్నాయి. ఆ తర్వాత 20 శాతం వాటాతో ఆరు యుటిలిటీ కంపెనీలు.. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్‌టిపిసి లిమిటెడ్, గెయిల్ ఇండియా, ఎన్‌హెచ్‌పిసి, ఎన్‌ఎల్‌సి ఇండియా, ఎస్‌విజెఎన్‌లు ఉన్నాయి. జైట్లీ ఈ ప్రకటన వెంటనే శుక్రవారం నాటి మార్కెట్ ముగింపులో పిఎస్‌యు బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు భారీగా లాభపడ్డాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 90 శాతం ఈక్విటీలు ఉంటాయని, ఫండ్ మేనేజర్‌గా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వ్యవహరిస్తుంది. అంతర్జాతీయంగా ఇటిఎఫ్ ఆస్తులు గణనీయంగా వృద్ధిని సాధిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎయుఎం (అస్సెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) 4 ట్రిలియన్లు ఉన్నాయి. ఇవి 2021 నాటికి 7 ట్రిలియన్ డాలర్లను చేరుకోనున్నాయి.