Home బిజినెస్ మళ్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అరుణ్ జైట్లీ

మళ్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అరుణ్ జైట్లీ

Arun Jaitley will be the Finance Minister again

ముంబై : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలల విరామం తర్వాత ఈ నెలాఖరులో మళ్లీ తన నార్త్ బ్లాక్‌లోకి అడుగుపెట్టనున్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చేరిన జైట్లీ మే నెలలో మూత్రపిండ మార్పిడి చికిత్స నిమిత్తం వెళ్లారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా జైట్లీ కోసం నార్త్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులోని కార్యాలయాన్ని పునరుద్ధరించి, శుభ్రం చేశారని, శస్త్రచికిత్స జరిగిన జైట్లీకి ఎలాంటి ఇన్‌ఫెక్షన్ సోకకుండా తగు చర్యలు చేపట్టినట్టు ఆయన చెందిన సన్నిహితులు చెప్పారు. వైద్యుల సూచన మేరకు జైట్లీ మూడు నెలల విరామం తీసుకున్నారు. ఆగస్టు రెండో వారం తర్వాత జైట్లీ విధుల్లోకి రానున్నట్లు తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో గత మే నెల నుంచి జైట్లీ విధుల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థికశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గోయల్ ఇటీవల జిఎస్‌టి, బ్యాంకుల మొండి బకాయిల వంటి సమస్యలపై చర్చలు నిర్వహించారు. అయితే పియూష్ గోయల్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికీ, అరుణ్‌జైట్లీ అడపాదడపా సోషల్‌మీడియా వేదికగా ఈ శాఖ కార్యకలాపాలపై స్పందిస్తున్నారు. ఇటీవల జిఎస్‌టి రేట్ల తగ్గింపు అంశంలోనూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. అసలు ఆర్థిక మంత్రి ఎవరు? అంటు ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేశాయి.