Friday, March 29, 2024

బలనిరూపణకు కాదు.. కరోనాపై చర్చించేందుకే

- Advertisement -
- Advertisement -

Ashok Gehlot seng proposal for assembly session to gov
31న అసెంబ్లీని సమావేశపర్చండి
రాజస్థాన్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి గెహ్లోట్ తాజా లేఖ
జైపూర్: రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటిదాకా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తాజాగా మరో ఎత్తుగడ వేశారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో ఈ నెల 31నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. శనివారం పొద్దుపోయిన తరన్వాత ఈ ప్రతిపాదన అందినట్లు రాజ్‌భవన్ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. కరోనా నియంత్రణ, పరీక్షలు సహా పలు అంశాలను చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని అజెండాలో ప్రస్తావించారు. కానీ బలపరీక్ష అంశం అజెండాలో ఎక్కడా ప్రస్తావించలేదు.

దీనిపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే గవర్నర్‌కు రాసిన లేఖలో బలపరీక్ష అంశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా విరమించిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం శనివారం మరోసారి సమావేశమై తాజా అజెండాతో లేఖను రూపొందించినట్లు తెలుస్తోంది. వ్యూహంలో భాగంగానే సిఎం ఈ కొత్త ఎత్తుగడ వేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే మూడు సార్లు గవర్నర్ కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన ముఖ్యమంత్రి శాసనసభలో బలపరీక్షకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ఎంతకీ స్పందించకపోవడంతో శుక్రవారం తనవర్గం ఎంఎల్‌ఎలతో కలిసి రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు కూడా దిగారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆరు అంశాలపై వివరణ కోరారు. తాను రాజ్యాగం ప్రకారం మాత్రమే నడుచుకుంటానని, ఒత్తిడితో ఎలాంటి నిర్ణయం తీసుకోనని కూడా గవర్నర్ వారికి స్పష్టం చేశారు. అసెంబీల సమావేశాలను అత్యవసరంగా ఎందుకు ఏర్పాటు చేయాలో స్పష్టమైన కారణాలు తెలుపుతూ మరోసారి లేఖ సమర్పించాలని గవర్నర్ ముఖ్యమంత్రి గెహ్లోట్‌ను కోరినట్లు గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

తొలిసారి సమర్పించిన కేబినెట్ నోట్‌లో ఏ రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలో లేదని, అలాగే కారణాలు, అజెండా కూడా పేర్కొనలేదని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నోట్‌లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ను కట్టడి చేయడానికి తీవ్రంగా కృషి చేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మరో వైపు సోమవారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా రాజ్‌భవన్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రాజ్‌భవన్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డిజిపి భూపేందర్ యాదవ్ ఆదివారం గవర్నర్‌ను కలిసి వివరించారు.

Ashok Gehlot seng proposal for assembly session to gov

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News