Home ఎడిటోరియల్ నాస్తికత్వం-భూతమా? భూతదయా?

నాస్తికత్వం-భూతమా? భూతదయా?

Untitled-1“అమెరికాలో నాస్తికత్వం భూతం” అన్నది కొత్త కాకపోయినా, అందరినీ ఆశ్చర్యపరచే నిజం. “మేధోవలస జీవులందరికి ‘ఉచిత’ భూమి ఐన అమెరికాలో ‘నాస్తికత్వం’ ఒక మురికిపదంగాను ‘నాస్తికులు’ అంటరానివారుగాను చూడబడు తున్నారు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా జరిపిన అనేక పరిశోధనాధ్యయనాలలో ఈ విషయం బయట పడింది. 2001 సెప్టెంబర్, 11న న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలపై ఉగ్రవాదుల దాడి తర్వాత పెరిగిన ‘ఇస్లాం భయం’ నేపథ్యంలో, ఇటీవల మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన అధ్యయనాలలో ఆశ్చర్యాన్ని గొలిపే అనేక రహస్యా లు వెలుగుచూశాయి. “అమెరికా గమ్యాలతో ఏకీభవించని వారెవరని” అడిగిన ప్రశ్నకు జవాబుగా స్పందించిన వారిలో 40% మంది ‘నాస్తికులని’, 26.3% మంది ‘ముస్లింలని’, 22.6% మంది ‘స్వలింగ సంపర్కులని’ జవాబు చెప్పారు. ‘మీ పిల్లలు ఎవరిని పెళ్లి చేసుకుంటామంటే మీరు తిరస్క రిస్తారు?’ అన్న ప్రశ్నకు కూడా ఇదే స్పందన వచ్చింది.

‘దాదాపు సగం మంది (47.6%) మా పిల్లల పెళ్లి నాస్తికులతో అయితే ఒప్పుకోము.’ అన్నారు. అలాగే ముస్లింలను 33.5% మంది, ఆఫ్రికన్ అమెరికన్స్ ను 27.2%మంది, ఆసియన్ అమెరికన్స్‌ను, స్పానిష్-లాటిన్ అమెరికన్లను 18.5% మంది తిరస్కరించారు. దీన్నిబట్టి అమెరికా లో ముస్లిం-భయం కంటే, స్వలింగ సంపర్కుల భయం కంటే, ‘నాస్తికభయం’ అతి తీవ్రమైనదని తేలింది. మన దేశంలో కూడా “మార్కిస్టుల పిల్లలకు మీపిల్లలనిచ్చి పెళ్లి చేయవద్దని’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ తమ ప్రజలకు ఉద్భోధించారు. ఆమె బోధనలోని విషయం కూడా విరోధాభాసమే అయినా చర్చనీయాంశమే.

‘నాస్తికుడు’ అన్న పదంపై దుష్ప్రభావం ఎంత బలంగా, విస్తృతంగా వ్యాపించిందంటే ‘నేను నాస్తికుడనని” చెప్పడానికి కూడా నాస్తికులు భయపడుతున్నారు. నాస్తికుడుగా బయటపడితే, దాని వినాశకరమైన పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయి. ఈ పరిణామాలతో అమెరికాలోని రెండు ఉదాహరణలు చూడండి. ‘నేను నాస్తికరాలినని చెప్పగానే ప్రజలు నానుండి దూరంగా పారి పోయారు. మా ‘దుష్ట గృహం’ నుండి పారిపొమ్మని మా పిల్లలకు బోధించారు.” అని నాస్తికురాలయిన ఒక మహిళ చెప్పింది. “నేను ‘సైతాను’ ఉచ్చులో చిక్కుకున్నానని, నేను మారితేగాని నాతో సంసారం చేయనని నా భార్య అన్నది. ఆమె ఆర్థికంగా నాపైన ఆధారపడి ఉంది కాబట్టి నన్ను వదిలిపెట్టలేదు, లేకపోతే ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్లేది, నా పెళ్లి పెటాకులయ్యేది” అని మరో నాస్తికుడు వాపో యాడు. అమెరికా ఆధ్యాత్మిక జనానికి నాస్తికత్వం అన్నది అవినీతికి పర్యాయపదం. ‘దయ, జాలి మా మతం’ అని చాలామంది విశ్వాస రహితులు, ఈ అర్థం లేని వాదనకు జవాబిస్తారు. ‘పాశ్చాత్య విలువలు’ అనే మాట విన్నప్పుడల్లా పాశ్చాత్య దేశాలనగానే ఐరోపా, ఉత్తర అమెరికా (యు.యస్. ఎ., కెనడా) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల ను పరిగణిస్తాము. అయితే నాస్తికత్వానికి సంబంధించి ఐరోపా, యు.యస్.ఏ లమధ్య, ఉత్తర,దక్షిణ ధృవాలంత తేడా ఉంది. ఐరోపాలో మాత్రం నాస్తికులను పెద్దగా పట్టించుకోరు.

