Home లైఫ్ స్టైల్ కోడలికో ప్రేమ లేఖ

కోడలికో ప్రేమ లేఖ

Aunt and daughter in law

 

“నా కొడుకుతో నా అనుబంధం కాస్త మారిపోయి వుండొచ్చు. ఇవ్వాళ నేను నా కొడుకు జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ కాకపోవచ్చు. కానీ ఇవ్వాళ కూడా నేను వాడి తల్లినే కదా.. ఆ అమ్మాయి ఈ విషయం ఎందుకు గుర్తించదు. వాళ్లకో చిన్న బాబు ఉన్నాడు. వాడు నా మనుమడు. వాడి పుట్టుకతో మొత్తం మా ఇల్లు మారిపోయింది. మా అందరి ఆశలకు కేంద్ర బిందువు వాడు. ప్రాధాన్యతలతోపాటు అలవాట్లు మారాయి. మా ఇంటికి సిరివెనెల తరలి వచ్చింది. నా కోడలు ప్రసూతి వార్డులో ఉండగానే మా ఇల్లు ఆ కొత్త అతిథి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఎంతో సంతోషం, గర్వం.. నేనింతని చెప్పలేను. కానీ నా కోడలి ప్రేమను ఆ రోజునే నేను పోగొట్టుకున్నాను. తప్పు నాదే కావచ్చు. బిడ్డ ఆలనాపాలనా, పోషణ, పెంపకం, ఎదుగుదల విషయంలో మా ఇంటికి సంబంధించి ముగ్గురు ఆడవాళ్లం. నేను, నాకోడలు, వాళ్ల అమ్మ ముగ్గురం మూడు రకాలుగా ఆలోచించాం. అప్పుడు మొదలైంది మా మధ్య ఎక్కడో కనబడని చీలిక. నేను నెమ్మదిగా వెనక్కి వచ్చేశాను. ” అంటూ చెప్పింది శాంత.

రిటైర్‌మెంట్ తర్వాత పల్లెటూరికి తిరిగివచ్చింది రేణుక. ఇద్దరు పిల్లలతో ఒక్కక్షణం తీరికలేకుండా వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అంటూ ఒక పెద్ద కుటుంబంలో ఎన్నో బాధ్యతల్లో మునిగితేలుతూ ఉన్న శాంత, ఇప్పుడు అందరినీ వదిలేసి భర్తతో ఎందుకు పల్లెటూర్లో స్థిరపడిందో అర్థం కాలేదు రేణుకకు. పిల్లల దగ్గరకు వెళ్లడం మానేశాను అని చెబుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఇంత చదువుకొని టీచర్ జాబ్ చేసిన శాంత కోడలితో గొడవకు దిగిందా? అని ఆశ్చర్యం వేసింది ఆమెకు.

“మొదట్లో నేను గమనించలేదు రేణుకా. మా వినోదకు బెంగళూరులో జాబ్. వీకెండ్స్‌కు హైదరాబాద్ నుంచి అబ్బాయి వెళ్లేవాడు. సంవత్సరంలో ఒకటి రెండుసార్లు వచ్చినా ఆమె విజయవాడలో ఉండే పుట్టింటికి వెళ్లాలనుకునేది. నాకు అభ్యంతరం ఏముంటుంది. అక్కడ వాళ్ల అమ్మగారి అలవాట్లు భోజనం తీరు, ఇంట్లో పద్ధతులు వినోదకు చిన్నప్పటి నుంచి అనుభవం. నేనే ఆ అమ్మాయికి కొత్త. రెండు కుటుంబాల్లో రెండు తరాల మాన్యువల్స్ అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ నాకు, అక్కడ వాళ్ల అమ్మగారికి ఎన్నో తేడాలుండవచ్చు. కొత్తగా పసిబిడ్డ పుట్టుక. వినోద నాతో వచ్చి ఉండటం మొదలు పెట్టిన మొదటిరోజే పిల్లవాడి ఆలనాపాలనా విషయంలో తేడా కనిపెట్టింది. నాకు షేర్ చేయలేదు ఆ విషయం. నేను చాలా బిజీగా ఇటు వి నోదనీ పిల్లవాడినీ చూసుకుంటూ నా అలవాట్లు, నా అంతులేని ప్రేమను, పిల్లవాడి విషయంలో నా జాగ్రత్తలు మొదలు పెట్టేశాను. ఇక్కడ పొరపాటు జరిగింది.

