Home స్కోర్ నేటి నుంచి ఆసియా రెజ్లింగ్

నేటి నుంచి ఆసియా రెజ్లింగ్

Wrestling

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమయ్యే ఈ చాంపియన్‌షిప్ మే 14 వరకు కొనసాగుతుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో సహా ఆసియాకు చెందిన వివిధ దేశాల రెజ్లర్లు పాలు పంచుకోనున్నారు. భారత జట్టుకు ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ సారథ్యం వహిస్తోంది. ఫ్రిస్టయి ల్‌లో 112, గ్రేకొ రొమాన్ విభాగంలో 103 మంది రెజ్లర్లు పతకాల కోసం పోటీ పడనున్నారు. ఈ టోర్నీలో 83 మంది మహిళా రెజ్లరు కూడా బరిలోకి దిగనున్నారు. మొత్తం 24 స్వర్ణాలు, 24 రజతాలు మరో 48 పతకాల కోసం రెజ్లర్లు పోటీ పడనున్నారు. ఇరాన్, ఉజ్బెకిస్థాన్, కజాకిస్థాన్, కిర్గిస్థాన్, జపాన్, కొరియా, చైనా, మంగోలియా దేశాలకు చెందిన రెజ్లర్లు అభిమానులను కనువిందు చేయనున్నారు. మరోవైపు ఆతిథ్య భారత్ కూడా భారీ ఆశలతో పోటీలకు సిద్ధమైంది. దీని కోసం 24 మందితో కూడిన జట్టును భారత రెజ్లింగ్ సమాఖ్య ఎంపిక చేసింది. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ 58 కిలోల విభాగంలో పోటీ పడనుంది. స్టార్ రెజ్లరు యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, పోగత్ సిస్టర్స్ గీత, బబితాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నారు. అయితే సందీప్ తొమర్, బజరంగ్, జితేందర్, సత్యవర్త్ కడియన్, సుమిత్ తదితరులు పోటీల్లో పాలు పంచుకుంటున్నారు. గతంలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా రెజ్లింగ్‌లో భారత రెజ్లర్లు అద్భుత ప్రతిభతో పతకాల పంట పండించారు. ఈసారి సొంత గడ్డపై మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.