Wednesday, April 17, 2024

ఆర్యులు వలసవాదులే!

- Advertisement -
- Advertisement -

Aryans were ones who migrated to India

ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చిన వారే అనే వాదన ఓ వంద సంవత్సరాలుగా మన దేశంలో చర్చోపచర్చలకు దారి తీస్తూనే ఉంది. ఈ విషయంలో ఏదైనా శాస్త్రీయ వాదన బలంగా తెరపైకి వచ్చినప్పుడల్లా కొందరు సంప్రదాయవాదులు, మతవాదులు ఒంటికాలుపై లేస్తూ ఆ శాస్త్రీయ దృక్పథాన్ని అడ్డుకోవడానికి అనేక కుతంత్రాలను ముందుకు తెస్తూ ప్రజలను అజ్ఞానంలోనే ఉంచేందుకు కృషి చేస్తున్నారు.

ఆర్యుల వలస వాదాన్ని ధ్రువీకరించే పరిశోధన పత్రాలను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైన్స్, నేచర్ పత్రికలు, సెల్ జర్నల్‌తో పాటు మరికొన్ని దేశ, విదేశీ పత్రికలు ఈ మధ్యనే ప్రచురించాయి. వాటి ప్రకారం మధ్య ఆసియా లోని నల్లసముద్రం -కాస్పియన్ సముద్రం మధ్యలో గల పచ్చిక బయళ్లలో నివసించే పశువుల కాపరులు సంచార జాతులకు చెందిన వారు క్రీ.పూ. 2000- క్రీ.పూ.1000 సంవత్సరాల మధ్య కాలంలో విడతలు విడతలుగా ఉత్తర భారతంలోని పశ్చిమ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారు ఇక్కడ స్థిరపడడంతో వారి భాష కూడా ఉనికిలోకి వచ్చింది. వారు తమను తాము ఆర్యులుగా చెప్పుకొన్నారు. అలా మన దేశంలో పురుడు పోసుకున్న ఇండో- ఆర్యన్ భాషనే మనం ‘సంస్కృతం’ అని పిలుస్తున్నాం. ఇదంతా ఓ రకంగా పాత కథే. మరి ఈ మధ్య కాలంలో చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, మానవ వికాస శాస్త్రజ్ఞులు, జన్యు శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న విషయాలు పైన చెప్పుకొన్న విషయాన్ని ఎలా బలపరుస్తున్నాయో చూద్దాం.

2014-16 సంవత్సరాల మధ్య ఒక పరిశోధన బృందం సింధులోయ నాగరికతను లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించడానికి హర్యానా రాష్ట్రంలోని ‘రాఖీగర్హి’ అనే ప్రాంతం లో తవ్వకాలు చేపట్టారు. ఈ పరిశోధన బృందంలో దక్కన్ కాలేజీ, పుణెకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుడు వసంత్ షిండే, బీర్బల్ షాహీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పలేవోసైన్సెస్స్, లక్నోకు చెందిన జన్యు శాస్తవేత్త నీరజ్ రాయ్, హార్వార్డ్ మెడికల్ స్కూల్, అమెరికాకు చెందిన జన్యు శాస్త్రవేత్త డేవిడ్ రీచ్ పాలుపంచుకున్నారు. 1920లో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు సింధు నాగరికతను వెలికితీసి అది వేదకాలంకు పూర్వముదని తేల్చి చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సింధు నాగరికత పై ఇంకా లోతైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

సింధు నాగరికత గొప్పగా విలసిల్లిన కాలములో ‘రాఖీగర్హి’ పట్టణ ప్రాతం బాగా అభివృద్ధి చెందింది. అక్కడ వసంత్ షిండే బృందం తమ తవ్వకాలలో కొన్ని అస్థి పంజారాలను వెలికి తీశారు. అందులో మంచి స్థితిలో ఉన్న ఒక అస్థిపంజారాన్ని (l6614) తమ పరిశోధనల నిమిత్తం ఎన్నుకొని దాని పై రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపారు. అది క్రీ.పూ. 4,470 (సుమారు 6,500 సంవత్సరాలు) ఏండ్ల పూర్వం నాటిదని, సుమారు 45 సంవత్సరాల వయసు కల్గిన ఓ స్త్రీ దని నిర్ణయించారు. అంతే కాకుండా అది సింధులోయ నాగరికత కాలంనాటిదని ధ్రువీకరించారు. గతంలో కూడా ఇరాన్, టర్క్మెనిస్తాన్ సరిహద్దుల్లో దొరికిన 11 అస్థిపంజారాలను ఈ అస్థిపంజరంతో పోల్చి చూసినప్పుడు ఈ 12 అస్థిపంజరాలు కూడా ఒకే కాలం నాటివని, ఒకే ప్రాంతానికి చెందినవిగా గుర్తించారు.