‘కమ్యూనలిజం కంబాట్’ జూన్, 2012 మాసపత్రిక సంపాదకీయంలో ఇలా రాశారు. “కేవలం ‘మతతత్వం’పై దాడిచేసి ఉపయోగం లేదని, సకల సామాజిక సమస్యలకు, రుగ్మతలకు కారణ మైన మతాన్ని రూపుమాపే ప్రయత్నాలు చేయాలని గత రెండు దశాబ్దాలనుండి మా పత్రికకు చాలామంది సలహా చెపుతున్నారు. అయితే మతతత్వ దురహంకారం, అసూయ, హింస మొదలగు అంశా లపై మా పరిశోధనాప్రయత్నాల అనుభవం, అవగా హన వేరుగా ఉన్నాయి. మతాన్ని మతతత్వ వాదా న్ని లేదా నాస్తికత్వాన్ని లౌకికవాదాన్ని సమానంగా చూడ కూడదు. ప్రగాఢ మతభావాలున్న మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్ లౌకికవాద రాజకీయాల ప్రతిపాదకులన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే మతవిశ్వాసకులు కానట్లు కనిపించే జిన్నా, సావర్కర్ (హిందూ మహాసభ) మతతత్వ రాజకీయాలను ప్రోత్స హించారు. నిజానికి వ్యక్తిగత జీవితంలో వీరిద్దరూ నాస్తికులేనని వీరితో పరిచయాలున్న వ్యక్తు లు ప్రస్తావించారు. 2002 గుజరాత్ నరసంహారంలో భయకంపితులై పారిపోతున్న ముస్లింలకు సబర్మతి ఆశ్రమ ద్వారాలను మూసివేశారు. కానీ చర్చిలన్నీ ద్వారాలు తెరిచి వారికి ఆశ్రయమిచ్చాయి.

1992-1993 ముంబయి ముస్లిం వ్యతిరేక హింసా సంఘటనల విచారణలో, శివసేన, హిందూమత రాజకీయాలను, పోలీసుల దురాగతాలను తమ నివేదికలో బట్టబయలు చేసిన న్యాయమూర్తి బి.యన్. శ్రీకృష్ణ భక్తిశ్రద్ధలు కలిగిన హిందువే. 2002 నుండి ఎడతెరిపి లేకుండా మోదీ ప్రభుత్వపు హిందూ మతాంధకార దుశ్చర్యలను, గుజరాత్ పోలీసుల దురాగతాలను, అత్యంత ధైర్యసాహ సాలతో ఎండగట్టిన గుజరాత్ పోలీసు మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్.బి. శ్రీకుమార్ కూడా ప్రగాఢ హిందు విశ్వాసియే. పశ్చిమ బెంగాల్‌లో మతసంఘర్షణా రహితంగా గడిచిన 34 సంవత్సరాల వామపక్ష సంఘటన పరిపాలన, నాస్తికులైన కమ్యూనిస్టుల నైతికత, మతసామరస్యత, ఆదర్శాలకు నిదర్శనం. ప్రజల మతవిశ్వాసాలను, దైవభక్తి భావనలను, వ్యక్తుల స్వాతంత్య్ర హక్కును మా పత్రిక కాపాడు తుంది. అలాగే వారి ఆధ్యాత్మిక లేదా నాస్తిక భావాల కారణాన వారిని అపకీర్తి పాలు చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తుంది.”

