Friday, March 29, 2024

3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!

- Advertisement -
- Advertisement -

Assigned lands

 

జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా
త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన?

హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 3 లక్షల ఎకరాల భూమి చేతులు మారినట్టుగా అధికారులు గుర్తించారు. కొన్ని భూములు సాగుకు యోగ్యం కాకపోవడం, మరికొన్ని చోట్ల సాగు చేసే వారు లేక కొందరు భూములను వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొందరు వాటిని కబ్జా చేసి విక్రయించగా, మరికొందరు కావాలనే భూములను అమ్ముకున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ప్రభుత్వ భూమి, సీలింగ్ భూములు, రక్షిత అటవీ చట్టం పేరుతో ప్రభుత్వం నిరుపేదలకు కొన్ని సంవత్సరాలుగా భూమిని పంపిణీ చేసింది. ఇప్పటివరకు 33.53 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయగా, భూములు పొందిన లబ్ధిదారులు వాటిని విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం కుదరదని చట్టంలో పేర్కొంది.

ఎక్కడైనా ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకునే వెసులు బాటును అప్పట్లో ప్రభుత్వం కల్పించింది. అయినా చాలామంది ఈ భూములను అమ్ముకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన వివరాలు జమాబంధీలో ఉండేవి. జమాబంధీలో అనేక లొసుగులు చోటు చేసుకుండడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

నిర్ణయం తీసుకొని కలెక్టర్లు
రాష్ట్రంలో ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూమి 33,53,638.18 ఎకరాలు కాగా, రక్షిత అటవీ భూమి (ఆర్‌ఓఎఫ్‌ఆర్) 1,59,437 ఎకరాలు, ప్రభుత్వ భూమి 21,36,369.03 ఎకరాలు, ఆక్రమించిన భూమి 2,41,000 ఎకరాలు, భూదాన్ 14,790.76 ఎకరాలు, సీలింగ్ 39,401.43 ఎకరాలు. ఉమ్మడి పది జిల్లాల్లో ప్రభుత్వం నుంచి వివిధ రకాల భూమిని పొందిన లబ్ధిదారులు 17,02,815 మంది ఉన్నారు.

ఈ అసైన్డ్ భూములు కొనుగోలు, విక్రయానికి సంబంధించి రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన భూములు అన్యాక్రాంత అయితే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఒకవేళ పేదలే అసైన్డ్ భూములను కొనడం లేదా కబ్జా చేసుకొని ఉంటే ఆ భూములపై వారికి హక్కులు కల్పించే అవకాశాలను కూడా కల్పించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయినా ఇప్పటివరకు కలెక్టర్లు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొనుగోళ్లు జరిగిన భూములను స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై మరోసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని సిఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది.

భూములు రిజిస్ట్రేషన్ కాగానే వెంటనే రికార్డుల్లో చేర్చేలా
గతంలో అమలుచేసిన జమాబంధీ వల్లే భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో 1908లో, 1932లో రెండు దఫాలుగా భూ సర్వే జరిగినట్టు రికార్డులు చెబుతుండగా, అనంతరం 1948 నుంచి 1970 మధ్య కాలంలో చేసిన ఆయా సర్వే రికార్డులే ఇంకా ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు సమన్వయ లోపం ఫలితంగా అక్రమాలకు వీలు కలుగుతోందని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇకపై అక్రమాలు జరగకుండా భూములు రిజిస్ట్రేషన్ కాగానే వెంటనే వాటిని రికార్డుల్లో భూమికి సంబంధించిన వివరాలు అప్‌డేట్ అయ్యేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమాబంధీలో ఉన్న లొసుగులను కూడా గతంలో అనేక కమిటీలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చాయి.

ఆర్వోఆర్ చట్టం తరహాలోనే….
కొత్త చట్టం మార్పుల్లో భాగంగా ఆర్వోఆర్ చట్టం తరహాలోనే పట్టణ ప్రాంత భూములకు ప్రత్యేక చట్టం తెచ్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సాగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 1990 సంవత్సరానికి ముందు, ఇప్పటి పరిస్థితులపై అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా అక్రమాలను కూడా బయటకు తీయాలన్న ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలను మొదలుపెట్టారు. 1990కి ముందు రాష్ట్రంలో గ్రామస్థాయి యూనిట్‌గా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ రికార్డుల తనిఖీ కొనసాగేది. ఆ తరువాత ఈ వ్యవహారం పూర్తిగా కనుమరుగయ్యింది.

1989లో ఆంధ్రప్రదేశ్ భూ హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 1971ను అమల్లోకి తీసుకురావడంతో జమాబంధీకి ప్రక్రియకు స్వస్థి పలికారు. ఈ చట్టం రాక ముందు తహసీల్దార్ మొదలు సిసిఎల్‌ఏ (భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్) వరకు తనిఖీలు జరిపేవారు. భూ వ్యవహారాలు రికార్డుల వరకు అన్ని పకడ్భందీగా జరిగేవి. చిన్నపాటి భూ కమతాలు కూడా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పర్యవేక్షించే వీలు ఉండేది. కానీ తరువాత వీటిని పక్కకు పెట్టడంతో అక్రమాలకు తెరలేచినట్టు అధికారులు గుర్తించారు. 1940 తరువాత భూ సర్వే లేకపోవడం కూడా ప్రామాణికాల్లో తేడాలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

Assigned lands are alienated
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News