Home ఎడిటోరియల్ జైట్లీజీ – నిజాయితీ నిరూపించుకోండి!

జైట్లీజీ – నిజాయితీ నిరూపించుకోండి!

ARUN1అవినీతి ఎక్కడ బయటపడినా, ఎవరిమీద ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలి. ఎందుకంటే గత మూడు-నాలుగేళ్లుగా ‘అవినీతి’పైనే రాజకీయం నడుస్తోంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకనీతి, ప్రభుత్వంలో మరోనీతి. ఈ రెండు నాల్కల ధోరణిని ప్రజలు సహిస్తారనుకుంటే భ్రమ. ఢిల్లీ అండ్ జిల్లా క్రికెట్ క్లబ్ (డిడిసిఎ)కు సంబంధించి అవినీతి ఆరోపణలకు గురైన తాజా వ్యక్తి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ. బుకాయిస్తేనో, పదులకోట్లకు పరువు నష్టం కేసులు దాఖలు చేస్తేనో నీతికి అవి నిరూపణ కాబోవు. అవినీతిపై పోరాటమే ఎజండాగా వున్న ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్), దాని ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుగా జైట్లీపై బాంబు విసిరారు. తన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ గతంలో వేరే డిపార్టుమెంటులో అవినీతికి పాల్పడిన కేసు దర్యాప్తు పేరుతో సిబిఐ ముఖ్యమంత్రి ఛాంబర్‌ను సోదాచేయటం జైట్లీకి సంబంధించిన డిడిసిఎ ఫైళ్లకోసమేనన్న కేజ్రీవాల్ ఆరోపణ తేనెతుట్టెను కదిలించింది. అది రోజులు గడిచేకొలదీ మరింత మురికిని చేకూర్చుకుంటున్నది. జైట్లీ ఓ పదేళ్లపాటు డిడిసిఎ గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దాని పరిపాలనా వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని ఆయన సమర్థకులు చెప్పే మాటలు నమ్మశక్యం కావు. ఫిరోజ్‌షా కోట్లా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా, అదీ ఎక్కువగా బయటనుంచి వనరుల సమీకరణతో రూపొందించిన సాటిలేని మేటి మన జైట్లీ అని వాదన అంతకుముందు వినిపించారు. ఇంతలో ఢిల్లీకి చెందిన మాజీ టెస్ట్ క్రికెటర్ కీర్తి అజాద్, జైట్లీ అధ్యక్షునిగా ఉన్నకాలంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు. ఈయన బీహార్‌నుంచి (దర్భాంగా) బిజెపిలోక్‌సభ సభ్యుడు కూడా. అవినీతిని సహించకపోవటం బిజెపి ఎజండా అయినందున డిడిసిఎలో అవినీతిపై మాత్రమే తాను దర్యాప్తు కోరుతున్నానన్నారు. అయితే దీన్ని ఆర్థికమంత్రిపై బురదచల్లటంగా భావించిన బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా (ప్రధానమంత్రి అంగీకారంతోనే అయి ఉంటుంది) అజాద్‌ను పార్టీనుండి సస్పెండ్ చేశారు. దీంతో అవినీతిపై బిజెపి అసలు ముఖం బయటపడిందన్న ఆజాద్, తాను ఏ తప్పు చేయలేదని, అందువల్ల తనపై చర్య విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈయనపై జైట్లే వేసిన పరువు నష్టం కేసు నోటీసుకు సుబ్రహ్మణ్యస్వామి జవాబు తయారు చేస్తుండటం మరింత ఆసక్తిదాయకం. ఇదిలావుండగా, బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంచబడిన పట్నా ఎంపి, ప్రముఖ సినీనటుడు శతృఘ్నసిన్హా వ్యాఖ్య మరింత ఆసక్తిదాయకం. జైట్లీ అద్వానీని ఆదర్శంగా తీసుకోవాలి. హవాలా కేసులో ఆరోపణలు రాగానే అద్వానీ రాజీనామా చేశారు. దర్యాప్తు ఆ ఆరోపణలు బూటకంగా తేల్చటంతో నిజాయితీపరుడిగా ఆయన ప్రతిష్ట పెరిగింది అలాగే జైట్లీ రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చాలా ‘వివేకవంతమైన’ సలహా ఇచ్చారు. ఇదిలావుండగా జైట్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ పోలీసు అధికారి కె.పి.ఎస్.గిల్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో జైట్లీ ‘ప్రయోజనాల రాజీ’ని ప్రస్తావించి, జాతీయ హాకీ అకాడమీ లీగల్ కమిటీలోకి జైట్లీ కుమార్తె నియామకంలో ఆయన పాత్రపై దర్యాప్తు చేయాలని కోరారు. గిల్ నిషేధించబడిన ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు కూడా. జైట్లీ హాకీ ప్లేయర్ కాకపోయినా, ఇండియన్ హాకీ లీగ్‌కు సలహాదారుగా ఉండగా, అదే సంస్థ లీగల్ ప్యానల్‌లోకి కుమార్తెను ఎలా నియమింపచేస్తారు. ఇందులో భారీగా డబ్బులు చేయి మారి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.
“అర్థసత్యాలు, అందమైన అబద్ధాలు” ఆడటంలో జైట్లీ ప్రవీణుడని నిందిస్తూ ఆప్ ఆయనకు ఐదు ప్రశ్నలు సంధించింది. (1) 21వ శతాబ్దం కంపెనీ యజమాని ఎవరు? జైట్లీతో లోకేశ్‌శర్మ సంబంధం ఏమిటి? 2) హామీ ఇండియాకు ఒఎన్‌జిసి రూ.5కోట్లు ఎందుకు చెల్లించింది? ఆ ప్రభుత్వరంగ సంస్థను ఒత్తిడి చేసిందెవరు? (3) ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ గ్రౌండ్‌లో “చట్టవిరుద్ధంగా” కార్పొరేట్ బాక్స్‌లు ఎందుకు ఏర్పాటు చేశారు? (4) రూ.114 కోట్లకు స్టేడియం నిర్మాణంలో అవకతవకలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రూ.57కోట్లు ప్రభుత్వరంగ ఇపిఐఎల్‌కు చెల్లించగా, మిగతా సొమ్ము ఎవరికి వెళ్లింది? (5) మిగతా 9 కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందెవరు?
ఇదిలావుండగా, ఆర్థిక అక్రమాలకు డిడిసిఎ అంతర్గత నివేదిక పేర్కొన్న మూడు కంపెనీల అడ్రస్ ఒకటేనని కార్పొరేట్ మంత్రిత్వశాఖ రికార్డులు తెలుపుతున్నాయి.
కాబట్టి ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలకు ఆగ్రహం, లీగల్ నోటీసులు జవాబు కాదు. జైట్లీ కడిగిన ముత్యంలా బయటపడి నిజాయితీని నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి దర్యాప్తును ఎదుర్కోవటం ఉత్తమమార్గం. ఇదిలావుండగా, భారత మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణ్యంతో ఆప్ ప్రభుత్వం డిడిసిఎ వ్యవహారాలపై దర్యాప్తు సంఘాన్ని నియమించింది.