Saturday, April 20, 2024

వైద్యులపై దాడులు!

- Advertisement -
- Advertisement -

Attacks on doctors

 

డాక్టరు అందుబాటులో లేని చోటుని వెంటనే విడిచిపెట్టిపోవాలని సుమతి శతక కారుడు ఏనాడో చెప్పాడు. అందులోని నీతి దేశంలోని సాధారణ ప్రజలకు ఇప్పటికీ తలకెక్కలేదు. కరోనా వైరస్ చికిత్స తదితర విధుల్లోని వైద్యులను, ఇతర సిబ్బందిని బెదిరించడం, కొట్టడం, వారి స్వగృహాలకు తిరిగి వెళ్లనివ్వకపోడం దేశంలో వివిధ ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్నాయంటే మనం ఎంతటి అమానవీయ మానసిక స్థితిలో కూరుకుపోయి ఉన్నామో స్పష్టపడుతున్నది. హైదరాబాద్‌లో కరోనా చికిత్స కోసం ప్రత్యేకించిన గాంధీ ఆసుపత్రిలో గత నెలాఖరులో డ్యూటీలోని డాక్టర్లపై ఇటువంటి దాడే జరిగింది. కరోనాతో తమ బంధువు మరణించడానికి వారి నిర్లక్షమే కారణమంటూ ఇద్దరు వ్యక్తులు ఈ హీనమైన చర్యకు తలపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి వైరస్ సోకగా వారిని ఆసుపత్రి ఎనిమిదో అంతస్థులో గల ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స అందించారు. వారిలో ఒకరికి వ్యాధి ముదిరి చనిపోడంతో విధుల్లోని డాక్టర్లపై మిగిలిన వారు చేయి చేసుకున్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి వైద్యులకు రక్షణ పెంచారు. నిందితులపై చర్యలకు ఉపక్రమించారు. దేశంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. చెన్నైలో ఈ వైరస్‌తో చనిపోయిన ఒక న్యూరోసర్జన్‌కు అంత్యక్రియలు సవ్యంగా పూర్తి కానివ్వకుండా స్థానికులు అడ్డుకున్న ఉదంతం అత్యంత దారుణమైనది. డాక్టర్లనే కాదు వైరస్ సోకిందనే సమాచారాన్ని నిర్ధారించుకోడానికి నమూనాల సేకరణ పని మీద జనావాసాల్లోకి వెళుతున్న వైద్య సిబ్బంది మీద కూడా దాడులు, నిర్బంధాలు వంటివి నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఈ విషాదకరమైన నేపథ్యంలో దేశంలోని వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నేతృత్వంలో ఆందోళనకు దిగారు. ఇటువంటి ఆపత్కాలంలో వైద్యులపై దాడి చేసేవారిని నేరుగా జైలుకు పంపాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆజ్ఞాపించారు. అలాగే దేశమంతటా పలు చోట్ల జనంలో జడలు విప్పుతున్న ఈ వికృతి మానసిక స్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వమూ బ్రిటిష్ కాలం నాటి చట్టానికి సవరణ తెస్తూ ఒక ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది.

కరోనా డాక్టర్లపై , ఇతర సిబ్బందిపై దాడి చేసేవారికి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు, రూ. 7 లక్షల జరిమానా విధించడానికి ఇది అవకాశం కల్పిస్తున్నది. కనిష్ఠంగా మూడు నుంచి ఐదు మాసాల జైలు, రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానాను నిర్దేశించింది. అదే సమయంలో దాడిలో ధ్వంసమైన ఆస్తి విలువకు రెట్టింపు సొమ్మును దోషుల నుంచి వసూలు చేసి ఇప్పించాలని, నెల రోజుల్లోగా కేసు విచారణ పూర్తి కావాలని, తీర్పు ఏడాదిలో వెలువడాలని స్పష్టం చేసింది. మృతి చెందిన రోగుల బంధువులు వైద్యులపై దాడులకు దిగడం కొత్తగా కరోనాతోనే తల ఎత్తినది కాదు. అంతకు ముందునుంచి ఈ దుర్మార్గం ‘వర్ధిల్లుతూనే’ ఉంది. అవగాహన, పరిణతి లేని జనం తమ ఆత్మీయుల మరణానికి వైద్యుల నిర్లక్షమే కారణమన్న అనుమానంతో వారిపై భౌతిక దాడులకు తెగించడం దేశంలో మామూలయిపోయింది. అటువంటి ఘటనలు జరిగినప్పుడు డ్యూటీలోని డాక్టర్లు, వారి తోటి సిబ్బంది విధులను బహిష్కరించడం ద్వారా నిరసన తెలపడం పదేపదే సంభవిస్తున్నది.

రోగి ప్రాణం పోయే పరిస్థితి రోగం ముదరడం వల్ల దాపురిస్తున్నదని, తగిన చికిత్స చేయడం వరకే వైద్యుల బాధ్యతగాని వారు స్వయంగా కొత్తగా ప్రాణాన్ని పోయలేరనే దృష్టి లోపించడం వల్లనే రోగుల బంధువులు ఈ దాడులకు తెగిస్తున్నారు. కరోనా విషయంలోనైతే ఆత్మన్యూనతా భావం ఇందుకు తోడవుతున్నది. వైరస్ తమకు సోకిందనే సమాచారం బయటకు పొక్కితే పది మందిలోనూ పలచబడిపోతామనే కుహనా ప్రతిష్ఠకు పోవడం ఈ దాడులకు దోహదపడుతున్నది. తమ ఆరోగ్య స్థితిపై అనుమానాలు బయల్దేరినప్పుడు స్వయంగా ఆసుపత్రిని ఆశ్రయించడం, తమకు సోకిన వైరస్ ఇతరులకు పాకకుండా జాగ్రత్త వహించి సమాజానికి మేలు చేయడమనే ఆధునిక మానవీయ లక్షణం లేకపోడమూ తామెక్కిన కొమ్మను నరుకోడంతో సమానమైన ఇటువంటి నేరాలకు మూలం.

కేవలం కఠిన శిక్షలతో కూడిన చట్టాలు, ఆర్డినెన్స్‌లు తీసుకురాడంతోనే ఇది నిర్మూలన కాదు. సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా స్పందించడంతో సరిపెట్టుకోకుండా ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం వివిధ స్థాయిల్లో తగిన కృషి జరపవలసి ఉంది. ఇందుకు మన రాజ్యాంగంలోని అనేక అధికరణలు, ఆదేశాలు తోడ్పడతాయి. కావల్సిందల్లా దృఢ సంకల్పమే. ప్రజల్లో ప్రజాస్వామిక స్పృహను పెంచు తూ పోవడం ఒక్కటే ఈ మాదిరి దురాగతాలకు స్వస్తి పలకగలదు.

 

Attacks on doctors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News