Home కలం భావావేశ కవి అటల్ జీ

భావావేశ కవి అటల్ జీ

Atal Bihari Vajpayee political life

అది 1996. ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో ఆయన ఇంటర్వ్యూ జరుగుతోంది. సరిగ్గా అదే సమయానికి ఒక ముఖ్యమైన వార్త ఆయనను చేరింది. ఆయన ప్రధాని కాబోతున్నట్టు ఆవార్త సారాంశం. ఈ క్షణంలో మీ అనుభూతిని చెప్పండంటూ ముఖాముఖిలో ప్రశ్న. మరొకరు ఆ స్థానంలో ఉంటే చాలా ఆనందిస్తున్నట్టు చెప్పి ఉండేవారు. రాజకీయ జీవితంలో అత్యున్నత పదవి లభిస్తున్నందుకు ప్రజలకు, దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసేవారు. కానీ ఆ ముఖాముఖికి హాజరైన ఆ ప్రముఖుడు ఇచ్చిన సమాధానం “హే ప్రభూ! నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు/ ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా” అని. సామాన్యుడి నుండి తనను దూరం చేసేందుకు ఆస్కారం ఉండేంత ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు అని తక్షణ స్పందనగా కవితా రూపంలో దేవుడిని ప్రార్థించిన ఆ గొప్ప రాజకీయ శక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి.

గొప్ప రాజనీతిజ్ఞుడిగా, పార్లమెంటేరియన్ గా తీరికలేకుండా ఉన్నా వాజ్‌పేయిలోని కవితాత్మ అనేక సందర్భాల్లో బయటపడేది. ప్రసంగాల్లోనూ ఆయనలోని కవితా హృదయం ఉప్పొంగేది. ఉపన్యాస రూపం లో కవిత్వం జాలువారేది. ‘కవిత్వమంటే స్వీయ వ్యక్తీకరణ. గందరగోళంలో స్వీయ వ్యక్తీకరణ సాధ్యం కాదు’అని స్వయంగా పేర్కొన్నా కవితారూపంలో భావ వ్యక్తీకరణను గందరగోళ పరిస్థితులలోనూ ఆయన విడిచిపెట్టలేదు. కవిత్వానికి వాతావరణం, ఏకాగ్రత అవసరమని భావించిన వాజ్‌పేయిని ఏ వాతావరణమూ కవిత్వం చెప్పకుండా నిలువరించలేకపోయింది. వాజ్‌పేయి ప్రసంగాలను సామాన్యులు సైతం ఇష్టపడేందుకు ఆయనలోని కవితాత్మక ప్రసంగ ధారే ముఖ్య కారణం. పామరులతో పాటు పండితులూ ఇష్టపడే నాయకులు అటల్‌జీ. సామాన్యులను ఆయనలోని ప్రసంగ ధార ఉర్రూతలూగిస్తే పండితులను ఆయనలోని భాషా ప్రావీణ్యత, కవితా శక్తి ఆకర్షించేది. అందువల్లే సామాన్యులకు ఆయన అత్యంత ప్రియమైన రాజకీయ నాయకుడు, కవులకు తాము అమితంగా ఇష్టపడే కవి. ఆయనను కలిసే కవులు, రచయితలు ఆయనను ఎప్పుడూ ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడిగా భావించలేదు. ఆయనను ఒక మహాకవిగా, పండితుడిగానే వారు చూసేవారంటే దాని కి కారణం ఆయనకే స్వంతమైన విశిష్ట వ్యక్తిత్వం.

అటల్‌కు సాహిత్యంపై మక్కువ వారసత్వంగానే సంక్రమించిందని భావించవచ్చు. ఆయన తాత పండిట్ శ్యాంలాల్ వాజ్‌పేయి సంస్కృత,హిందీ భాషల్లో గొప్ప పండితులు. కాళిదాసు, భవభూతి పద్యాలను ధారాళంగా పఠించేవారు. అటల్ తండ్రి పండిట్ కృష్ణ బిహారీ గ్వాలియర్‌లో కవిగా ప్రసిద్ధులు. ‘జయంతి ప్రతాప్’ అనే పత్రికలో పండిట్ కృష్ణ బిహారీ రాసిన కవితలు అచ్చయ్యాయి. ఆ కాలంలో పాఠశాల ప్రార్థనాగీతం కృష్ణ బిహారీ రాసిన కవితే. కృష్ణ బిహారీ కవిగానే కాకుండా గొప్ప వక్తగా కూడా ఖ్యాతి పొందారు. అటల్ పెద్దన్న పండిట్ అవధ్ బిహారీ వాజ్‌పేయి కూడా కవే. ఇంట్లోని సాహిత్య వాతావరణం అటల్‌పై ప్రభావం చూపించిందని భావించవచ్చు. బహుశా అందువల్లే అటల్ కవిగాను, పండితుడిగాను, వక్తగాను, పాత్రికేయుడిగాను ప్రజలకు అత్యంత ఇష్టుడయ్యారు. కవి త్వం తనకు వారసత్వంగా సంక్రమించిందని ఒక సందర్భం లో వాజ్‌పేయి స్వయంగా చెప్పుకున్నారు.

కవులు, రచయితల్లో చాలామందికి కార్యక్షేత్రం పత్రికారంగం. వాజ్‌పేయి కి కూడా అంతే. ‘రాష్ట్ర ధర్మ’, ‘పాంచజన్య’, ‘స్వదేశ్’, ‘వీర్ అర్జున్’ మొదలైన పత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రకృతి ప్రేమికు డు అటల్‌జీ. సం గీతం, సాహి త్యం, నృత్యం అంటే ఆయనకు ప్రాణం. ఏ స్థాయిలో ఉన్నా కళారాధన ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యాపకం. అసోం కు చెందిన ప్రముఖ రచయి త, స్వరకర్త, సం గీత దర్శకుడు భూపేన్ హజారికాకు ఆయన అభిమాని. ఒకసారి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భూపేన్ హజారికా ప్రదర్శన ఉందని తెలిసి, నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు. కచేరీ ముగిసే సమయంలో భూపేన్ హజారికాకు వాద్య సహకారం అం దించే కమల్ కతాకి వేదికపై ప్రకటించే సమయంలో ఆయనకు ఓ చిట్టీ పంపించారు అటల్‌జీ. “భూపేన్‌జీ! నాకోసం మోయీ ఇతి జాజబోర్ పాటను మరోసారి పాడగలరా!” అని ఆ చిట్టీలో ఉంది. అటల్ అభ్యర్థన మేరకు మరోసారి ఆ పాట పాడారు భూపేన్. ఆ పాటంటే అటల్‌కు ఎంతో ఇష్టం.

“హే ప్రభూ! నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు/ ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా” అని అటల్ కోరుకోవడానికి కారణాన్ని కూడా ఆయనే కవితారూపంలో వెల్లడించారు. శిఖర స్థాయి లభించకపోయినా ఇతరుల నుండి తనను దూరం చేయవద్దని కోరుకున్నారు అటల్. “ఎత్తయిన పర్వతాలపై / చెట్లు ఎదగవు / మొక్కలు మొలకెత్తవు / గడ్డిపరక కూడా పరచుకోదు” అంటారు. అందుకే గడ్డిపరక కూడా పరుచుకోని శిఖర స్థాయి తనకు వద్దని సున్నిత తిరస్కారం ఆ మాటల్లో కనబడుతుంది. “కేవలం ఎత్తుగా ఎదగడమే అయితే / నిశ్శబ్దంగా ఒంటరిగా మిగిలిపోవడమే!” అని ఆయన అభిప్రాయం.సామాన్యుడితో నిరంతరం కలిసిపోయి ఉండాలని కోరుకునే మహోన్నత మనస్త త్వం ఎందరు రాజకీయనాయకుల్లో ఉంటుం ది? అలా ఉం టుందని నేటి పరిస్థితుల్లో ఊహించగలమా? అటల్ ఆలోచనల వెనుక సునిశిత పరిశీలనా శక్తి ఉంటుందనేందు కు ఈ కవిత ఒక ఉదాహరణ.

దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వాజ్‌పేయితో సహా ఎందరో నాయకు లు జైలు పాలయ్యా రు. ఆ సందర్భంలో అత్యవసర పరిస్థితిని వాజ్‌పేయి కవితారూపంలో తూర్పారబట్టా రు. ఎమర్జెన్సీని చీకటితో పోలుస్తూ“చీకటి రాత్రి / విసిరిన సవాలు ఇది / కిరణమే చివరి దవుతుంది” అని అప్ప టి ప్రభుత్వానికి సవాలు విసిరారు.

అదే సందర్భంలో రాసిన మరో కవితలోనూ ఎమర్జెన్సీ చీకట్లు తొలుగుతాయన్న ఆశావాద దృక్పథాన్ని కనబరిచారు అటల్. “జైలులో ఉన్న కవి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది / ఏ వ్యక్తి కూడా జీవితం లో నిరాశ చెందరాదని / నిషా వక్ష స్థలాన్ని చీల్చుకొని / మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు!” అన్న ఆశావాదం ఆయనది. ఆయన ఆశించినట్టుగానే చీకటి రోజులు పోయి, నిర్బంధ పరిస్థితులు గతకాలపు జ్ఞాపకాలుగా మారిపోయాయి.

ఆత్మాభిమానంతో ఉన్న భారత జాతి ఎప్పు డూ తలవంచదన్న భావనను తన కవిత్వంలో వ్యక్తపరిచారు వాజ్‌పేయి.“తలవంచడం/ మాకు సమ్మతం కాదు/పందెంలో అన్నీ ఒడ్డి నిలబడ్డాం/నేలకొరుగుతాం కానీ తలవంచం” అంటూ పోరాటంలో వీరుడికి ఉండవలసిన ధైర్య సై ్థర్యాలు తన సొంతమని ప్రకటించారు.

ధర్మరాజును కూడా పాప పంకిలం వదిలిపెట్టలేదన్న సూక్ష్మ పరిశీలన వాజ్‌పేయిది. అందుకే “ధర్మరాజు కూడా / జూద మోహ క్రీడలను వదులుకోలేదు / అందుకే జూద పంకిలం అంటుకున్నది / ప్రతి న్యాయ పంచాయతీలో / పాంచాలియైనా / నిరుపేద స్త్రీయైనా / అవమానితయే” అంటారు. అందుకే “ఇప్పుడు / కృష్ణుడు లేని / మహాభారతం కావాలి” అన్న కోరిక వాజ్‌పేయిది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న సందర్భంలో ఆయన రాసిన ఒక కవితలో “చావుతో పోట్లాడాలని లేదు / కానీ మరణం నా దారికి అడ్డంగా వచ్చింది / తన కౌగిలిలోకి తీసుకుని / నా నుదుటిపై ముద్దు పెట్టింది” అంటారు. “మౌత్‌కీ ఉమర్ క్యాహై? / దో పల్ భీ నహీ” అనేది మృత్యువుపై అటల్ అభిప్రాయం.

ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అటల్‌కు ఇష్టం ఎక్కువ. అందుకే “వేద్ వేద్‌మే, మంత్ మంత్‌మ్రే / మంత్ మంత్‌క్రే పంక్తి పంక్తిమే / పంక్తి పంక్తికీ శబ్ద్ శబ్ద్‌మే / శబ్ద్ శబ్ద్‌కీ అక్షర్ స్వర్‌మే / దివ్యజ్ఞాన్ ఆలోక్ ప్రదీపిత్ / సత్యం శివం సుందర్ శోభిత్‌” అంటూ ప్రపంచానికి దివ్యజ్ఞాన సంపదనిచ్చింది భారతదేశమేనంటారు వాజ్‌పేయి. తన కవి త్వం ఓడిపోయిన సైనికుడి నిరాశావాద గుండె చప్పుడు కాదని, విజయం సాధించి తీరతాననే పోరాట యోధుని అచంచల ఆత్మ విశ్వాస దృక్పథమే తన కవిత్వమని పేర్కొన్నారు. ‘రాజకీయ ఎడారిలో కవితాధారలు ఎండిపోయాయి’ అని రాజకీయ కార్యకలాపాల వల్ల కవిత్వం రాయలేకపోవడం పట్ల ఒక బహిరంగ సభలో వాజ్‌పేయి తన ఆవేదన వ్యక్తం చేశారు. అటల్ బిహారీకి అనేక పురస్కారాలు లభించాయి. 1992లో పద్మ విభూషణ్, 1994లో లోకమాన్య తిలక్ పురస్కారాలు పొందారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా1994లో గుర్తింపు పొందా రు. అదే ఏట గోబింద్ వల్లభ్ పంత్ అవార్డు లభించింది. 1993లో డి.లిట్. పొందారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న 2015లో లభించింది.

“ఏదో ఒకనాడు నేను మాజీ ప్రధానమంత్రినవుతా.కానీ ఎన్నడూ మాజీ కవిని కాను”అన్నారాయన. పౌరాణిక ప్రతీకలను ఉపయోగిస్తూ కవిత్వం చెప్పినా,సామాన్యుడికి సులభ గ్రాహ్యమయ్యేలా ఉండ డం వాజ్‌పేయి కవిత్వం లక్షణం. బలమైన శబ్ద లయ, భావావేశం ఆయన కవిత్వం సామాన్యుల దరికి చేరేందుకు దోహదపడ్డాయి. సూక్ష్మ పరిశీలన, ఆధునిక భావనలతో భారతీయ దార్శనికత విశ్లేషణ ఆయన కవిత్వం లో కనబడతాయి. “నేను మళ్ళీ జన్మిస్తాను/మృత్యువు తో భయం దేనికి?” అనేవి ఆయన ఎప్పుడో చెప్పిన కవి త్వ పంక్తులు. అవి నిజం కావాలని కోట్లాది ప్రజల ఆశాభావం.