దేవతలపై నమ్మకం లేకపోవడం లేదా దేవతలే లేరనడం – నాస్తికత్వం అంటారు. కానీ నిజానికి పుణ్య పాపాలను, స్వర్గ నరకాలను, పూర్వ పునర్జన్మ లను నమ్మకపోవడమే నాస్తికత్వం. మన మధ్య భౌతికంగా ఉనికిలో ఉన్న వాటిని, ప్రశ్నలకు నిలబడి జవాబులందించే విషయాలను, విశ్వజనీనత గల అంశాలను మాత్రమే హేతువాదం విశ్వసిస్తుంది. భావవాదాలను, ఊహాజనిత గాథలను, పురాణాలను నమ్మదు. మతాలకు అతీతంగా, మత విశ్వాసాలను నమ్మకుండా, దైవభావనకు దూరంగా, మనుషులం దరినీ సమాన మానవులుగా పరిగణించేది లౌకక వాదం. ఈ గుణాలన్నిటితో పాటు మానవతా, సామాజిక దృక్ఫథాలు కలిగిన వారు కమ్యూనిస్టులు. సమన్యాయం, సమాన హక్కులు, సర్వమానవ సౌభ్రాతృత్వం, అందరికీ విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ, వినోదం మొదలగు వాటిని అందించే సమసమాజాన్ని కాంక్షించి దానికోసం పోరాటాలను నిర్వహించేవారు, ఈ ప్రయత్నాలలో మార్కిస్ట్ సూత్రాలను ఆచరించే వారు మార్కిస్టులు.

కమ్యూనిజం, మార్కిజం దాదాపు పర్యాయపదాలే. కమ్యూనిస్టులంతా నాస్తికవాదులు, హేతువాదులు, లౌకికవాదులే. కాని ఈ నాస్తిక, హేతు, లౌకికవాదు లంతా కమ్యూనిస్టులు కాకపోవచ్చు. పురాణాల్లోని చార్వాకులు హేతువాదులే. సంపూర్ణ నాస్తికులు ఎలా ఉంటారో తెలియని రోజులు కావున వైష్ణవులైన పురాణ కవులు, శైవులైన రాక్షసుల్లో నాస్తికత్వాన్ని చూపించే విఫలప్రయత్నం చేశారు. సంపూర్ణ ఛాందస బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకభావాలతో జన్మించిన జైనమతం, బౌద్ధమతంలోని కొన్ని శాఖల లో దైవత్వాన్ని నమ్మరు. అన్యమతాల దేవతలను నమ్మరు కాబట్టి, క్రైస్తవులను నాస్తికులని పురాతన గ్రీకులనేవారు. రానురాను ఈ అభిప్రాయం మారిం ది. దివ్యత్వాన్ని నమ్మేవారంతా ఆస్తికులే అయ్యారు. దేవుళ్లు లేరనడం సకారాత్మక (పాజిటివ్) నాస్తి కత్వం. ఏ రకమైన దివ్యత్వాలు లేనవడం – ఇతర రూపాలపై అపనమ్మకం- నకారాత్మక (నెగటివ్) నాస్తికవాదం. దేవుడున్నాడని కాని, లేడని కానీ, అతీంద్రియశక్తులను కానీ నమ్మక, కేవలం నిర్ధారిత నిజాలనే నమ్మేవాడిని హేతువాది అంటారు. దేవతలు జీవితానికి ప్రయోజనాన్ని, జీవితంపై ప్రభావాన్ని కలిగించలేరనే శాస్త్రీయ దృక్ఫథం గలవారిని ఆచరణాత్మక నాస్తికవాదులు (అపతీ యిస్టులు) అంటారు. మానవత్వమే నాస్తికత్వ మనడాన్ని తార్కిక నాస్తికత్వమంటారు.