Aunt and daughter in law

 

వినోద అప్పటివరకు అలవాటు పడిన ఒక పద్ధతికి నా అలవాట్లకీ ఎంతో తేడా ఉంది. బిడ్డను వాళ్ల అమ్మే జాగ్రత్త గా చూడగలరనీ, నేను అనుసరించే పద్ధతుల్లో బిడ్డకు మేలు చేసేవి లేవని అనుకుంది. వినోద మనసులో మెదిలే ఆలోచనలు నాకు తెలియలేదు. నేను పట్టించుకోలేదు. పసిబిడ్డ రాక నన్ను మరిపించింది. ఆమెనూ, బిడ్డనూ నా కంటే శ్రద్ధగా ఎవరూ చూడరన్న ఒక ఉద్రేకంలో ఉన్నా. వినోద నా ఉత్సాహానికి ఆనకట్ట వేయలేక మా అబ్బాయితో చెప్పుకుంది. వాడు కొత్తగా తండ్రి అయ్యాడు. బిడ్డ పట్ల, భార్య పట్ల ఎంతో అపురూపమైన భావనతో ఉన్నాడు. వినోద మనసుని కష్టపెట్టదలుచుకోలేదు నేను. అయితే నా ఉత్సాహాన్ని, తొందర పాటునీ ప్రశ్నించి బాధపెట్టలేదు. ఒక నెలరోజుల్లో సెలవు కాన్సిల్ చేసుకుని వినోద బెంగళూరు వెళ్లింది. వాళ్లమ్మ గారు బిడ్డ పెంపకానికి వచ్చారు.

అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. వినోదకి నేను అత్తగారి స్థానంలో ఉన్నాను. ఆమె నన్ను నమ్మలేదు. నేను తల్లిలాంటి దాన్ననే ఊహ కూడా వినోదకు నచ్చలేదు. నన్ను భరించలేననుకొంది. పోనీ నేను చెబితే వినే పద్ధతిలో ఉన్నానా? లేనేమో. వినోద మామూలు అమ్మాయిలాగా నాకు నచ్చ చెప్పబోయినా నేను ఖండించే దాన్నేమో! పైగా వినోద చదువుకొన్న ఇవాల్టి తరం అమ్మాయి. పిల్లవాడి సంరక్షణ విషయంలో పెంపకం, నిద్ర, ఆహారం ఇవన్నీ డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్లమ్మ ప్రేమ నిండిన చేతుల్లో జరగాలని కోరుకునేది. నేను దాన్ని విస్మరించాను. అసలామె పుట్టింట పిల్లవాడు పుట్టిన రెండు నెలల్లో ఏం ఫాలో అయిందో నేను అడగలేదు. నాదే ఉత్తమమైన అభిప్రాయం అనుకొన్నాను. వినోద వెళ్లిపోయాక ఖాళీ అయిన ఆ ఇంట్లో నిలబడి ఒక్క నిముషం ఆలోచిస్తే నేనెన్ని తప్పులు చే శానో అర్థం అయింది. ముందుగా పిల్లవాడిని మెత్తని పాత చీర లో కంఫర్ట్‌గా ఉంచాలనుకొన్నాను.

వినోద ఖరీదైన పరుపుపైన ఆమె గారాల బిడ్డ ఉండాలనుకొంది. నేను దాన్ని పక్కన పెట్టినట్లేగా. పిల్లల్ని ఎలా పెంచాలి. వాతావరణానికి తగ్గట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమె డాక్టర్ల ద్వారా, వాళ్ల ఇంట్లో పద్ధతులు వాళ్లమ్మ గారి ద్వారా విని ఉన్నది. వాటిని ఆమె పరిగణనలోకి తీసుకొనే ఉంటుంది. నేను విన్నానా? పట్టించుకున్నా నా? ఒక ఉద్రేకపు వరవడిలో పసివాడిని ఎత్తుకొని వాడిలో నా పోలికలు, నాభర్త, మిగతా పిల్లల పోలికలు చూసే అంటాను. మాట్లాడే ఉంటాను. ఇంకా ఏం మాట్లాడేనో ఇవ్వాళ గుర్తులేదు. అలాగే అంతకు ముందు నేను మొట్టమొదటగా అత్తగారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వినోదని కోడలిగా ఆహ్వానించినపుడు కూడా నేను వినోదకు పరిచయం ఉన్న మనిషిని కాదు. నా భావనా ప్రపంచంలో నా కొడుకు భాగస్వామిగా వచ్చిన వినోద ఈ ఇంటికి ఎంత ముఖ్యమో నేను వినోదతో మాట్లాడి చెప్పలేదు. నాకు నన్ను నేనుగా ఆమెకు పరిచయం చేసుకోవాలనుకొన్న సంగతి మరచిపోయాను” విచారంగా తల వంచుకొన్నది శాంత.

