Home ఎడిటోరియల్ ట్రంప్ స్వప్రయోజక పర్యటన

ట్రంప్ స్వప్రయోజక పర్యటన

Sampadakiyam     అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తానెందుకు ఇక్కడికి వచ్చాడో ఆ పని చాలా వరకు పూర్తి చేసుకొని వెళ్లాడు. 3 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ రక్షణ ఉత్పత్తులను మన చేత కొనిపించడానికి ఉద్దేశించిన ప్రధాన ఒప్పందాన్ని సాధించుకున్నాడు. అమెరికన్ వ్యవసాయ, పాడి, కోడి, పారిశ్రామిక ఉత్పత్తులను భారీగా మన మార్కెట్‌లో అమ్ముకోడానికి సంబంధించిన వాణిజ్య ఒప్పందం అయితే ప్రస్తుతానికి వాయిదాపడిందిగాని వచ్చే ఆరేడు మాసాల్లో దానినీ నెరవేర్చుకోడానికి తగిన పునాదిని ట్రంప్ వేసుకొని వెళ్లాడు. వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందు ఈ ఒప్పం దం ఖరారయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడని బోధపడుతున్నది. ఆ విధంగా ఎన్నికల్లో తాను లబ్ధి పొందేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకున్నట్టు స్పష్టపడుతున్నది.

ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌దే పై చేయిగా ఉన్నదని, అమెరికన్ వస్తువులపై ఇండియా భారీగా సుంకాలు విధిస్తున్నదనీ ఇక్కడికి బయల్దేరడానికి ముందే ప్రకటించిన ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అదే మాట నొక్కి చెప్పాడు. ప్రధాని మోడీ ఎంత మంచి వాడో అంతటి ఘటికుడు, గడుసువాడు అనడంలో ట్రంప్ ఉద్దేశం వాణిజ్య సంబంధాల విషయంలో భారత్ మరింతగా దిగిరావాలన్నదేనని స్పష్టపడుతున్నది. అది జరిగి అమెరికన్ సాగు, పాడి, కోడి ఉత్పత్తులకు మన మార్కెట్ గేట్లు భారీగా తెరుచుకుంటే మన రైతులు మరింతగా నష్టపోతారు. ఈ సంగతి మన ప్రజలకు ఇప్పటికే బాగా తెలిసిపోయింది. దేశం గగ్గోలెత్తుతుందనే భయంతోనే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తుతానికి ట్రంప్, మోడీలు పక్కన పెట్టారనిపిస్తున్నది. ఇప్పటి వరకు వాణిజ్యంలో అమెరికా మన పట్ల ప్రదర్శించిన పగ సాధింపు వైఖరి తెలిసిందే.

మన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించింది. కొన్ని రకాల సామగ్రిని ఎటువంటి సుంకాలు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసుకోడానికి చిరకాలం పాటు అవకాశమిచ్చిన జనరలైజ్డ్ సిస్టమ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జిఎస్‌పి) దేశాల జాబితా నుంచి ఇండియాను తొలగించింది. దీని వల్ల 6 బిలియన్ డాలర్ల పైగా కిమ్మత్తు గల భారతీయ ఎగుమతులపై వ్యతిరేక ప్రభావం పడింది. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్‌కు ఉన్న వర్ధమాన దేశం హోదాకు అమెరికా ఎసరు పెట్టించింది. ఇలా మన సువిశాలమైన మార్కెట్‌ను తన సరకులకు మరింతగా అందివచ్చేలా చేసుకోడానికి తీవ్రమైన ఒత్తిడి వ్యూహాన్ని, కాళ్ల బేరానికి రప్పించుకునే చర్యలను అమెరికా ముమ్మరింప చేసింది. అదే సమయంలో ట్రంప్ పెదాలకు తేనె పూసుకొని ఈ పర్యటనకు వచ్చాడు.

అమెరికన్ కంపెనీల నుంచి యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ఆయుధాలను మనం కొనుగోలు చేయడానికి వీలుగా భారీ రక్షణ ఒప్పందాన్ని సాధించుకున్నాడు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేయగల అవకాశమున్న బెర్నీ శాండర్స్ దీనిని తీవ్రంగా విమర్శించాడు. భారత దేశంతో కలిసి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పని చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి బదులు ట్రంప్ రేథన్, బోయింగ్, లాక్‌హీడ్ ఆయుధ కంపెనీలకు మేలు చేసే ఒప్పందాన్ని సాధించుకున్నాడని ఆయన ఎద్దేవా చేశాడు. గతంలో ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రిని ఎక్కువగా రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకునేవాళ్లం. అలాగే ఇటీవలి వరకు ఆయిల్‌ను ఇరాన్, ఇరాక్ నుంచి సమకూర్చుకుంటూ వచ్చాం. ఇరాన్ నుంచి సులభతర షరతుల మీద ఆయిల్ మనకు వచ్చేది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆంక్షలను మళ్లీ విధించి ఆ మేరకు మనకు అవసరమైన ఆయిల్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేలా చేసింది. ఆయుధాలను కూడా రష్యా నుంచి కాక అమెరికా నుంచి కొనుక్కునేలా చేసింది.

ఈ పర్యటన అడుగడుగునా ప్రధాని మోడీని ప్రశంసలలో ముంచెత్తడం ద్వారా ట్రంప్ తనకు కావలసింది చాకచక్యంగా సాధించుకోగలిగాడు. పాక్ ప్రభుత్వం మెడలు వంచి అక్కడి భారత వ్యతిరేక ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేలా చేయడానికి యత్నిస్తున్నట్టు కనిపిస్తున్న ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో తనకు సత్సంబంధాలున్నాయని ప్రకటించాడు. కశ్మీర్ చాలా సున్నితమైన సమస్య అని భారత, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు జరగాలని, మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి తన పాత విధానాన్నే పునశ్చరణ చేశాడు. దేనికైనా రెండు పార్శాలుంటాయని చెప్పి మన వాదనే వాస్తవం అనుకోడానికి వీల్లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు. ఢిల్లీలో తన పర్యటన సాగుతున్నప్పుడే ఇక్కడ పది మందిని పొట్టనబెట్టుకున్న సిఎఎ అంశం భారత్ ఆంతరంగిక వ్యవహారమన్నాడు. ఇక్కడి ముస్లింలు భయపడనవసరం లేదని మోడీతో తనతో చెప్పినట్టు ప్రకటించాడు. అంతిమంగా భారత దేశంలో గల 140 కోట్ల జనాభాతో కూడిన విశాలమైన మార్కెట్‌కే అమెరికా అధ్యక్షుడు ప్రాధాన్యమిచ్చాడని స్పష్టపడింది.

As Trump Visits India, a Trade Deal Remains Elusive