Home తాజా వార్తలు నేటితో ప్రచా’రణాని’కి తెర

నేటితో ప్రచా’రణాని’కి తెర

Assembly election campaign ends Today

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే రాష్ట్రంలో హోరెత్తిన ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కొన్ని చోట్ల సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. ఈ ప్రచార హోరులో ఏనాడూ తెలంగాణ గడ్డనెరగని వివిధ పార్టీలకు చెందిన చాలా మంది సీనియర్ నేతలు దండయాత్రకు వచ్చినట్లుగా ప్రచారానికి తరలివచ్చారు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తరఫున యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, మాజీ మంత్రులు, బిఎస్‌పి అధినేత్రి మాయావతి తదితరులంతా తెలంగాణపై దండయాత్ర తరహాలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఈ నెల 1వ తేదీ నుంచి హైదరాబాద్‌లోనే మకాం వేసి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాహుల్‌గాంధీతో కలిసి వేదిక పంచుకున్నారు. జాతీయ స్థాయి ఎన్నికల తరహాలో వివిధ పార్టీల సీనియర్ నేతలంతా తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక సినీ తారులు విజయశాంతి, నగ్మా, ఖుష్బూ, క్రికెటర్‌లు అజారుద్దీన్, సిద్ధూ& ఇలా ఎంతో మంది తెలంగాణ ప్రచారంలో కాంగ్రెస్ తరఫున పాల్గొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నాలుగున్నరేళ్లలో ఏనాడూ రాష్ట్రంవైపు తలెత్తి చూడని సోనియాగాంధీ మొదలుకొని, అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి ఎన్నికల ప్రచారంలో వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ప్రసంగాలు చేశారు. ఒక్క టిఆర్‌ఎస్‌ను ఓడించడం కోసం జాతీయ స్థాయి నేతలంతా జాతర తరహాలో తెలంగాణకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం అన్నీ తానై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా, స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తిరిగారు. కెసిఆర్‌కు మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు ప్రచారంలో సహకరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపి కవిత కూడా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గల్లీగల్లీ తిరిగి మరీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేస్తున్నారు.

మిగతా అభ్యర్ధులంతా ఎవరి నియోజకవర్గాలు వారే చూసుకున్నారు. బిజెపి తరపున కూడా ప్రచారానికి ఉత్తరాది నేతలు దండయాత్రలా కదిలారు. ప్రధాని నరేంద్రమోడీ రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించి, మూడు సభల్లో పాల్గొనగా, అమిత్‌షా కూడా రాష్ట్రంలో పర్యటించారు. కలలో కూడా తెలంగాణ పట్ల వ్యతిరేక భావన కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పలు చోట్ల ప్రచారం చేశారు.
ఒక్కడి కోసం పదుల సంఖ్యలో కాంగ్రెస్‌నేతలు
నోటిఫికేషన్ నుంచి మొదలుకుని కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రానికి పర్యాటకుల్లా వచ్చి, పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేపనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల తర్వాత అహ్మద్‌పటేల్, ఆర్‌సి కుంటియా, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆశావహులను బుజ్జగించేందుకు పడరాని పాట్లు పడ్డారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, పృద్వీరాజ్ చౌహాన్, గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, ఆర్‌సి కుంటియా, రణ్‌దీప్ సింగ్ సుర్జీవాల, సుష్మితాదేవ్, ఖుష్బూ, అభిషేక్ మనుసింగ్వీ, జాఫర్ షరీఫ్, ఎంవి రాజీవ్ గౌడ, కెహెచ్ మునియప్ప, ఆనంద్ శర్మ, నారాయణ స్వామి తదితరులు కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఏనాడూ వీరు నాలుగేళ్ళ తెలంగాణలో అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడడానికి కన్నెత్తి కూడా చూడలేదు. ఎన్నికల పండుగ రావడంతో ఒక్కసారికి వాలిపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక డిమాండ్‌గా, ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి పద్నాలుగేళ్ళ పాటు సబ్బండ వర్గాలను ఉద్యమంలోకి తీసుకొచ్చి ఎట్టకేలకు లక్ష్యాన్ని సాధించుకున్నారు. ఒక్క కెసిఆర్‌ను గద్దె దింపడం కోసం సైద్ధాంతిక అంశాలనూ పక్కనపెట్టి తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత మూడున్నర దశాబ్దాల కాలంలో కాంగ్రెస్‌తో అనైతిక పొత్తుకు పోయింది.
సర్వశక్తులనూ ఒడ్డిన బిజెపి
ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షాలకు తోడు బిజెపికి మద్దతుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రంగంలోకి దిగారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, హన్స్‌రాజ్ గంగారాం, సంతోష్ కుమార్ గ్యాంగ్వార్, సునీల్ థియోడర్, జ్యుయల్ ఓరమ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు, రాం మాధవ్, స్వామి పరిపూర్ణానంద, సాధ్వి నిరంజన్ జ్యోతి, బిఎల్ సంతోష్, ప్రభు చౌహాన్, పురందేశ్వరి, మీనాక్షి లేఖి, జెపి నడ్డా, షానవాజ్ హుస్సేన్, వి.హరిబాబు, సుగుణాకరరావు, పురుషోత్తం రూపాల, జ్యుయల్ ఓరం, శ్రీరాములు, ప్రభు చౌహాన్, బండారు దత్తాత్రేయ, జివిఎల్ నరసింహారావు, డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి పోటీ చేసినప్పటికీ, ప్రధానంగా 30 స్థానాలపైనే దృష్టిసారించింది. త్రిముఖ, చతుర్ముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల చీలికతో బిజెపి గెలిచే అవకాశాలు పెంచే దిశగా ఈ నేతలంతా పనిచేశారు.
హామీలు, అభివృద్ధి నడుమ పోరు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగేళ్ళ అభివృద్ధి, సంక్షేమం కీలక భూమిక పోషిస్తోంది. గతంలో కరెంటు కోతలతో సతమతమైన ప్రజలు ఇప్పుడు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందుకోవడం ఓటింగ్‌లో ప్రధాన పాత్ర వహించనుంది. 58 ఏళ్ళ పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలనను నాలుగేళ్ళ టిఆర్‌ఎస్ పాలనతో పోల్చి చూసుకుని ప్రజలు ఒక స్పష్టతకు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రతీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పార్టీలు ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలను విన్న తర్వాత నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధిని, మంచిని, లబ్ధిదారుల తృప్తిని పరిగణనలోకి తీసుకుని సరైన పార్టీని ఎంచుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో పార్టీలు పోటాపోటీగా ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలను గుప్పించాయి. హామీలతోనే సరిపెట్టుకుంటారా లేక ఆచరణలో అమలుచేస్తున్న పార్టీని ఆదరిస్తారా అని అధికార టిఆర్‌ఎస్ ప్రస్తావిస్తోంది. ప్రజలు గతంలో వ్యవహరించిన తీరులో కాకుండా ఈసారి కాస్త రాజకీయ చైతన్యంతో ఓటుపై ఆలోచనతో నిర్ణయం తీసుకోనున్నారు.

Assembly election campaign ends Today