Wednesday, April 24, 2024

మోడీ తాజా ఏడాది పాలన

- Advertisement -
- Advertisement -

As the First Year of Narendra Modi Ruling

అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా కళింగ యుద్ధాన్ని గెలిచినప్పటికీ ఆయన తర్వాత న్యాయం కోసం నిలబడ్డాడు. కళింగ యుద్ధంలో విధ్వంసం, వినాశం అశోకుడిలో మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు దేశంలో కరోనాతో యుద్ధం చేస్తున్నాము. ఈ యుద్ధం కూడా ప్రజల జీవితాలను విధ్వంసం చేసింది, విషాదకరమైన దురవస్థలోకి ప్రజలు నెట్టివేయబడ్డారు. ఈ పరిస్థితులు దేశప్రధాని నరేంద్ర మోడీలోను అలాంటి పరివర్తనకు కారణమవుతుందా? ప్రజల జీవితాలను బాగు చేయడానికి, ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారా.

ఏడాది క్రితం నరేంద్ర మోడీ రెండోసారి ఘన విజయం సాధించి ప్రధానిగా పదవినధిష్ఠించారు. బలమైన నాయకత్వం ఇస్తారని నమ్మి ప్రజలు ఓటు వేశారు. ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించి బలమైన నాయకత్వం మోడీ అందిస్తారని ప్రజలు నమ్మారు. కాని మోడీ మాత్రం తనకు లభించిన విజయం, సంఘ్ పరివార్ సిద్ధాంతాలకు ప్రజలు వేసిన ఓటుగా పరిగణించారు. ఆ వెంటనే ఆయన జమ్ము కశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. సుదీర్ఘమైన లాక్‌డౌన్ కశ్మీరు ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. భారత అనుకూల రాజకీయ నాయకులందరినీ జైళ్ళలో పెట్టారు. త్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. యూనిఫాం సివిల్ కోడ్ దిశగా తాను పనిచేస్తున్నట్లు చూపించారు. ముస్లిం పురుషులకు తక్షణమే విడాకులు తీసుకునే అవకాశాన్ని తొలగించడమే కాదు, అది శిక్షార్హమైన నేరంగా చేశారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, సుప్రీంకోర్టు అయోధ్య కేసులో తీర్పు చెప్పింది. తీర్పు రామజన్మభూమి నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. బిజెపి వాగ్దానాల్లో ఇది ముఖ్యమైనది. ఆ వెంటనే మోడీ చేపట్టిన చర్య, పౌరసత్వ సవరణ చట్టం. ఈ చట్టం తీసుకురావడానికి కారణంగా చూపించిందేమిటంటే, పొరుగు దేశాల్లో మత వివక్షను ఎదుర్కొంటున్న ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం కట్టబెట్టడం. కాని హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో స్పష్టంగా క్రోనాలజీ గురించి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం తర్వాత జాతీయ పౌర జాబితా తీసుకువస్తామని అన్నారు. ఆ తర్వాత, సరయిన పౌరసత్వ పత్రాలు లేని ముస్లిమేతరులకు పౌరసత్వ చట్టం ద్వారా పౌరసత్వం కల్పిస్తామన్నారు. మిగిలిన లక్షలాది ప్రజలు, పౌరసత్వ పత్రాల్లో లోపాలు ఉన్నవారిని చొరబాటుదారులుగా పరిగణిస్తారు. వారిని డిటెన్షన్ కేంద్రాలకు తరలిస్తారు.

