Home జిల్లాలు పసుపు వలసలకు.. గులాబీ ముల్లు!

పసుపు వలసలకు.. గులాబీ ముల్లు!

TRSకారెక్కిన టిడిపి ఎమ్మెల్యేల ఎదురీత
లెక్కచేయని టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు
ఆధిపత్యం కోసం అమీతుమీ
ఒకే పార్టీలో కత్తులు దూసుకుంటున్న
ప్రజాప్రతినిధులు
రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే,
కార్పొరేటర్ల అనుచరుల బాహాబాహీ
టిఆర్‌ఎస్‌లో మొదలైన కలకలం

మన తెలంగాణ/సిటీబ్యూరో : అధికార టిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు మొదలైందా..? తెలుగుదేశం పార్టీని వీడి అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా మారిందా…? టిఆర్‌ఎస్ తరపున విజయం సాధించిన కార్పొరేటర్లు పసుపు వలసల దూకుడుకు బ్రేక్ వేస్తున్నారా…? టిడిపి జెండాపై గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిందా…? సదరు ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్ల హవానే కొనసాగుతుందా..? ఈ విభేదాలు క్రమంగా ఊపందుకుని దాడులు చేసే వరకు వెళ్తున్నాయా…? సదరు ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరుతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారా…? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. టిఆర్‌ఎస్‌లో పాత…కొత్త వర్గాలుగా చీలి గ్రూపు రాజకీయాలను నేర్పుతుండటంతో అధికార టిఆర్‌ఎస్‌కు కొత్త సమస్య మొదలయింది. ప్రజల సమస్యలను పరిష్కరించి తమ ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే కార్పొరేటర్లకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా చేస్తామన్న కెసిఆర్ హామీ అధికార టిఆర్‌ఎస్‌లో చిచ్చుపెడుతుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అభివృద్ధి చేయాలన్న సదుద్ధేశ్యంతో సిఎం అన్న మాటలు భవిష్యత్ రాజకీయాలను నేర్పేందుకుగాను కార్పొరేటర్లను కయ్యానికి కాలుదూసేలా చేస్తున్నాయని పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల అనంతరం టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు అధిష్టానం…. అటు కిందిస్థాయిలో ఉన్న కార్పొరేటర్లతో చెడి ఎటూ కాకుండా పోతున్నామని సదరు ఎమ్మెల్యేలు లోలోపన మదనపడుతున్నట్లు సమాచారం. జిహెచ్‌ఎంసి ఎన్నికల తరువాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్‌లు టిడిపి నుంచి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే, బల్దియా ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను రంగంలోకి దిగి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో పోటీపడిన ఎమ్మెల్యేలు ఆనక ఫలితాలు ఘోరంగా రావడంతో ఎమ్మెల్యేలకు చావుదెబ్బ తగిలిన విషయమూ తెలిసిందే. అయితే, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే టిఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఆధిపత్యం కోసం అధికారిక కార్యక్రమాల్లోనూ పైచేయిగా నిలిచేందుకు పోటీపడుతుండడం టిఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు, ఆ నియోజకవర్గ కార్పారేటర్లకు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ నేతలు రెండువర్గాలుగా చీలి అమీతుమీకి సిద్ధమవుతుండటం విశేషం. ఎమ్మెల్యే పాల్గొనే సమావేశాలకు కార్పొరేటర్లు దూరంగా ఉంటున్నారని, ఒకే పార్టీలో ఉన్న కత్తులు దూసుకుని స్థాయిలో రాజకీయాలను నేర్పుతున్నారని టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే పార్టీలో చేరిన నాటినుంచి ప్రకాష్‌గౌడ్‌కు ఎదురీత తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరేందుకుగాను సిఎం బహిరంగ సభను ఏర్పాటుచేస్తే స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలకు మధ్యన ఆరంభంలోనే విభేదాలు తలెత్తి కత్తులు దూసుకునేస్థాయికి వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో చిన్నవిషయమై ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, స్థానిక కార్పొరేటర్ అనుచరులు ఇద్దరి సమక్షంలో దాడులు జరుపుకోవడం విశేషం. దీంతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు అవాక్కయ్యారు. శేరిలింగంపల్లిలో కూడా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లకు ఏమాత్రం పొసగడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరికి వారే హాజరు కావడం….పెద్ద ఎత్తున గ్రూపు రాజకీయాలను నేర్పుతుండటం కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది. ఇక జూబ్లీహిల్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు టిడిపిలో ఉండి ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై తిరగబడిన ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరాక బిక్కుబిక్కుమంటున్నట్లు తెలిసింది. పార్టీలో చేరేవరకు ఎంతో ప్రాధానత్య ఇచ్చిన అధిష్టానం ప్రస్తుతం పట్టించుకోకపోవడం…. కార్పొరేటర్లు ఏమాత్రం లెక్కచేయక పోవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలిసింది. కేవలం టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే ఈ దుస్థితి ఎదురవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసమే ఈ ఆధిపత్యం కొనసాగిస్తున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు మధ్య కొనసాగుతున్న పోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని…. అధిష్టానం ఇంకా జోక్యం చేసుకోకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని పార్టీ నేతలు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలలో అధికార టిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు జరుగుతున్నా అధిష్టానం ఏమాత్రం స్పందించడం లేదని సదరు కార్యకర్తలు వాపోతున్నారు. అధిష్టానం సత్వరమే జోక్యం చేసుకుని సరిదిద్దకపోతే… అభివృద్ధికి, పార్టీకి రెండింటికి పెద్ద సమస్యగా మారుతుందని కార్యకర్తలు పెదవి విరిస్తున్నారు.