వాటిలో దొరికిన జన్యువులు కూడా ఒకే రకమైనవి. వాటి జన్యుక్రమంలో తొలి భారతీయుల, ఇరాన్ నుండి వచ్చిన వేటగాళ్ల ఆనవాళ్లు దొరికాయి. అంటే ఆ అస్థిపంజరాలు ఆర్యులు భారత దేశంలోకి వలస రాకంటే పూర్వం నాటివని తేలింది. సింధు నాగరికతకు చెందిన అప్పటి ప్రజలు సరిహద్దు దేశాలైన ఇరాన్, టర్కీ దేశాలతో వ్యాపారాలు చేయడం వలన వారు ఆయా దేశాలతో రాకపోకలు సాగించే వారు. కొందరు సింధులోయ వ్యాపారస్తులు ఆ దేశాలలోనే ఉంది వారి వ్యాపారాలు చూసుకునే వారు. అందుకే సింధు నాగరికుల అస్థిపంజారాలు ఆ దేశాలలో దొరికినవి.

సింధు నాగరికత అంతరించే నాటికి ఆర్యులు భారతావనికి వలస రాలేదనే విషయం ఇలా తెలుపోయింది. అందుకే సింధు నాగరికులు ఆర్యులతో అప్పటికి ఇంకా సంకరం చెందిన ఆనవాళ్ళు లభించలేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల జన్యువులను సేకరించి 1000 జీనోమ్ ప్రాజెక్ట్ (1k GP)ను జన్యు శాస్త్రవేత్తలు చేపట్టారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన చాలా మంది శాస్త్రజ్ఞులు పాల్గొన్నారు. అందులో భారతీయ శాస్త్రజ్ఞులు, హైద్రాబాద్ కు చెందిన సిసిఎంబి శాస్తజ్ఞులు కూడా పాలుపంచుకున్నారు.

భారతీయులకు సంబంధించి 140 జన్యు నమూనాలను ఈ జీనోమ్ ప్రాజెక్ట్‌లో చేర్చారు. సింధు నాగరికులకు సంబందించి తవ్వకాలలో బయల్పడిన 12 అస్థిపంజారాల డిఎన్‌ఎలను కూడా పరీక్షించారు. ఈ పరీక్షల్లో తొలి భారతీయుల (అందమానీస్) డిఎన్‌ఎ క్రమంతో పాటు భారతీయులు ఇరానీ వేటగాళ్లతో సంకరం చెందిన క్రమము అలాగే చాలా ఏండ్ల పిదప సింధులోయ ప్రజలు ఆర్యులతో సంకరం చెందడం, ఆర్యులతో సంకరం చెందిన ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులతో సంకరం చెందడంలాంటి డిఎన్‌ఎ సీక్వెన్సెస్ బయటపడ్డాయి.

భారతీయులలో 17.5% ఆర్యులకు చెందిన R1a- జన్యువులు ఉన్నట్లు తేలింది. ఇవి వై -క్రోమోజోమ్స్. ఈ వై -క్రోమోజోమ్స్ తండ్రి నుండి కుమారునికి మాత్రమే సంక్రమిస్తాయి. స్త్రీల నుండి మైట్రోకాండ్రియ క్రామోజోమ్స్ కూతురికి, కొడుకుకు సంక్రమిస్తాయి. ఆర్యుల నుండి ఉత్తర భారతీయులకు సంక్రమించిన జన్యువు (R 1a-z93) పురుషులదే కావడం వల్ల వలస వచ్చిన ఆర్యులు మగవారేనని తెలిసింది.

ఉత్తర భారతీయుల్లో దొరికిన వై క్రోమోజోమ్స్ ను మధ్య ఆసియా, పశ్చిమ యూరోప్‌లోని పురుషుల జన్యువు (R1a-Z282)ల తో పోల్చి చూడగా భారతీయ ఆర్యుల పూర్వీకులు మధ్య ఆసియాకు చెందిన వారుగానే గుర్తించారు. ఉత్తర భారతీయుల జన్యువులు ఆర్యుల జన్యువులతో సుమారు 4 వేల సంవత్సరాల క్రితం సంకరం చెందినట్లుగా తేలింది. ఉత్తర భారతదేశంలోని పూజారి(బ్రాహ్మణ) వర్గంలోనే ఆర్యుల జన్యువులు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పరిశోధన ఫలితాలు ఇలా రావడంతో ఆర్యులు భారతావనికి సుమారు 4 వేల సంవత్సరాల క్రితం వలస వచ్చినది నిజమేనని రుజువయ్యింది.

