Home కరీంనగర్ అప్పు చేసిన పాపానికి ఆస్తులు కోల్పోయాం

అప్పు చేసిన పాపానికి ఆస్తులు కోల్పోయాం

Mohan-reddyకరీంనగర్ క్రైమ్ : పోలీస్ ముసుగులో కరీంనగర్ సిఐడి విభాగానికి చెందిన ఎఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డి సాగించిన అక్రమ వడ్డీ వ్యాపారంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మోహన్‌రెడ్డి వద్ద అప్పు తీసుకున్న పాపానికి అనేక మందికి నిలువనీడలేకుండా పోయింది. వడ్డీకి వడ్డీ బారువడ్డీ, చక్రవడ్డీ లెక్కకట్టడంతో బాధితుల అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఇదేం లెక్క అని ప్రశ్నించిన బాధితులకు గన్‌తో బెదిరింపులు, భౌతికదాడులకు గురయ్యారు. అప్పు చేసిన పాపానికి స్థిర ఆస్థులు కోల్పోయి పుట్టెడు కష్టాలను ఆనుభవిస్తున్నారు.

మోహన్‌రెడ్డి కేసు నీరుగార్చుతున్నారా…?
అక్రమ ఫైనాన్స్ దందా, కెన్ క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మ హత్య కేసు ను అధికార పార్టీ నాయకులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి, మరో కొంత మంది అధికారులపై చర్యలను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ ఉన్న తాధికారి తనను అరెస్ట్ చేస్తే.. విచారణ చేస్తే..ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు గురిచేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. జ్ఞానేశ్వర్ స్టేట్‌మెంట్‌లో ఎన్నో అంతుచి క్కని విషయాలు బయటపడ్డాయి. జ్ఞానేశ్వర్ చెప్పిన పేర్లలోని పోలీస్ అధికారులపై సిఐడి అధికారుల చర్యలు తీసుకుంటారా..! లేదా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌రెడ్డి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంటే…కొద్ది రోజుల నుంచి సిఐడి అధికారులు కొత్త వ్యక్తులను మాత్రం అరెస్ట్ చూపడంలేదు.

ముప్పైయి లక్షల వడ్డీ కట్టిన: తంగెళ్ల అనిల్ కుమార్, సాయినగర్
2007లో వ్యాపార అవసరం కోసం ఏఎస్సై మోహన్ రెడ్డి వద్ద 12లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని 30లక్షల వరకు వడ్డీ కట్టిన. కొద్ది రోజులు వ్యాపారంలో ఇబ్బందులు రావడంతో వడ్డీ కట్టలేకపోవడంతో నేను తనాఖా పెట్టిన ఆస్తిని ఉజ్వల ఫైనాన్స్‌కు అమ్మేశాడు. నా భార్య మాజీ కౌన్సిలర్, నాన్న, అన్నలు పోలీసు రిటైర్డ్ అధికారులు కావడంతో బయటికి చెప్పలేకపోయాను. కొద్ది రోజుల తర్వాత రౌడీలను తీసుకువచ్చిన మోహన్ రెడ్డి నాపై దాడిచేసి నేను నిర్వహిస్తున్న బేకరి సిబ్బందిని కొట్టి బలవంతంగా షాపుకు తాళంవేసి తీసుకొని పోయాడు. ఎస్పీగారు నాకు న్యాయం చేయాలి.

జిల్లా ఎస్పీ కార్యాలయన్నే ఫైనాన్స్ ఆఫీస్ చేశాడు: మహేందర్ రెడ్డి , మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు
ఏ ఎస్.ఐ మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందాను స్వయంగా జిల్లా ఎస్పీ ఆఫీసులోనే నిర్వహించేవాడు. గతంలో ఎన్నో సార్లు మోహన్‌రెడ్డి తుపాకులతో బెదిరించేవాడని చాలా సార్లు చెప్పిన. కేసీఆర్ తెలంగాణ కోసం ఎలా పోరాటం చేసి సాధించాడో అదే విధంగా మోహన్‌రెడ్డి బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తా. మోహన్‌రెడ్డి వ్యవహరంలో నిర్భయంగా వార్తలు రాస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు ప్రత్యేకంగా దన్యవాదములు తెలుపుతున్నా.

ఐదు లక్షల కోసం కోటి యాభై లక్షల ఇళ్లు జప్తు చేశాడు: తాటి ప్రమీళ , మోహన్‌రెడ్డి బాధితురాలు, భగత్‌నగర్
భగత్‌నగర్ నివాసినైన నేను ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి వద్ద 2009 లో అవసరం నిమిత్తం 5 లక్షల రూపాయాలు అప్పుగా తీసుకున్నాం. అప్పుతీసుకునే సమయంలో మోహన్‌రెడ్డి తమ్ముడైన మహేందర్ రెడ్డి పేరుమీద నా ఇళ్లు, భూమిని జీపీఏ కంసెల్ డీడ్ చేయించారు. ఆ విషయం కూడ నాకు తెలియదు. నాకు తెలిసిన అతనే నా భూమిని మోహన్‌రెడ్డి బంధువులపై రిజిస్ట్రేషన్ చేయించిండు. తీసుకున్న పైసలు కట్టి భూమిని ఇడిపించుకుందామంటే నన్ను, నా భర్తను బెదిరింపులకు గురిచేశాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పనికావడం లేదు. ఇప్పటికైనా పోలీసులు కలగజేసుకుని నాకు న్యాయం చేయాలని లేకపోతే సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటా.

తుపాకీతో బెదిరించాడు: ఎండీ ముజీబ్, గోదాంగడ్డ
2006లో మోహన్‌రెడ్డి దగ్గర నా ఆరోగ్య ఖర్చులకు 5 లక్షలు అప్పు తీసుకున్నాను. అయితే దానికి నా ఇల్లును తనాఖాపెట్టి తీసుకుంటే ఖర్చులకని అందులో 80 వేలు తీసుకొని మిగితా డబ్బులు ఇచ్చాడు. కొద్ది రోజులు కట్టిన తర్వాత ఆర్థికంగా సర్దుబాటు కావపోవడంతో కొద్ది రోజులు మిత్తి కట్టడం అపేశా. మోహన్‌రెడ్డి అనుచరులు పూదరి శ్రీనివాస్ రాత్రి సమయంలో నా ఇంటికి వచ్చి పడుకున్న నా చిన్న పిల్లల తలపై తుపాకి పెట్టి…అప్పు కడుతవా…నీ పిల్లలను చంపేయమంటా అని నానా రకాలుగా బూతులు తిడుతూ…ఇంట్లోనే పూదరి శ్రీనివాస్ మూత్రం పోసేవాడు. అయితే మోహన్‌రెడ్డి అరాచకాలు భరించలేక కరీంనగర్ వదిలిపెట్టి హైదరాబాద్‌లో నా కుటుంబం మొత్తం బట్టల దుకాణంలో పనిచేసుకొని బతుకుతున్నాం. కబ్జా చేసిన ఇంటిని నాకు ఇప్పించాలని వేడుకుంటున్నా.