Home జాతీయ వార్తలు ఇతర రాష్ట్రాల రోగులూ మా మీద పడితే ఎలా?

ఇతర రాష్ట్రాల రోగులూ మా మీద పడితే ఎలా?

 

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. యావద్దేశ ప్రజలకు వైద్య సేవలను అందచేసే స్థితిలో ఢిల్లీ లేదని కేజ్రీవాల్ అన్నారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వైద్య చికిత్స కోసం ఇతర రాష్ట్రాల ప్రజలు దేశ రాజధానికి వస్తున్నందున ఢిల్లీలోని స్థానికులు ఆస్పత్రుల బయట కూలు కట్టాల్సి వస్తోందని ఆయన అన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమ వైద్య అవసరాల కోసం ఢిల్లీ మీద ఆధారపడటం ఒకరకంగా సంతోషమేనని ఆయన వ్యాఖ్యానించారు.ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులపై పడుతున్న భారాన్ని ప్రస్తావిస్తూ బీహార్‌కు చెందిన ఒక రోగి రూ. 500 రైలు టిక్కెట్ కోసం ఖర్చు పెట్టి ఇక్కడకు వచ్చి రూ. 5 లక్షల విలువైన వైద్య సేవలను ఉచితంగా పొంది వెళ్లిపోతున్నాడని కేజ్రీవాల్ చెప్పారు.

ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మన దేశ పౌరులే అయినప్పటికీ యావద్దేశ ప్రజల వైద్య అవసరాలను ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా తీర్చగలవని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీలోని ప్రజలకే తమ ఆస్పత్రులు వైద్య సేవలు అందచేస్తే ఒక్కో రోగి ఆస్పత్రిలో అరగంట కన్నా ఎక్కువ సేపు ఉండనక్కర్లేదని ఆయన చెప్పారు. ఇటీవల ఒక ఆస్పత్రిలో నిర్వహించిన సర్వే ప్రకారం 80 శాతం మంది రోగులు ఢిల్లీకి చెందనివారని తేలిందని ఆయన చెప్పారు. ఆదివారం సంజయ్ గాంధీ స్మారక ఆస్పత్రిలో 362 పడకల ట్రామా కేర్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal Calls For Better Healthcare Services, Says Delhi Residents Face Long Queues at Hospitals Because of Outsiders