Home తాజా వార్తలు త్వరలో ఎటిఎం ఛార్జీల్లో మార్పు

త్వరలో ఎటిఎం ఛార్జీల్లో మార్పు

 

సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు: ఆర్‌బిఐ

ఇతర బ్యాంకు ఎటిఎంలను వాడినందుకు గాను చెల్లించే ఛార్జీలు త్వరలో మారే అవకాశముంది. ఈ ఛార్జీలను సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు గురువారం ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ కమిటీకి ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ సిఇఒ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ఈ ఛార్జీలను నిర్ణయిస్తుందని, వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ తన తొలి నివేదికను అందజేస్తుందని ఆర్‌బిఐ పేర్కొంది. ఒక బ్యాంకు కార్డుతో వేరే బ్యాంకుకు చెందిన ఎటిఎంలో లావాదేవీలు నిర్వహించినందుకు గాను చెల్లించాల్సిన చార్జీలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఏ బ్యాంకు కార్డుదారులైనా వేరే బ్యాంకు ఎటిఎంలలో లావాదేవీలు నిర్వహించవచ్చు, అయితే లావాదేవీల సంఖ్యపై పరిమితి ఉంది. అంతకు మించిన సంఖ్యలో లావాదేవీలు జరిపితే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లావాదేవీలపై ఛార్జీల విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్‌బిఐ గురువారం ప్రకటించింది. ప్రస్తుతానికి ప్రముఖ బ్యాంక్ ఐసిఐసిఐ ఒక నెలలో ఆరు మెట్రో నగరాల్లో తొలి మూడు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో అయితే ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ప్రతి నగదు లావాదేవీకి రూ.20 ఛార్జి చేస్తోంది. నగదు యేతర (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్) లావాదేవీకి రూ.8.50 ఛార్జీ వసూలు చేస్తోంది. ఎస్‌బిఐ ప్రతి నగదు లావాదేవీకి రూ.20+ జిఎస్‌టి, నగదు యేతర లావాదేవీకి రూ.8+ జిఎస్‌టిని వసూలు చేస్తోంది.

ATM transaction charges to be changes soon!