Friday, April 26, 2024

డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్

- Advertisement -
- Advertisement -

Doctor

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా అనుమానిత లక్షణాల వ్యక్తి దాడి చేసిన సంగతి విధితమే. దీన్ని పరిగణలోకి తీసుకొని డాక్టర్లకు ప్రత్యేక రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా జి. ఒ నెం 103 ని పకడ్భందీగా అమలు చేయాలని వైద్యారోగ్యశాఖ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తుంది. సిఎం ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చట్టాలు ఉన్నా, చాలా మందికి అవగాహన లేక ప్రాణాలు పోసే వైద్యులపై దాడులకు దిగుతున్నారు. ఎన్నిసార్లు సూచించిన ప్రజల్లో మార్పులు రావడం లేదు. దీంతో డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్ ఉండబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

యాక్ట్ 11, 2008, జి.ఒ 103 ప్రకారం కఠిన చర్యలు……
ఆసుపత్రుల్లో డాక్టర్లపై దాడి చేస్తే యాక్ట్ 11, 2008 ప్రకారం దాడి చేసిన వ్యక్తిపై 3 ఏళ్లు జైలు శిక్ష, 50 వేలు జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ చట్టం పాతదే అయినప్పటికీ చాలా మందికి అవగాహన లేక వైద్యులపై దాడికి దిగుతున్నారు. దీంతో దాడుల ఘటనలు పునరావృతం కాకుండ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 2019న తీసుకువచ్చిన జి.ఒ నెం 103 ప్రకారం మూడు షిష్టులలో టీచింగ్ ఆసుపత్రుల్లో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, టీచింగ్ ఆసుపత్రుల్లో తరచూ వైద్యులపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ డాక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. ఏటా గాంధీ, ఉస్మానియా, తదితర ఆసుపత్రుల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి.

దీనిలో అధికారికంగానే ఒక్కోక్క ఆసుపత్రిలో ప్రతి ఏటా 4 కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆసుపత్రుల్లో పనిచేయాలంటే వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ల సేవలు ఎంతో అవసరం. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలనే దృడ సంకల్పంతో ఉందని ప్రజారోగ్య, కుంటుంబ సంక్షేమ సంచాలకులు డా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇప్పటికే గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రులలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ప్రత్యేక భద్రత కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలుః డా శ్రీనివాస్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్లపై దాడులు చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. రోగికి ప్రాణాలు పోసే తమకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవకి అభినందనలు. రాబోయే రోజుల్లో ఎలాంటి దాడులు జరుగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని ఆసుపత్రుల్లో రాష్ట్ర పోలీసు సిబ్బందితో పాటు సెంట్రల్ ఫోర్సును కూడా ఏర్పాటు చేసేందుకు ప్రోటెక్షన్ యాక్ట్‌ను కూడా అమలు చేయాలి. దీంతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి రోగులకు కూడా అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి.

Attacks on doctors are harsh punishments
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News