Home అంతర్జాతీయ వార్తలు కోరలు చాస్తున్న కరోనా

కోరలు చాస్తున్న కరోనా

Coronavirus

 

చైనాలో 41 మంది మృతి
237 మంది పరిస్థితి విషమం
విదేశాలకూ వ్యాపించిన కరోనా న్యుమోనియా

బీజింగ్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాధి చైనాలోను, విదేశాల్లోనూ మృత్యు ఘటికలు మోగిస్తోంది. ప్రళయ నృత్యాన్ని కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తూర్పు దేశం చైనాలో ఈ వ్యాధి బారిన పడి ఇంతవరకూ 41 మంది మృత్యువాత పడ్డారు. సెంట్రల్ చైనా హుబెయ్ ప్రావిన్స్‌లో 39 మంది, హీలోంగ్‌జియాంగ్‌లో ఒకరు చనిపోయారు. ఈ వ్యాధి సోకిన మరో 1287 కేసుల్ని ధ్రువీకరించినట్టు చైనా ఆరోగ్య కమిషన్ శనివారం ప్రకటించింది. ధ్రువీకరింపబడిన కేసుల్లో శుక్రవారం రాత్రి వరకు 237 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కమిషన్ తెలిపింది. ఇలా ఉండగా ఇంకో 1,965 మందికి ఈ వ్యాధి సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చైనాలో అనేక పట్టణాలు ఈ న్యుమోనియా వ్యాధితో పోరాడుతున్నాయి.

విదేశాల్లో కూడా…
చైనాలోనే కాక హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, అమెరికాలకు కూడా కరోనా వైరస్ వ్యాపించింది. జపాన్‌లో శుక్రవారం రెండో కేసు నమోదైంది. ఇలా ఉండగా చైనా నుంచి కరోనా తమ దేశానికి వ్యాపించిందని, రెండు కేసులు నమోదయ్యాయని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఆగ్నెస్ బూజైన్ శుక్రవారం వెల్లడించారు. యూరప్‌లో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. చైనా నుంచి వచ్చిన ఇద్దరు అనారోగ్యం పాలయ్యారని, మరి కొన్ని కేసులు ఉంటాయేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆస్ట్రేలియా కూడా శనివారంనాడు నాలుగు కరోనా న్యుమోనియా కేసుల్ని ధ్రువీకరించింది. వారం రోజుల కిందట చైనాలోని వూహాన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మెల్బోర్న్ ఆస్పత్రిలో విడిగా ఉంచి చికిత్స చేస్తున్నారు. కాగా, ఈ వ్యాధి గురించి భారతదేశం కూడా ఆందోళన చెందుతోంది.

చైనా నుంచి వచ్చిన ఏడుగురికి పరీక్షలు
చైనా నుంచి వచ్చిన ఏడుగురికి కేరళ లోని వైద్యకేంద్రాల్లో పరిశీలనలో ఉంచారు.వీరికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు కరోనా వైరస్ కేసులేవీ నమోదు కాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ శనివారం చెప్పారు. వీరి నమూనాలను పుణె లోని ల్యాబ్‌కు పంపినట్టు చెప్పారు. న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి విమానాశ్రయాలకు థర్మల్ స్క్రీనింగ్ బృందాలను పంపిస్తున్నారు.

At least 41 people killed in China