పౌరసత్వం విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా మతాన్ని ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. ఇదంతా ముస్లిముల పౌరసత్వాన్ని రద్దు చేసే కుట్రలో భాగంగా అనుమానాలు బలపడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటన, నిరసనలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మతపరమైన హింసాకాండ జరిగింది. ఢిల్లీ పోలీసులు (కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పని చేసే విభాగం) ఏవిధంగా హింసాకాండకు పాల్పడుతున్న దుండగులను అదుపు చేయడంలో విఫలమయ్యారో చూపించే అనేక విడియోలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, దుండగులకు, అల్లరిశక్తులకు పోలీసులు సహాయం చేస్తున్న విడియోలు కూడా వచ్చాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బిజెపి నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఒకవైపు ఈశాన్య ఢిల్లీ తగలబడుతున్నప్పుడు మోడీ తదితరులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పార్టీలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమానికి రెండు వారాల ముందే, రాహుల్ గాంధీ కరోనా వైరస్ గురించి హెచ్చరించారు. కరోనాను అదుపు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. కాని ప్రభుత్వం ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. ఒక నెల తర్వాత రాజ్యసభలో, నేను స్వయంగా పార్లమెంటును వాయిదా వేయాలని కోరాను. కాని కోవిద్ 19 సవాలును పార్లమెంటు సభ్యులు ధైర్యంగా ఎదుర్కోవాలంటూ నాపై వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి పడగొట్టడం పూర్తయిన తర్వాత బిజెపి నేతలు తాము చెప్పిన మాటలు, కోవిద్ 19ను ధైర్యంగా ఎదుర్కోవాలనే మాటలు పక్కన పెట్టి పార్లమెంటు వాయిదా వేశారు. ఆ తర్వాత, కేవలం నాలుగు గంటల వ్యవధినిచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దేశ ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారి సడన్ బ్రేకుతో ఆగిపోయినట్లయ్యింది. లక్షలాది వలసకూలీలు కాలినడకన వందలాది కిలోమీటర్లు నడిచే వలసలు ప్రారంభమయ్యాయి. వారి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులు అమానుషంగా వ్యవహరించే అనేక వార్తలు ముందుకు వచ్చాయి. ఈ వలసకూలీల్లో కొందరు దారిలోనే మరణించారు. వలసకూలీల పాదయాత్రలు దేశంలో సాధారణ ప్రజల దీనావస్థను ప్రపంచం ముందుకు తీసుకువచ్చాయి. గ్రామీణ భారతదేశంలోని యువతరం అతి తక్కువ జీతభత్యాలకు, భద్రతలేని పరిస్థితుల్లో, దోపిడీకి గురైనా ఫర్వాలేదనుకుని దూరదూర ప్రాంతాలకు చిన్నచిన్న పనులు చేసుకుని తమ కుటుంబాలకు కొంత సొమ్ము పంపడానికి వలసపోతున్న దురవస్థ స్పష్టంగా మన ముందుకు వచ్చింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోడీ ఇచ్చిన వాగ్దానం వారి విషయంలో అమలు కాలేదు. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థికవ్యవస్థగా మారే దారిలో శరవేగంగా ప్రయాణిస్తుందన్న విషయం కూడా వారికి అర్థం కాలేదు.

ఆర్ధికవ్యవస్థకు సంబంధించిన ఈ ఇబ్బందికరమైన వాస్తవాలు దిగ్భ్రాంతికరంగా ముందుకు వచ్చాయి. అసలు డేటా ఏదీ లేకుండా ప్రభుత్వం చేయడం వల్లనే ఒక్కసారిగా ఈ వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగించాయి. లేబర్ సర్వేల్లో పెరుగుతున్న నిరుద్యోగం గురించి వివరాలు బయటకు వస్తున్నప్పుడు ప్రభుత్వం అసలు సర్వేలనే ఆపేసింది. నేషనల్ శాంపుల్ సర్వే పేదరికం, పోషకాహారలోపం పెరుగుతోందని హెచ్చరించినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆహారం కోసం ఖర్చును కూడా తగ్గించేస్తున్నారని చెప్పినప్పుడు ప్రభుత్వం ఈ సర్వేనే పక్కన పాడేసింది. సాంకేతిక కారణాలు చూపించి సర్వేను నిర్లక్ష్యం చేసింది. మోడీ 2.0, మొదటి సంవత్సరంలో కనిపిస్తున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, కార్యనిర్వాహక విభాగానికి, న్యాయ విభాగానికి మధ్య విభజన లేకుండా పోయింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు ఆయన రిటైర్ అయిన వెంటనే నామినేట్ చేశారు. వివిధ సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట బిగించేస్తోందన్న అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. న్యాయవ్యవస్థ కూడా అనేక కీలకమైన విషయాల్లో, మానవ హక్కులు భంగపడుతున్న విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా దూరంగానే ఉంటోంది.

