Home తాజా వార్తలు ప్లంబర్లు… ఆకాశయానాలు

ప్లంబర్లు… ఆకాశయానాలు

ATM card is cloned and used to withdraw money

ఎటిఎం కార్డులు కాపీ కొట్టి భారీగా నగదు స్వాహా 

షాద్‌నగర్ ప్రాంతంలో 200 మంది బాధితులు 

మనతెలంగాణ/ సిటీబ్యూరో: వారు ముగ్గురూ చదివింది పదో తరగతి వరకే, కానీ టెక్నాలజీలో మంచి పట్టు సంపాదించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అందుకు కావాల్సిన డబ్బు కోసం నేరాల బాటపట్టారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే…..సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్(19), వినోద్ కుమార్(18), మంజేష్ కుమార్(21) ప్లంబర్ పనికోసం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు వచ్చారు. వినోద్ కమార్‌కు మంజేష్ కుమార్ మామ అవుతాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు కుట్రపన్నారు.

పనిలేనప్పుడు షాద్‌నగర్ బస్టాండ్ సమీపంలోని ఏటీఎం సెంటర్లలో ఖాతాదారులు డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు షోల్డర్ సర్‌ఫింగ్(భుజాల వెనుక నుంచి చూడడం) ద్వారా పిన్ నంబర్, సీవీవీ, కార్డు నంబర్‌ను చూస్తారు. తర్వాత ఆన్‌లైన్‌లో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని కార్డు వ్యాలిడిటీ తెలుసుకుంటారు. బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఖాతాలో ఎంత డబ్బుఉంది తెలుసుకుంటారు. తర్వాత ఈ కామర్స్ సైట్ల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ టికెట్స్, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేస్తారు. మొబైల్‌కు  ఓటీపీ రాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో పిన్ నంబర్ ఆప్షన్ ఎంచుకుని వస్తువులు కొనుగోలు చేస్తారు.

ముగ్గురు యువకులు ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల ఖాతాదారుల కార్డుల నంబర్లు చివరలో ఒకే విధంగా ఉండడంతో గుర్తుంచుకుని ఈ కామర్స్ నుంచి వస్తువులు కొనుగోలు చేసేవారు. దాదాపుగా 200మంది బాధితులు షాద్‌నగర్ ఏరియాలో ఉన్నారు. అయితే వారిలో చాలామందివి 3 నుంచి 10వేల లోపు డబ్బులు డ్రా అయినట్లు వచ్చినా, వారు బ్యాంకులో మాత్రమే ఫిర్యాదు చేశారు. షాద్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి రూ.10,000 చొప్పున మొత్తం రూ.3,89,500 ఎవరో డబ్బులు డ్రా చేశారని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. తర్వాత 75మంది సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులు ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసిన వస్తువులను ఒకే ప్రాంతం అడ్రస్ ఇస్తే అనుమానం వస్తుందని, దేశంలోని వివిధ ప్రాంతాల అడ్రస్‌లు ఇచ్చారు. సివాన్, బీహార్ రాష్ట్రం, కేరళ, బెంగళూరు, ఇండోర్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అడ్రస్‌లు ఇచ్చేవారు. వస్తువులను తీసుకునేందుకు ముగ్గురు ఫ్లైట్‌లో వెళ్లి, వాటిని అక్కడే అమ్మి వచ్చేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు, అంతేకాకుండా ఇంటికి వెళ్లేందుకు టికెట్లను బుక్ చేసుకునేవారు. ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, ఆమేజాన్ తదితర ఈ కామర్స్ వాటిలో ఎక్కువగా షాపింగ్ చేశారు. దేశంలో ఎక్కడికివెళ్లినా ఫ్లైట్‌లో మాత్రమే వెళ్లేవారు.

ఏటీఎం వివరాలు గోప్యంగా ఉంచుకోండి : సీపీ సజ్జనార్
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు లోపల ఒకరే ఉండాలని, పిన్,సివివి నంబర్లు ఎవరూ చూడకుండా ఉంచుకోవాలని సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ అన్నారు. కార్డు, రిసిప్ట్‌ను వెంటనే పాకెట్‌లో పెట్టుకోవాలని, అక్కడ పడవేయ వద్దని సూచించారు. ఏటీఎం సెంటర్ వద్ద ఎవరైనా అనుమానస్పదంగా కన్పిస్తే ట్రాన్‌జాక్షన్ రద్దు చేసుకోవాలని కోరారు.

ATM card is cloned and used to withdraw money

 Telangana Latest News