Home ఎడిటోరియల్ విధ్వంస రాజకీయాలు!

విధ్వంస రాజకీయాలు!

edit

ఇప్పుడు దేశమంతా విగ్రహోత్పాతక రాజకీయాలు నడుస్తున్నట్లున్నాయి. తాజాగా కేరళ కన్నూరులో మహాత్మాగాంధీ విగ్రహంపై దాడి జరిగింది. చెన్నైలో అంబేద్కర్ విగ్రహంపై పెయింటు పోసి అవమానపరిచారు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఇక తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని కూల్చాలంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి తర్వాత ఆ వ్యాఖ్య తన ఆడ్మిన్ చేశాడని తప్పించుకోవాలనుకున్నాడు తమిళనాడు బిజెపి నేత రాజా. ఆ ఆడ్మిన్ ఎవరో ఆయన చెప్పలేదు. ఆ తర్వాత రాజా చెప్పినట్లే తమిళనాడులో పెరియార్ విగ్రహంపై దాడి జరిగింది. తమిళనాట ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగారు. మీరట్‌లో డా.అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది. త్రిపురలో బిజెపి అనూహ్యంగా గెలిచింది. అనుకోనన్ని సీట్లు లభించాయి. ఆ వెంటనే త్రిపుర వామపక్ష కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులు ప్రారంభమయ్యాయి. బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని అల్లరి మూకలు కూలగొట్టాయి. అల్లరి మూకలు చేసిన పనిగా దీన్ని పక్కన పెట్టలేము. స్వయంగా బిజెపి ప్రముఖ నాయకుడు, ఆరెస్సెస్ నేత రాంమాధవ్ లెనిన్ విగ్రహ విధ్వంసాన్ని చూసి సంతోషం పట్టలేక ట్వీటు చేశాడు. సోషల్ మీడియాలో తీవ్రంగా నిరసనలు పెల్లుబుకడంతో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రిపుర గవర్నరుతో మాట్లాడారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌తో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని చెప్పారు. విచిత్రమేమంటే త్రిపుర గవర్నరు తథాగత్ రాయ్ స్వయంగా లెనిన్ విగ్రహాన్ని కూల్చడంపట్ల ఆనందాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయాడు. తథాగత్ రాయ్ ఒక రాష్ట్ర గవర్నర్ అన్న మాట కూడా మరిచిపోయి, గవర్నర్ పదవి మర్యాదను కూడా మరిచిపోయి, ప్రజాస్వామికంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం చేసిన పనిని, ప్రజాస్వామికంగా ఎన్నికైన మరో ప్రభుత్వం తిరగబెడుతుందని అన్నాడు. బిజెపి రాజకీయాలో ఎలాంటివో అర్ధం చేసుకోడానికి ఈ వ్యాఖ్యలు చాలు. త్రిపుర లాంటి ప్రదేశాల్లో పదకొండు మంది బిజెపి కార్యకర్తలు హతమైనా వామపక్షాలు మాట్లాడలేదు. వామపక్షాలను సమర్ధించే కొందరు ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారంటూ“ అర్థం పర్థం లేని ప్రకటన తప్ప ఆయన చెప్పింది ఏదీ లేదు.త్రిపుర గవర్నరు, రాంమాధవ్ స్పష్టంగా తమ సంతోషాన్ని ప్రకటించినట్లే అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించాడు. లెనిన్ విగ్రహాన్ని కూలదోసి, విగ్రహం తలతో ఫుట్ బాల్ అ డారని వచ్చిన వార్తల తర్వాత ఆయన ప్రతిస్పందిస్తూ లెనిన్ విదేశీ నా యకుడు, ఒక టెర్రరిస్టు. అలాంటి వ్యక్తి విగ్రహం మన దేశంలో ఉండరాదు. కమ్యూనిస్టు పార్టీ హెడ్ క్వార్టర్లలో ఈ విగ్రహం పెట్టుకుని పూ జలు చేసుకోండి అంటూ వ్యాఖ్యానించాడు. సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడే కాదు, తమిళనాడు బిజెపి నేత రాజా కూడా లెనిన్ ఎవ్వరు? ఇండియాకు లెనిన్‌కు సంబంధమేంటి అన్నాడు. అదేఊపులో పెరియార్ విగ్రహానికి కూడా అదే గతి పట్టిస్తామని అన్నాడు. తర్వాత ఆ పోస్టు తాను చేయలేదని మాట మార్చేశాడు. కేంద్రమంత్రి హంసరాజ్ ఆహిర్ కూడా ఇదే పాట పాడుతూ విదేశీ నాయకుల విగ్రహాలు దేశంలో ఉండరాదన్నాడు. లెనిన్ టెర్రరిస్టని సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్య విషయానికి వస్తే కమ్యూనిజం అంటేనే ఉలిక్కిపడే అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంపై పోరాడుతున్నానని చెప్పుకునే అమెరికాలో కూడా లెనిన్ విగ్రహాలున్నాయి.