Home ఎడిటోరియల్ ఆగస్టు 9: మోడీకి దళిత పరీక్ష

ఆగస్టు 9: మోడీకి దళిత పరీక్ష

Article about Modi china tour

ఏప్రిల్ 2న దళిత సమాజం ఆందోళన తదుపరి, ఆగస్టు 9న భారత్ బంద్ రూపంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ముఖాముఖీ తలపడటానికి దళితులు మరోమారు సన్నద్ధమవుతున్నారు. ఎన్‌డిఎలోని, మోడీ ప్రభుత్వంలోని దళిత నేతలు కూడా ఈ పర్యాయం బంద్‌ను బలపరుస్తున్నారు. దళితులకు రక్షణగా ఉన్న ఏకైక చట్టం “ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చిన సుప్రీంకోర్టు తీర్పును పరిహరిస్తూ యథాపూర్వస్థితి పునరుద్ధరణకై ఆర్డినెన్స్ జారీ చేయాలి లేదా బిల్లు ప్రవేశపెట్టాలనేది వారి డిమాండ్. 1989 నాటి చట్టం కోరలు తీసిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఎ.కె.గోయెల్‌ను ఉద్యోగ విమరణ రోజే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటాన్ని దళిత నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంటులోని దళిత ఎంపిలు పార్టీలకతీతంగా చర్చలు జరిపి ప్రభుత్వ సాచివేత వైఖరిని నిరసిస్తూ, అత్యాచారాల నిరోధక చట్టం యథాపూర్వస్థితి పునరుద్ధరణకు ఆగస్టు 8ని గడువుగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు చట్టాన్ని నీరుగార్చి నాలుగు నెలలు దాటినా, ‘ఎస్‌సి, ఎస్‌టిల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంద’నే పడికట్టు పదాల ప్రకటనలు తప్ప, ఆ తీర్పును రద్దు పరిచే చర్యలు తీసుకోకపోవటం వారిని ఆందోళనకు గురి చేస్తున్నది. ఎంపిల సమావేశానికి ముందే అనేక దళిత సంఘాలు, రాజకీయ నాయకులతో కూడిన సమావేశాలు, చర్చల పర్యవసానంగా ‘దళిత్ స్వాభిమాన్ సంఘర్ష్ మంచ్‌” ఏర్పడింది. బి.ఆర్.అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ఇందుకు చొరవ తీసుకున్నారు. కేవలం బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పోరాటం మాత్రమే సరిపోదని, దళితులెదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై ఉద్యమించాలని మంచ్ నిర్ణయించింది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే మంచ్ సామాజిక సమస్యలపై దేశవ్యాప్త ఆందోళన తలపెట్టింది. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పక్షం రోజుల క్రితం దళిత హక్కుల కూటమి అఖిల భారత అంబేద్కర్ మహాసభ నాయకులతో సమావేశం తదుపరి, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ చట్టం చేయాలంటూ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. ఎన్‌జిటి ఛైర్మన్‌గా జస్టిస్ (రిటైర్డ్) గోయెల్ నియమకాన్ని వ్యతిరేకిస్తూ లోక్‌జన శక్తి పార్లమెంటరీ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ప్రధానికి రాసిన లేఖను కేంద్ర మంత్రులు రాం విలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలె సమర్థించారు. ఇదిలా ఉండగా, దళిత ఉద్యమంలో మధనం జరుగుతోంది. రాం విలాస్ పాశ్వాన్, ఉదిత్ రాజ్, మాయావతి వంటి స్థిరపడిన నాయకులకు, జాతీయ స్థాయిలోకి దూసుకొస్తున్న యువతరం నాయకులకు మధ్య పోటీ పెరుగుతోంది.
భారత్ బంద్‌కు తక్షణ కారణం ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చటంపై దళిత నిరసనను ప్రభుత్వం పట్టించుకోకపోవటం. అమాయక పౌరులను ‘బ్లాక్ మెయిల్’ చేయటానికి ఈ చట్టం వినియోగించబడుతోందని, చట్టం ముందు సమానత్వం సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరణ క్లాజును రద్దు చేసింది. ప్రభుత్యోద్యోగిపైగాని, ప్రైవేటు ఉద్యోగిపైగాని ఆరోపణరాగానే అరెస్టు చేయరాదని, ప్రాథమిక దర్యాప్తు తదుపరి మాత్రమే చర్య తీసుకోవాలని, అరెస్టు చేయాలంటే వారి పై అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని వగైరా మార్గదర్శకాలు జారీ చేసింది.
దేశంలో దళితులపై అత్యాచారాలు పెరుగుతున్న దశలో సుప్రీంకోర్టు తీర్పు దళితులకున్న ఏకైక రక్షణను రద్దు చేసిందని, దళిత సంఘాలు, ఎంపిలు ఆనాడే విమర్శించారు. దీనిపై ప్రభుత్వం తక్షణం ఆర్డినెన్స్ జారీ చేయాలి, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటు సమావేశంలో ఉన్నందున ఆర్డినెన్స్‌కు అవకాశం లేదు. అందువల్ల చట్టాన్ని పునఃప్రవేశపెట్టటమే మార్గం అంటున్నాడు చిరాగ్ పాశ్వాన్. 201416 లో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల చట్టం కింద దాఖలైన కేసుల్లో కేవలం 27 శాతంలో మాత్రమే శిక్షలు పడ్డాయి. ఎఫ్‌ఐఆర్‌లు ఆలస్యంగా దాఖలు చేయటం, ప్రాసిక్యూషన్ వైఫల్యం, సాక్షులు ఎదురుతిరగటం వంటివి కారణాలు.
ఎల్‌జెపి వంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో సీట్ల బేరసారాల అంశం ఇందులో ఉన్నప్పటికీ మొత్తంగా దళిత హక్కుల ఉద్యమ సమస్య మోడీ ప్రభుత్వానికి సవాలు విసురుతోంది.