Home జాతీయ వార్తలు స్కూటర్.. రైలు.. బస్సు..!

స్కూటర్.. రైలు.. బస్సు..!

ఏది దొరికితే దానిలో ఢిల్లీ చేరుకున్న వాజ్‌పేయీ అభిమానులు, కడసారి చూపు కోసం దూరాభారం లెక్క చేయని సామాన్యులు

Modi

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కడసారి చూపు కోసం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు స్కూటర్, విమానం, రైళ్లు, బస్సులు ఏది దొరికితే దానిలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారయినప్పటికీ వీరందరి లక్ష్యం తమ ప్రియతమ నాయకుడిని కడసారి దర్శించుకోవడమే. 25 ఏళ్ల ఆకాశ్ కుమార్ యుపిలోని భాగ్‌పట్‌నుంచి 70 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణించి ఢిల్లీ చేరుకుంటే తమిళనాడులోని చెన్నైకి చెందిన చిన్నయ్య నటేశన్ తన స్నేహితుడు గణేశన్‌తో కలిసి విమానంలో వచ్చారు.

వాజ్‌పేయీ రాసిన ‘కాల్‌కే కపాల్‌పే..’ తనకు ఎంతో ఇష్టమైన కవిత అని ఆకాష్ చెప్పాడు. తాను మూడో తరగతో, నాలుగో తరగతో చదువుతున్నప్పుడు వాజ్‌పేయీ ప్రసంగం విని, ఆయన పట్ల ఆకర్షితుడైనట్లు అతను చెప్పాడు. కాగా శుక్రవారం నాలుగున్నర గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే నటేశన్ నేరుగా వాజ్‌పేయీ నివాసానికి వెళ్లి దివంగత నేతకు నివాళులర్పించాడు.తాను ప్రకృతి ప్రేమికుడినని , అందుకే వాజ్‌పేయీ నివాసం సమీపంలో రోడ్డుపక్కన వట్టి కాళ్లతో నిలబడ్డానని ఆయన చెప్పాడు. ‘ అచ్ఛా పొలిటీషియన్, అచ్ఛా పార్లమెంటేరియన్, స్వచ్ఛమైన మనిషి’ అని సగం హిందీ, సగం ఇంగ్లీషులో వాజపేయీని ప్రశంసించాడు.

ఊహించని రీతిలో దేశం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు దేశ రాజధానికి చేరుకుని దివంగత మాజీ ప్రధానికి నివాళులర్పించడం ద్వారా జాతీయ సమైక్యత,సమగ్రతల ప్రాధాన్యతలను చాటి చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీనుంచి యోగేశ్‌కుమార్, మరికొంతమంది రాత్రికి రాత్రి దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నారు. 1984లోవాజ్‌పేయీ గంగోత్రికి వెళ్తూ ఉత్తర కాశీకి వచ్చినప్పుడు తొలిసారి ఆయనను కలిశానని, ఆతర్వాత 1986లో మరోసారి వచ్చిరని యోగేశ్ అంటూ వాజ్‌పేయీతో తాను ఉన్న ఫొటోను చూపించారు.

మధ్య ఢిల్లీలోని పటేల్‌నగర్‌కు చెందిన సోను గుప్తా అయితే ఏకంగా తన సొంత ఆటోలోనే కృష్ణమీనన్ మార్గ్‌లోని వాజ్‌పేయీ నివాసానికి వచ్చాడు. అయితే ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఆటోను సెంట్రల్ మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి వచ్చానని అతను చెప్పాడు. వీరే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది వ్యయప్రయాసలకోర్చి తమ ప్రియతమ నేతను కడసారి దర్శించుకోవడానికి రాత్రికి రాత్రి బయలు దేరి ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరికీ వాజ్‌పేయీ వ్యక్తిత్వం, మచ్చలేని ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితాలే స్ఫూర్తి కావడం గమనార్హం.

ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోతారు, అటల్‌జీకి ప్రధాని మోడీ తుది నివాళి

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని నరేంద్ర మోడీ తుది నివాళులర్పిస్తూ ప్రతి భారతీయడి గుండెల్లో, చనసుల్లో శాశ్వతంగా నిలిచి పోయే అసాధారణ మహానేత అని పేర్కొన్నారు. భారత దేశ నిర్మాణంలో ఆయన అందించిన సేవలను చెప్పడానికి మాటలు చాలవని అన్నారు.‘ ఈ దేశానికి అసాధారణ సేవలందించిన ఓ అసాధారణ వ్యక్తికి నివాళులర్పించడానికి దేశంలోని అన్ని ప్రాం తాలు, సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వచ్చారని, అటల్‌జీకి భారత్ సెల్యూట్ చేస్తోందని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో అన్నారు. కాగా అంతకు ముందు మోడీ ఒక బ్లాగ్‌లో వాజ్‌పేయీని ఆత్మ, హృదయం, మేధస్సు 3 సుగుణాలు కలిగిన మహా నేతగా అభివర్ణించారు. సంక్షోభ సమయాల్లో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచి దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేసిన అలాంటి నాయకుడు అభించడం దేశం చేసుకున్న అదృష్టం అని ప్రధాని అన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలకు బీజాలు వేసింది ఆయనేనని అన్నారు.

నివాళులర్పించిన జితేందర్‌రెడ్డి, కేశవరావు

మన తెలంగాణ / న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ భౌతికకాయానికి టిఆర్‌ఎస్ ఎంపిలు జితేందర్ రెడ్డి, కేశవరావు శుక్రవారం నివాళులర్పించారు. వాజ్‌పేయీ మరణం దేశానికి తీరని లోటు అని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాజ్‌పేయీతో కలిసి పనిచేసిన అనుభవం మరవలేనిదని, ప్రపంచాన్ని మంచితనంతో జయించిన వ్యక్తి అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలతో వాజ్‌పేయీకి సత్సంబంధాలుండేవని గుర్తు చేసుకున్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో తెలంగాణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. వాజ్‌పేయీ రాజకీయాల్లో అందరిచేత మన్ననలు పొందిన గొప్ప నాయకుడని, అజాతశత్రువు అని కేశవరావు పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు.

వాజ్‌పేయీకి బిజెపి రాష్ట్ర నేతల నివాళి

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి బిజెపి నేతలు నివాళ్లు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కూడళ్ల వద్ద వాజ్‌పేయీ చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయా కూడళ్ల వద్ద నల్ల జెండాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల్లో వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ప్రధానిగా ఉంటూ వాజ్‌పేయీ విలువలతో కూడిన రాజకీయాలను నడిపించారని, నేటి తరానికి ఆయన మార్గదర్శి అని నేతలు కొనియాడారు. శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ అంతిమ సంస్కారాల్లో రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎం.పి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బిజెఎల్‌పి నేత జి. కిషన్ రెడ్డి, ఎంఎల్‌ఎ చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు.

వాజ్‌పేయీ మాకు ఆదర్శం : లక్ష్మణ్

మాజీ ప్రధాని వాజ్‌పేయీని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం వాజ్‌పేయీ అంత్యక్రియలకు బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాజ్‌పేయీకి ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.