రేణుక నిర్ఘాంతపోయి చూస్తోంది. తను ఇప్పటికీ తన కోడలి విషయంలో ఇన్ని విషయాలు ఆలోచించిందా? త న మనసులో ఎన్ని కంప్లయింట్స్ ఉన్నాయి. అవన్నీ స్నేహితురాలి ముందర కుమ్మరించాలనే కోరికతో వచ్చి కూర్చుంది. కా నీ శాంత చెప్పేది ఇంకో విషయం. కొడుకు జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని, ఆమెతో అత్తగారు మెలగవలసిన పద్ధతి గురించి చెపుతోంది. అత్తగారు కోడలికి పరిచయం కావాలంటోంది. అంతేనా? కోడలి జీవితంలో అత్తగారి పాత్ర పరిమితమా? ఈ విషయమే అడిగింది రేణుక. ఆమెకు అంతులేని దుఃఖం వ చ్చింది. ఈ లెక్కన తానయితే కోడలిని చాలా విసిగించినట్లు. శాంత నవ్వింది. అత్తగారి పాత్ర పరిమితం కాదా”? అన్నది రేణుక వైపు చూసి.

“ఇప్పటి వరకు పెళ్లయిన అమ్మాయిలకు ఏం చెప్తారూ ఇంట్లో. మీ అత్తగారు ఏం చెప్పినా విను. ఆమె ఆలోచనలకు గౌరవం ఇవ్వు. ఆమె కూడా నీకు ఆత్మీయురాలే… అ న్న సందేశాలు ఇస్తారు పుట్టింటివాళ్లు. ఆమె మనసులో ఏం ఉంటుంది. భర్తకు చెందిన ఒక పరాయి మనిషిని మంచి చేసుకోవాలని ఉంటుంది. కానీ ఆ వెంటనే భర్తకు సంబంధించి, అతని జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆ తల్లి అనే అత్తగా రి నుంచి అతన్ని ఇవతలకు తెచ్చుకోవాలి అనుకుంటుంది. అవునా కాదా! అసలెంత గ్యాప్ ఉంది. దాన్ని మనమెంత పెంచుతున్నాం చెప్పు” అంది శాంత.

“అంటే వేరు కాపురం పెట్టటం, మనతో సంబంధా లు పరమ దండగ అనుకోవటం కరెక్టే నంటున్నావా” అంది రేణుక. శాంతి జాలిగా చూసింది. అసలు నవతరం మనసులో ఎలా ఉందో నువు అర్థం చేసుకున్నావా? అసలు మన కొడుకు మనసులో ఆలోచనలు మనకు తెలుసా? పెళ్లయ్యాక, భార్య జీ వితంలోకి వచ్చాక మరుక్షణం నుంచి ప్రయారిటీలు మార్చుకోవాలి. నీకు తల్లి ముఖ్యమా భార్య ముఖ్యమా? అని అడిగా మా? మనం.

వాళ్లిద్దరు కలసి ఒక యూనిట్. వాళ్లే ఒకరికొకరుగా కొనసాగాలి. తల్లి వైపు నుంచి ఉండే ఒక చనువుతో అమ్మకు నేను తరాత చెప్పుకుంటాననే ఆలోచనతో మన అబ్బాయి, కోడలి ప్రతీ మాటనూ అంగీకరిస్తాడు. మనం ఇటు కోడలిని కొడుకునూ అర్థం చేసుకోలేక పోతాం. ఇప్పుడు నేనేం చేశాను. వాళ్ల ఇల్లు వదిలేసి మీ జీవితం మీరు జీవించండి అని వచ్చేసాను”. “మరి అత్తగారు కోడలిని ఏం కోరుకోవాలి అది చెప్పు” అంది రేణుక.

చెప్పనా రూల్ నెంబర్‌వన్ అంది శాంత నవ్వుతూ “చెప్పు… నేను నేర్చుకోవాలి ఇప్పుడు”.
“సరే శ్రద్ధగా విను”
“అమ్మాయీ.. నేను నీ భర్తకు తల్లిని. ఈ అనుబంధాన్ని కాదనకు. నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయి.. నా ఆలోచనలు అలవాట్లు అర్థం చేసుకో.. నీకు నచ్చకపోతే నాకు చెప్పు. నేను పనికట్టుకొని నిన్ను హర్ట్ చేయాలనుకోను. నువ్వు నాకు గుర్తు చేయవచ్చు ఫలాన సమయంలో ఇలా అన్నావు, నాకు ఇందుకు నచ్చలేదని. దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా.
నిర్ణయానికి వెంటనే రావద్దు. రెండువైపులా రెండు కథనాలు ఉంటాయి. నా వైపు నుంచి నేనేమనుకొన్నానో విను.