కౌలాలంపూర్‌లో 2015లో మన ప్రధా ని మోడీ స్వయంగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోడీ లండన్‌లో 12వ శతాబ్దికి చెందిన తత్వవేత్త బసవేశ్వర్ విగ్రహాన్ని థేమ్స్ నది ఒడ్డున ఆవిష్కరించారు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహాత్మాగాంధీ మొదలు కత్రినా కైఫ్ వరకు భారతీయుల విగ్రహాలున్నాయి. అందులో మోడీవిగ్రహం కూడా ఉంది. లిథువేనియాలో గాంధీజీ విగ్రహముంది. కాలిఫోర్నియా, లండన్, కోపెన్ హాగన్, దక్షిణాఫ్రికా, ఆర్జంటీనా, ఆస్ట్రేలియా, ఉగాండా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ తదితర చోట్ల గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. చైనాతో మనకు ఉద్రిక్తతలున్నప్పటికీ చైనాలో ద్వారకానాథ్ కొట్నీస్ విగ్రహముంది. విగ్రహాలే కాదు విదేశాల్లో అనేకమంది భారతీయుల గౌరవార్థం రోడ్లకు, నలువీధుల కూడళ్ళకు భారతీయుల పేర్లు పెట్టారు. కెనడాలో ఏ.ఆర్.రహ్మాన్ స్ట్రీట్ ఉంది. న్యూజిలాండ్ లో గవాస్కర్ ప్యాలెస్ ఉంది. నెదర్లాండ్స్‌లో మహాత్మాగాంధీ రోడ్, చికాగోలో స్వామీ వివేకానంద వే, టాంజానియాలో ఇందిరాగాంధీ స్ట్రీట్, బెర్లిన్‌లో రబీంద్రనాథ్ ఠాగూర్ స్ట్రీట్ ఉన్నాయి. చివరకు మన శత్రుదేశం, పొరుగుదేశం పాకిస్తాన్‌లో కూడా భగత్ సింగ్ చౌక్ ఉంది. ఈ దేశాలన్ని భారతీయుల విగ్రహాలను విదేశీ విగ్రహాలు మనకెందుకు అని భావిస్తే మనకు బాధగా ఉండదా? నిజానికి ఘనాలో అక్రా విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహం తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, అంటే 2016 అక్టోబరులో భారత ప్రజలు బాధపడలేదా? ఘనా ప్రభుత్వం వివాదం ముదరకుండా అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని మరో చోటికి తరలించింది. అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్య అది. ప్రజలు రెచ్చిపోయి ధ్వంసం చేయలేదు. ప్రభుత్వం అలాంటి అవకాశమూ ఇవ్వలేదు. కాని ఇక్కడ అల్లరిగుంపులు రెచ్చిపోయి విగ్రహం కూలదోసి తలతో ఫుట్ బాల్ ఆడుకుంటే బిజెపి నేతలు కేరింతలు కొడుతూ ట్వీట్లు చేశారు. ఇక్కడ బిజెపి నేతలు లెనిన్ విగ్రహాల విధ్వంసం చూసి కేరింతలు కొడుతున్నారు కాని మాస్కోలో గాంధీజీ విగ్రహం ఉంది. భారతదేశం కానుకగా ఇచ్చిందే. అక్కడే ఇందిరాగాంధీ మాన్యుమెంట్ కూడా ఉంది. ఇందిరాగాంధీ స్క్వేర్ గా పిలుస్తారు. మాస్కోలో జవహర్ లాల్ నెహ్రూ స్క్వేర్ కూడా ఉంది. 1996లో ఇక్కడ నెహ్రూ విగ్రహం కూడా పెట్టారు. భారత నాయకుల పట్ల గౌరవాదరాలు చూపించే రష్యా ప్రజలు ఇప్పుడు తమ నాయకుడిపట్ల ఇక్కడి ప్రజల వైఖరి, (ప్రజలే ఈ పని చేశారని బిజెపి నేతలంటున్నారు కాబట్టి) గురించి రష్యన్లు ఏమనుకుంటున్నారో?
ఇప్పుడు గెలుపు గర్వంతో బిజెపి త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూలదోయవచ్చు. ప్రజలు ఆ పని చేశారని తప్పించుకోవచ్చు. కాని చరిత్రను తుడిచేయడం సాధ్యమా? దాదాపు పాతికేళ్ళు వామపక్షాలు త్రిపురలో అధికారంలో ఉన్నప్పుడు సాధించిన విజయాలను కాదనడం సాధ్యమా? ఈ ఎన్నికల తర్వాత వామపక్షాలు త్రిపురలో తుడిచిపెట్టుకుపోయాయి అని ఎవరైనా అనుకుంటే అది పెద్ద పొరబాటు. సిపిఎం 45 శాతం ఓట్లు పొందింది. ప్రజలు సిపిఎంతోనే ఉన్నారనడానికి ఈ ఓట్లశాతమే నిదర్శనం. ట్విట్టరులో సోషల్ మీడియాలో బిజెపి నేతలు లెనిన్ విదేశీయుడనీ, టెర్రరిస్టనీ, భారతభూభాగంపై ఆయన విగ్రహానికి చోటు లేదని రెచ్చిపోతున్న తీరును కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. విదేశీ సిద్ధాంతాల ప్రభావం సంఘ్ పై లేదా? గురూజీ ”బంచ్ ఆఫ్ థాట్స్‌“ పై లేదా? ఆరెస్సెస్ యూనిఫాం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేశీయమా? విదేశీ అంటూ రెచ్చిపోయేవాళ్ళే ట్రంప్ గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేశారు. అమెరికాలో కొత్త అవతారం జన్మించాడనుకున్నారేమో. కాని ఆ కొత్త అవతారం ఇప్పుడు అమెరికాలో భారత ప్రయోజనాలపై గురిపెడుతున్నాడు. కూల్చివేతలు, విధ్వంసాల రాజనీతి ఆటవికమైనది.