మన భారతీయ గడ్డపై నివసిస్తున్న మానవుల చరిత్రను క్లుప్తంగా పరిశీలిస్తే ….

భూగోళం పై ఉన్న ఇప్పటి ఖండాలన్నీ ఒకప్పుడు ఒక ముద్దగా కలిసి ఉండేవి. ఆ స్థితినే ‘గోండ్వాన సూపర్ కాంటినెంట్ ’ అని అన్నారు. తర్వాత కాలంలో భూభాగమంత వివిధ ఖండాలుగా విడిపోయింది. అప్పటికి మన భారత ఉపఖండం అనేది లేనేలేదు. కానీ, సుమారు ఐదున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పటి మన భారత భూభాగం ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ ప్రాంతం నుండి ఓ భూ ఫలకంగా విడిపోయి, ఇప్పటి హిందూ మహాసముద్రంలో కదులుతూ యూరో ఆసియన్ ఖండాన్ని బలం గా ఢీకొట్టింది. అలా ఇప్పటి మన భారత భూభాగం ఏర్పడింది.

సుమారు 65000 వేల ఏండ్ల క్రితం ఆఫ్రికా ఖండం నుండి కొన్ని మానవ సమూహాలు వేటాడుతూ భారత భూభాగంలోకి వచ్చి చివరగా అండమాన్ దీవుల్లో స్థిర నివాసంఏర్పర్చుకున్నాయి. వీరినే ‘తొలి భారతీయులు’ అని చరిత్రకారులు అంటున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఇరాన్ దేశం నుండి కొన్ని సమూహాలు వేటాడుతూ మనదేశం లోకి వచ్చి తొలి భారతీయులతో (అండమాన్ దీవులలో నివాసముంటున్న వారితో) కలిసి పోయినాయి. మరి కొంత కాలం తర్వాత అండమాన్ దీవులలో నివసిస్తున్న వారిలో చాలామంది ఉత్తర భారతంలోని పశ్చిమ దిశగా ప్రయాణించి సింధు లోయ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. అక్కడే వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ‘సింధులోయ నాగరికత’ను ఉనికిలోకి తెచ్చారు. సింధు నాగరికత సుమారు ఓ వేయి సంవత్సరాలు సుభిక్షంగా విలసిల్లింది. అక్కడి ప్రజలు నేటి ద్రావిడ భాషలాంటి భాషనే మాట్లాడేవారని భాష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తదుపరి అనేక కారణాలతో -ముఖ్యంగా విపరీతమైన కరువు కాటకాలతో- సింధులోయ నాగరికత అంతరించిందని చరిత్రకారులు నమ్ముతున్నారు.

ఈ దశలోనే అక్కడి ప్రజలలో కొంతమంది సింధులోయ ప్రాంతాన్ని వదిలి దేశంలోని దక్షిణ ప్రాంతానికి వచ్చి నివాసమేర్పరుచుకొన్నారు. వీరినే ‘అది దక్షిణ భారతీయులు’ గా చరిత్రకారులు గుర్తించారు. ఇక సింధులోయ ప్రాంతంలో మిగిలిపోయిన ప్రజలు అక్కడే స్థిరపడిపోయారు. వారినే ‘ఆది ఉత్తర భారతీయులు’ గా చరిత్రకారులు గుర్తించారు. కొంత కాలం పిదప ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుండి తమ పశువుల మందులను మేపుకుంటూ సింధులోయ ప్రాంతానికి వచ్చి అక్కడ అప్పటికే ఉన్న ప్రజలతో కలిసి జీవించసాగారు. ఈ విధం గా ఆది ఉత్తర భారతీయులతో ఆర్యులు సంకరం చెందారు. ఆర్యులు ఇలా వారి భాషను, మతాన్ని, సంస్కృతిని అభివృద్ధి చేసుకుని పదిలపర్చుకున్నారు. ఈ రకంగా ఉత్తర భారతీయుల దక్షిణ భారతీయుల మధ్య ఆహారపలవాట్లలో, భాషలో, ఆచార వ్యవహారాలలో భిన్నత్వం ఏర్పడింది. పై విధంగా తొలి భారతీయులు ఒక్కో దశలో ఇతరులతో సంకరం చెందుతూ పోయారు. ఇక ఇప్పుడు మనది సంకరమైన జాతి కాదనడానికి ఆస్కారమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారత భూభాగంలో ప్రస్తుతం నివసిస్తున్న మనందరం వలసవచ్చిన వారమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News