నైతికతే నాస్తికత. మతాన్ని సహించకపోవడమే కాదు, ఎదిరించాలని అనడం 21వ శతాబ్దపు “ఆధునిక నాస్తికత్వం”. ఒక ప్రక్కన అమెరికా సమాజంలోని దుర్గుణాలన్నింటికీ నాస్తికులు కారణమని విశ్వసించేవారుండగా, మరొక ప్రక్క ‘విశ్వాసానికి’ వ్యతిరేకంగా తీవ్రమైన దాడి చేసే ‘ఆధునిక నాస్తికత్వం’ గత కొన్ని సంవత్సరాలలో ఉద్భవిం చింది. రిచర్డ్ డాకిన్స్, డేనియల్ సి.డెన్నెట్, శామ్ హరిష్, క్రిస్టఫర్ హిట్చెన్స్, విక్టర్ జె, స్టెంజర్, జెర్నీ కోయ్నే, అమెరికా భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఎల్.పార్క్, పి.జడ్.మయ్యర్స్, లారీ మోర్న్‌లాంటి శాస్త్రజ్ఞులైన రచయితలు 2004-2007 ల మధ్య తమ పుస్తకాలు, రచనల ద్వారా ఆధునిక నాస్తికత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ రచయితల దృష్టిలో ప్రపంచ రుగ్మతలకు కారణమైన అనేక సమస్యలకు మతమే మూలం.

దేవుడున్నాడనే వారి మీదనే ఆయన ఉనికిని నిరూపించే బాధ్యత కూడా ఉంటుంది. 2006, నవంబరు, డిసెంబరులో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచజనాభాలో 2.3%మంది నాస్తికులు, 11.9% మంది లౌకికవాదులు. నాస్తికులు పాశ్చాత్యదేశాలలో ఎక్కువ. దేశాలవారీగా ఈ సంఖ్యాశాతం ఈ విధంగ ఉంది. అమెరికా-4, ఇటలీ-7, స్పెయిన్-11, జర్మనీ-20,ఫ్రాన్స్-32, యూరోపియన్ యూని యన్- 18, 2009 సర్వే ప్రకారం అమెరికాలో లౌకికవాదులు 15%. అన్ని రకాల అవిశ్వాసకులు స్వీడన్‌లో 85%, డెన్మార్క్‌లో 80%, నార్వేలో 72%, ఫిన్‌లాండ్‌లో 60.5%. ఆస్ట్రేలియన్‌లలో 22 శాతానికి మతం లేదని ‘ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్’ తెలిపింది. 64-65 % జపనీయులు దేవున్ని నమ్మరు. ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్’ లెక్కల ప్రకారం శాస్త్రజ్ఞులలో 51% మంది దైవశక్తులను (33% దేవున్ని, 18% అతీంద్రియశక్తిని) నమ్ముతారు. లౌకిక వాదులనగా మతాన్ని నమ్మనివారు అంతేకాని అందరూ ప్రచారం చేస్తున్నట్లు అన్ని మతాలను నమ్మే వారు కాదు. మతతత్వ సంస్థలు ఏర్పాటై తమ ప్రచా రాలను ప్రభుత్వాల, పాలకుల అండదండలతో చేసు కుంటున్నప్పుడే మత సామరస్యత మట్టిలో కలిసింది.

ఆస్తికత్వం మూఢనమ్మకాలను పెంచి పోషిస్తుంది. శాస్త్రీయ దృక్ఫథాన్ని ప్రశ్నించే తత్వాన్ని పెంచుతుంది. మూఢనమ్మకాలను రుజువు చేసి సకల జ్ఞానాలకు మూలమౌతుంది. సైన్స్ అశాస్త్రీయమైన మతానికి వ్యతిరేకం. మతం వెర్రితలలు వేసి, పశు బలులను, నరబలులను ప్రోత్సహించి, హంతక స్వభావాన్ని పెంచుతుంది. దేవున్ని నమ్మిన మరు క్షణం పూర్వ-పునర్జన్మలను, పాప-పుణ్యాలను నమ్ముతాం. మన పేదరికానికి పూర్వజన్మ పాపం కారణ మనుకుంటాం. దాని అసలు కారణాల జోలికి పోము. పోరాటాలను పొయ్యితోసి, చైతన్యరహితు లమై, దోపిడిలో మగ్గుతూ బతుకుతాం. అదీ ఆస్తికత్వ ప్రభావం. ఆస్తిత్వంతో జాతకాలు, జీవితాలు మార వు. నాస్తికత్వం ప్రతివిషయాన్ని ప్రశ్నించే గుణా న్ని నేర్పి, తెలివితేటలను పెంచుతుంది. మానత్వమే దాని అంతిమ, అత్యుత్తమ లక్షణం.
రచయిత : అఖిల భారత అభ్యుదయ వేదిక ఎపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
9490204545