Thursday, July 17, 2025

కెటిఆర్ చెప్పినట్టే చేశా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల వ్యవహారంలో అప్పటి మంత్రి కెటిఆర్ చెప్పినట్టే చేశానని, అలాగే ఎఫ్‌ఇఓ కంపెనీకి నిధులు మళ్లింపులో తన ప్రమేయం లేదని సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ అవినీతి నిరోధకశాఖ విచారణలో వెల్లడించారు. ఈ కేసులో నోటిసులు అందుకున్న ఎ2 నిందితునిగా ఉన్న అరవింద్‌కుమార్
ఎసిబి విచారణకు హాజరయ్యారు. ఎసిబి విచారణకు అరవింద్‌కుమార్ జనవరిలోనే హాజరైన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో గత నెల 16న మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎసిబి విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా కెటిఆర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అరవింద్ కుమార్‌ను తాజాగా మరోసారి ఎసిబి అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ కీలక అంశాలు వెల్లడించినట్టు సమాచారం.

ఫార్మూలా ఈ రేస్ కార్ నిర్వహించిన సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కెటిఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని, హెచ్‌ఎండిఎ ఖాతా నుంచి ఎఫ్‌ఇఓ కంపెనీకి నిధులు మళ్లింపులో తన ప్రమేయం లేదని అరవింద్‌కుమార్ వెల్లడించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కెటిఆర్ మంత్రి హోదాలో సంతకం చేసిన నోట్ ఫైల్ కాపీని ఎసిబి అధికారులకు అరవింద్‌కుమార్ అందజేసినట్టు తెలిసింది. అలాగే మంత్రి హోదాలో కెటిఆర్ స్వయంగా వాట్సప్ ద్వారా ఎఫ్‌ఇఓకు నిధులు విడుదల చేయాలని ఆదేశించిన అంశాన్ని కూడా ఎసిబి దృష్టికి అరవింద్‌కుమార్ తెచ్చినట్టు తెలిసింది. ఈ అంశంలో వ్యక్తిగత నిర్ణయం కాకుండా బిజినెస్ రూల్స్ పాటిస్తూ, ఆర్ధిక శాఖ అనుమతి తీసుకోవాలని కూడా తాను మంత్రికి సూచించినట్టు అరవింద్‌కుమార్ చెప్పారని తెలిసింది. అయినప్పటికీ తన మాట వినకుండా ఎఫ్‌ఇఓ కంపెనీకి నిధులు విడుదల చేయాలని మిగతా విషయాలన్నీ తాను చూసుకుంటానని కెటిఆర్ చెప్పినట్లు అరవింద్ కుమార్ వివరించినట్టు తెలిసింది. ఇలా ఉండగా ఎసిబి అధికారులు అరవింద్‌కుమార్‌ను ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News