ప్రభుత్వం వలసకూలీల పట్ల నిర్లక్ష్యమే కాదు, సానుభూతిలేని వైఖరి చూపించింది. ఎన్‌ఆర్‌సి ద్వారా చొరబాటుదారులను ఏరి పారేయడానికి వీరావేశం ప్రదర్శించిన ప్రభుత్వం వలసకూలీల విషయంలో ఎందుకు నిరాసక్తంగా వ్యవహరించింది? గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ఎందుకు దూర ప్రాంతాలకు వలసపోయి పని చేస్తున్నారనే విషయం గురించి ముందుగా ఆలోచించి వుంటే, వలసకూలీల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయగలిగి ఉండేవారు. లాక్‌డౌన్‌లో వలస కూలీలు ఈ అమానుష కష్టాల పాలు కాకుండా కొంతవరకైనా కాపాడేవారు.

ఆర్ధిక వ్యవస్థ విషయానికి వస్తే, ప్రభుత్వం వాస్తవాలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉందా? కోవిద్ 19 లాక్‌డౌన్ కన్నా ముందే భారత ఆర్ధిక వ్యవస్థలో డిమాండ్ అడుగంటిందనే వాస్తవం ముందే గ్రహించవలసింది. పెట్టుబడులు, విద్యుత్ వాడకం, ఆహారేతర రుణాలు, జిడిపి వృద్ధి అన్ని ఎప్పటి నుంచో పతనమవుతున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఇప్పటికి కూడా డిమాండ్ పెంచకపోతే ప్రయోజనం లేదని గుర్తించడం లేదు. ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పథకం ప్రకటించింది. ప్రజల చేతుల్లో నగదు లభించి, డిమాండ్ పెరక్కపోతే ఈ 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకం సాధించేది శూన్యం. భారతదేశం ఆర్ధిక పతనాన్ని, కరోనా సంక్షోభాన్ని రెండింటిని ఎదుర్కొంటున్నది.

ఈ ఆర్ధిక పతనం మోడీ 1.0 పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల ఫలితమే. రానున్న కొన్ని నెలలు భారత భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నది స్పష్టం. ఈ సమయంలో భారత ప్రజలందరూ సమైక్యంగా ఈ సంక్షోభాలను ఎదిరించి నిలబడే ప్రయత్నం చేయవలసి ఉంది. ఒక్క వ్యక్తయినా తన స్వంత సైద్ధాంతిక ఎజెండా కోసం ఇతర ప్రయత్నాలు ప్రారంభిస్తే దేశ భవిష్యత్తును దెబ్బతీసినవాడే అవుతాడు. ఇండియా ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. భారతదేశాన్ని మళ్ళీ అభివృద్ధి పథాన పెట్టాలంటే మోడీ ఆర్ధికవ్యవస్థకు మరమ్మత్తులు చేయాలి. పేదల కష్టాలను తగ్గించాలి. మతతత్వ ఎజెండాను వదిలిపెట్టాలి. అలా కాకుండా తనకు లభించిన ఓట్లు మతపరంగా ప్రజలను చీల్చడానికి ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తారా? (కోవిద్ 19 సంక్షోభంలోనూ మత ఉద్రిక్తతలు పెరిగాయి). చరిత్ర అనేక గుణపాఠాలను నేర్పుతుంది. చరిత్రపై తన ముద్ర వేయాలనుకునేవారు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. భారతదేశం కోసం, మోడీ సరయిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.

* రాజీవ్ గౌడ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News