నువు అనుకున్నది చెప్పు… అలాగే నీవు నా సలహా లు తీసుకోవాలని ఆశిస్తాను. నన్ను అడుగు. నేను సంతోషిస్తాను. ఫోన్లో అయినా సరే నాతో ముచ్చట్లు చెప్పు. వ్యక్తిగా నాకెన్నో ఆలోచనలు, నమ్మకాలు, ఉద్దేశాలు, కొత్త ఆలోచనలు ఉంటాయి. అవి నీ భర్తకు ముడిపడ్డవి కాదు. మనిద్దరం కలసి అవన్నీ చర్చించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. నీ తల్లిదండ్రులతో నన్ను పోల్చుకోవద్దు. నేను వాళ్లంత ప్రేమని నీ దగ్గర పొందలేదు. మనిద్దరం చాలా కొత్త. అపరిచితులం. అలాగే నీ బిడ్డ నాకెంతో దూరంగా ఉన్నాడు. వాడిని నాకు దగ్గరగా చేయగలిగేది నీవే. వాడితో నాకు కొన్ని ముద్దు మాటలు కావాలి. ఎదుగుతున్న దశలో వాడి ఫొటోలు కావాలి. నా మనవడి ముద్దు ముచ్చట్లు నీ ద్వారా వినాలి నేను.

నువు, నా కొడుకు నన్ను చూసేందుకు తరచుగా రండి. అర్థం చేసుకో. మీకు వండి, వడ్డించి మీ ఇద్దర్నీ సంతోషంగా చూడటం కంటే నాకు మించింది ఏవీ లేదు. నాకు సం తోషం కలిగించేలా వెళ్లే ముందు ఒక్క మాట చెప్పు. నిన్ను మిస్ అవుతున్నాను అని చాలు ఈ జన్మకు అదే శుభవార్త.

నీకు థాంక్స్. నా కొడుకు నిరంతరం ఎంత దూరంలో ఉన్నా మాతో ప్రతీరోజూ పలకరిస్తూ ఉన్నాడు అంటే నీ వల్లనే అమ్మా. నువ్వు మా జ్ఞాపకాలనూ నా కొడుకు మనసులో పచ్చగా ఉంచావు. నా కొడుక్కి సరైన జోడీ నువ్వు.. వాడికి అద్భుతమైన జీవితం నీ జంటగా ఉండటం వల్లనే సాధ్యమైంది. నువ్వు ఎంతో అర్థం చేసుకున్నావు నీ జీవితాన్ని. సుఖంగా ఉండు”.

“ఇంతే నేను చెప్పేది”. రేణుక కళ్లు నీటితో నిండిపోయాయి. “శాంతా నేనింత దూరం ఆలోచించలేదు. నేను నా కోడల్ని చాలా కష్టపెట్టాను” అంది ఏడుస్తూ. శాంత నవ్వింది. “అర్థం చేసుకోవటం రాలేదని చెప్పు. ఒక్కటి మాత్రం తెలుసుకో. వాళ్ల జీవితానందం నీ జీవితంలో ముఖ్యమైన అంశం. వాళ్లు ఒకళ్లనొకళ్లు అర్థం చేసుకొని, ఒకళ్లకొకళ్లు అనుకూలంగా, సంతోషంగా జీవిస్తే, వాళ్ల పిల్లల్ని అన్ని విధాలా తెలివిగా పెంచుకొంటే మనకు అదే కదా కావలిసింది. అత్తాకోడళ్ల బాంధవ్యం తల్లీకూతుళ్లను మించింది. ఆమె బిడ్డను కనిపెంచి ప్రేమ పంచి ప్రేమని పొందుతుంది. అత్తగారైన నేను ఆమె మనస్సు అర్థం చేసుకొని, విని ఆచరణలో పెట్టి ఆమె మనసులో స్థానం సంపాదించాలి. నేను సక్సెస్ అయితే నాకు ఎన్ని మార్కులు రేణుకా”. “శాంతా నువు పర్‌ఫెక్ట్ అత్తగారివి! నీకు బెస్ట్ మదరిల్లా అవార్డ్ ఇవ్వచ్చు..” అంది రేణుక.

                                                                                                                              – సి. సుజాత
Aunt wrote letter with love to her daughter in law