Home జాతీయ వార్తలు జై కిసాన్

జై కిసాన్

ph1

ముంబయి వీధుల్లో  రైతు మహా జన సంద్రం

మండుటెండను లెక్కచేయకుండా  వేలాది  మంది అన్నదాతలు

ముంబయి: రైతుల ప్రదర్శనతో సాగర తీరాన ఉన్న ముంబై మహానగరం జన సంద్రంగా మారింది. చుట్టుముట్టిన పలు సమస్యలతో దిక్కుతోచని రైతులు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి ఒక్కటయి, మహాప్రదర్శనగా ముంబైలో అసెంబ్లీ ముట్టడి చేయడం గతంలో స్థానికంగా జరిగిన  కార్మికుల భారీ ప్రదర్శనను తలపించింది. నాసిక్‌లో పిల్లవాగులా మొదలైన ప్రదర్శన ముంబైకి వచ్చేసరికి సముద్రంగా మారింది. ఆజాద్ మైదాన్ అంతా ఎరుపు జెండాలతో ఎగిసిపడే సముద్రంగా మారింది. దాదాపు అరలక్ష మంది రైతులు నేతలకు పట్టని తమ సమస్యల గురించి గళం విప్పి చెప్పేందుకు దూరభారాలు తమకు కొత్తకాదనే రీతిలో పాదయాత్రగా మహానగరానికి తరలివచ్చారు. దేశ వాణిజ్య రాజధాని ఉన్నట్లుండి వ్యవసాయ కూలీలు, రైతుల కూడలిగా మారింది. 18౦కిలోమీటర్ల దూరం ప్రయాణించి రైతులు ముంబైకి సోమవారం చేరారు. గత కొద్ది రోజులుగా మండిస్తోన్న ఎండలను లెక్కచేయకుండా వారి ప్రయాణం సాగింది. తొలుత సియోన్ ప్రాంతంలోని  కెజె సోమైయ్య గ్రౌండ్‌లో సేదదీరిన రైతులదండు నెమ్మదిగా స్థానిక ఆజాద్ మైదాన్‌కు చేరారు. పంటలు ఎండిపోవడం, విద్భర తదితర ప్రాంతాల్లో ఎండిన పొల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బిజెపి పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో నిత్య సత్యంగా మారింది. ఈ దశలో రగులుతున్న రైతాంగ ఆగ్రహం పాదయాత్రగా సాగింది. సిపిఎం అనుబంధమైన ఆలిండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతుల యాత్ర సాగింది. ఉదయం పదకొండు గంటలకు ఆజాద్ మైదానం నుంచి అసెంబ్లీ వరకూ రైతుల పాదయాత్రను తొలుత తలపెట్టారు. థానే నుంచి వచ్చిన వేలాది మంది గిరిజనులు రైతుల యాత్రలో కలిశారు. ముంబైలో బాలీవుడ్ యావత్తూ రైతాంగానికి సంఘీభావం ప్రకటించింది. రైతుల ప్రదర్శనకు వీలుగా ముంబై మహానగరంలో రహదారులలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు రాజకీయ పార్టీల నేతలు రైతు ప్రతినిధులను కలిశారు. వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ముంబై శివార్లలోని ములుంద్‌లో రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ రైతుల ప్రదర్శనకు స్వాగతం పలికారు. సమస్యలను పరిష్కరిస్తుందని  హామీ ఇచ్చారు. తమ డిమాండ్లపై నిర్థిష్ట ప్రకటన వెలువడే వరకూ తమ నిరసన ఆగబోదని రైతులు ప్రకటించారు. దీనితో ముంబైలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సిపి, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, శివసేన నేతలు హుటాహుటిన వచ్చి రైతులను కలిశారు. వారితో ముచ్చటించేందుకు యత్నించారు. అయితే ముంబైలో అసెంబ్లీ ముట్టడే లక్షంగా వారి దండు కదిలింది. ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌థాకరే, శివసేన నేత ఆదిత్యాథాకరేలు వేర్వేరుగా రైతులను కలిశారు. గత నవంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ స్థాయి రుణమాఫీని ప్రకటించింది. గత నెలలో రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన ప్రసంగంలో దాదాపు 31 లక్షల మంది రైతులు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ 12,౦౦౦ కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇవన్నీ ఉత్తిమాటలని తమకు సాయం అందలేదనే ఆగ్రహంతో రైతాంగం ఈ మహా ప్రదర్శనకు తలపెట్టింది. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని, వ్యవసాయ కడగండ్లను తీర్చేందుకు శాశ్వత పథకాలు అవసరం అని రైతాంగం కోరుతోంది. ఉత్పత్తి వ్యయంలో ఒకటిన్నర రెట్లు సాగుదార్లకు చెల్లించాలని కోరుతున్నారు, కనీస మద్దతు ధరలను సరైన విధంగా ఖరారు చేయాల్సి ఉందని డిమాండ్  చేస్తున్నారు. ముంబై చరిత్రలోనే కాదు మహారాష్ట్రలోనే ఈ స్థాయిలో రైతాంగం దండుగా కదలడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు తెలిపారు. మహారాష్ట్రలో రైతుల బాధలను తీర్చేందుకు కేంద్రం దిగిరావాలని కాంగ్రెస్ అధ్యక్షులు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

దిగివచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం 

డిమాండ్లకు అంగీకారం.. లిఖితపూర్వక హామీ 

ముంబయిలో సాగిన మహా రైతు ప్రదర్శనతో మహారాష్ట్ర ప్రభుత్వ దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో అనేకం తాము తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రైతులు తమ ఉద్యమం విరమించుకునేందుకు సోమవారం సాయంత్రం అంగీకరించారు. వారం రోజుల పాటు 17౦ కిలోమీటర్ల మేర రైతుల ప్రదర్శన సాగిన తరువాత, అసెంబ్లీకి అతి దగ్గరికి చేరి ఇక ముట్టడికి రైతులు సిద్ధపడ్డ దశలో రాష్ట్రంలోని ఫడ్నవిస్ ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేకించి గిరిజన రైతులు ఎక్కువగా ప్రదర్శనకు తరలివచ్చారు. వర్గాలు కులాలు మతాలకు అతీతంగా అంతా ఒక్కటిగా సమస్యల సాధనకు కదిలారు. అటవీ భూములను తాము సాగుచేస్తున్నామని వాటిని తమకు బదలాయించాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తరాలుగా అటవీ హక్కుల చట్టం పరిధిలోనే తాము వాటిని సాగు చేస్తున్నామని వీటిపై తమకు న్యాయం దక్కాలని వారు కోరుతున్నారు. రెండున్నర గంటల పాటు గిరిజన నేతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. తరువాత డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు ప్రభుత్వం రాతపూర్వకంగా తెలిపింది. దీనితో ఉద్యమ విరమణకు మార్గం ఏర్పడింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ రైతుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రదర్శనకు వచ్చిన రైతులను ప్రత్యేక రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేరుస్తామని తెలిపింది. ఆరు నెలల వ్యవధిలో రైతులకు అటవీ భూముల కేటాయింపునకు అంగీకరించింది. రుణ మాఫీలకు నిబంధనల సరళీకృతానికి ఆమోదం తెలిపింది. ఇనామ్, దేవస్థానం, గైరాన్ ఇతర భూముల లావాదేవీల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. తమ ఆలోచనలను ప్రభుత్వం వినేలా చేయడంలో, వారు సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చేలా చేయడంలో విజయం సాధించామని కిసాన్ సభ కార్యదర్శి అజిత్ నవాలే తెలిపారు.  పింఛన్ల పెంపుదల వంటి వాటిపై కూడా రాతపూర్వక హామీ వెలువడింది.