Home ఎడిటోరియల్ అమానుష శ్రమదోపిడీ!

అమానుష శ్రమదోపిడీ!

Garment Factories

మనిషి రూపాయల యంత్రమైన చోట మానవీయ విలువలు మచ్చుకైనా మిగలవు. యంత్రానికైనా మరమ్మతులు, సర్వీసింగ్ వంటి సేవలు లభిస్తాయి గాని పెట్టుబడిదార్లకు డబ్బు కాసే చెట్టులా ఉపయోగపడే మనిషికి మాత్రం అటువంటివేమీ ఉండవు. పని గంటలు, సెలవులు తదితర చట్టపరమైన సదుపాయాలు కల్ల. అంతటితో సరిపుచ్చితే పర్వాలేదు. ప్రకృతి సహజమైన శారీరకావసరాలకు సైతం వెళ్లనీయకుండా మర మనుషులను చేసి నిర్విరామంగా పని చేయించడమే దారుణం. తమిళనాడులో భారీగా విస్తరించుకున్న దుస్తుల తయారీ పరిశ్రమలో మహిళా కార్మికులపై ఈ అమానుషం రాజ్యమేలుతున్న తీరు గురించి వెలువడిన సమాచారం ఆందోళనకరంగా ఉన్నది. వేల కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతున్న ఈ కర్మాగారాల్లో మహిళల పని పరిస్థితులపై అధ్యయనం చేసిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి గొలిపే చేదు వాస్తవాలను బయటపెట్టింది. 10 గంటల పాటు సాగే పని షిఫ్టులతో, నెలసరి నొప్పులు కలిగినప్పుడు కూడా సెలవు ఇవ్వకుండా వాటిని అణచిపెట్టడానికి ఫ్యాక్టరీ సూపర్ వైజర్లు పేరులేని మందు బిళ్లలను తమ చేత మింగిస్తున్నారని అక్కడ పని చేస్తున్న మహిళలు వెల్లడించారు. ఈ బిళ్లలకు డాక్టరు చీటీ కూడా ఉండదని వారు చెప్పారు. సెలవులు, విరామం, విశ్రాంతి లేకుండా నెల రోజులు పని చేస్తేగాని రూ. 12,000 జీతం పూర్తిగా రాదు.

ఈ నేపథ్యంలో నెలసరి నొప్పులకు బాధా నివారిణి మాత్రలు మింగడమే కాదు, మూత్రశాలకు వెళ్లే సమయాన్ని కూడా పరిమితం చేసుకోడం వంటి కఠిన నిబంధనల కింద పని చేయించడం ఎంతటి అమానుషమో వివరించనక్కర లేదు. థామ్సన్ రాయిటర్స్ తమిళనాడు దుస్తుల పరిశ్రమలోని 100 మంది మహిళలను ఇంటర్వూ చేసి ఈ కఠోర సత్యాలను బయటపెట్టింది. వ్యవసాయ సంస్కృతిలో మహిళలను భూకామందులు శ్రమాది దోపిడీలకు గురి చేసిన దుర్మార్గం తెలిసిందే. పారిశ్రామిక రంగంలో కూడా అది కొనసాగడం, సెలవు దినాలు, పని గంటలు వంటి చట్టబద్ధ నిబంధనలను కాలరాసి నిరంతరాయ శ్రమకు గురి చేసే అమానుషమైన పద్ధతులను అవలంబించడం ఆధునికతను వెక్కిరిస్తున్నది. ఉత్పత్తిని పెంచి అధిక లాభాలను గడించేలా చేసి వృద్ధి రేటు పైచూపు చూసేలా చేయడం కోసం కార్మిక చట్టాలను ప్రభుత్వాలే నీరుగార్పిస్తున్నాయి. పతన దిశలో సాగుతున్న వృద్ధి రేటును మళ్లీ పుంజుకునేలా చేయడానికి విదేశీ బహుళ జాతి పెట్టుబడులను విశేషంగా ఆకర్షించాలనే సంకల్పం ప్రస్తుతం దేశ పాలకులలో గాఢంగా చోటు చేసుకున్నది. అందుకు వీలుగా కార్మిక చట్టాలను మరింతగా బలహీనపర్చాలనే ఆలోచన సాగుతున్నట్టు సమాచారం.

ఇందుకు చైనాను ఆదర్శంగా తీసుకోవాలనుకున్నట్టు తెలుస్తున్నది. చైనాలో ఉత్పత్తిని అసాధారణ రీతిలో పెంచడానికి ప్రజల స్వేచ్ఛను హరించే పద్ధతులెన్నింటినో ప్రవేశపెట్టారు. ఒకే బిడ్డ సూత్రాన్నీ అమలుపర్చారు. పని గంటలు, సెలవులు వంటి ప్రజాస్వామిక సౌకర్యాలకూ పరిమితులు పెట్టారు. ఉక్కు పాదంతో, నిరంకుశాధికారాలతో ప్రజలను కొరడాలతో అదిలించి పని చేయించడం ద్వారా సాధించుకునే పారిశ్రామిక ప్రగతి మానవత్వానికి మచ్చగా మిగులుతుందేగాని గొప్పతనంగా గుర్తింపు పొందదు. మన దేశంలోని పరిశ్రమల చట్టం కర్మాగారాల్లో వైద్యశాలలుండాలని సూచిస్తున్నది. అందులో యోగ్యులైన, అర్హత గలిగిన డాక్టర్లు, నర్సులు కూడా ఉండాలని పేర్కొంటున్నది. తమిళనాడు దుస్తుల పరిశ్రమలో అటువంటి సదుపాయాలున్న జాడల్లేవు. ఆ రాష్ట్రమంతటా గల 40,000 దుస్తుల పరిశ్రమల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు పని చేస్తున్నారని అధికారిక సమాచారం. వాస్తవంలో ఇంతకంటే చాలా ఎక్కువ మంది మహిళా కార్మికులు అందులో శ్రమిస్తున్నారు. వారిలో దిన కూలీలు కూడా భారీ సంఖ్యలో ఉంటారు.

ముఖ్యంగా కింది కులాలకు చెందిన చదువులేని గ్రామీణ పేద యువతులు ఈ పరిశ్రమలో పని చేస్తుంటారు. పాశాత్య బ్రాండ్ల కోసం ఇక్కడ తయారయ్యే దుస్తులకు మంచి గిరాకీ ఉంది. విశేష లాభార్జన మీద మక్కువతో తక్కువ వేతనంతో, అరకొర సదుపాయాలతో ఎక్కువ పని చేయించుకుంటున్నారు. వ్యాపారంలో లాభార్జన ప్రధానమైనదే గాని అందుకోసం అమానుష పద్ధతులను అవలంబించడం మాత్రం క్షమించదగినది కాదు. ప్రభుత్వ అధికారులను లోబర్చుకోడంలో అందెవేసిన చేతులుగా ప్రసిద్ధికెక్కిన ప్రైవేటు యాజమాన్యాలు రక్తం రుచిమరిగిన చందంగా చౌక శ్రమకు అలవాటుపడ్డాయి. వాటిని దారిలోకి తెచ్చి మహిళా కార్మికులకు చట్టబద్ధ పని దినాలు, సెలవులు, ప్రసూతి కాల సదుపాయాలు వంటివి కల్పించేలా చూడవలసిన బాధ్యత పాలకులపై ఉంది.

atrocity on Women Workers in Garment Factories