Wednesday, April 24, 2024

పివి ఆర్థికవేత్త కాదు… సంఘ సంస్కర్త కాదు

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi criticized PV Narasimha rao

 

కాంగ్రెస్ చరిత్రలో వివాదాశీల నేత పివి నరసింహారావు
ట్వీట్‌లో పివిపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ

మనతెలంగాణ/హైదరాబాద్ : పివి శతజయంతి వేడుకలు ప్రారంభమైన వేళ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పివి నరసింహారావును విమర్శించారు. పివి ఆర్థికవేత్త కాదని, సంఘ సంస్కర్త కాదంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చరిత్రలో వివాదాశీల నేత పివి అని అసద్ అభివర్ణించారు. పివిని విమర్శిస్తూ రాసిన ఓ పాత న్యూస్ ఆర్టికల్‌ను ఓవైసీ తన ట్వీట్‌కు అటాచ్ చేశారు. బాబ్రీ కూల్చివేతపై ఓ పుస్తకాన్ని కోట్ చేస్తూ ఏం అవార్డులు ఇచ్చారన్నది ముఖ్యం కాదని, ప్రధానిగా ఉండి బాబ్రీ మసీదు కూల్చివేతకు అనుమతిచ్చిన అదే ప్రదేశంలో ఆలయ నిర్మాణానికి సహకరించిన వ్యక్తిగా చరిత్ర పివిని గుర్తుంచుకుంటుందని ఓవైసీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బిజెపి తొలి ప్రధాని పివి నరసింహారావు అని స్కాలర్ ఏజి నూరానీ కరెక్ట్‌గానే చెప్పారని తన ట్వీట్‌లో ఓవైసీ పేర్కొన్నారు.

ఒప్పంచి మెప్పించిన అప్పటి సిఎం వైఎస్

పివి హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటుచేసుకుంది. యూపిఏ 1లో భాగస్వామిగా ఉన్న ఎంఐఎం 2008 సంవత్సరంలో మాసబ్‌ట్యాంక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ వేకు పివి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించింది. అప్పటి సిఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంఐఎం నాయకులను ఒప్పించి పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేయించారు.

బిజెపి పార్టీ ఆగ్రహం

ప్రస్తుతం పివిపై ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసద్ వ్యాఖ్యలు ఎంఐఎం సంకుచిత మనస్తత్వాన్ని తెలియచేస్తున్నాయని బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎంఐఎం పార్టీ నాయకులు పివి ఆర్థిక సంస్కరణ ఫలాలను ఆస్వాదిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి గొప్ప వ్యక్తిపై చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డగా పివికి ఎంఐఎం గౌరవం ఇవ్వాలన్నారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలను ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అసదుద్దీన్ పివిపై వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News