Saturday, April 20, 2024

బాక్సింగ్ డే టెస్టు: తొలిరోజు భారత్ దే పైచేయి..

- Advertisement -
- Advertisement -

బాక్సింగ్ డే టెస్టు.. భారత బౌలర్ల జోరు
చెలరేగిన బుమ్రా, అశ్విన్, సిరాజ్ మ్యాజిక్
ఆస్ట్రేలియా 195 ఆలౌట్, టీమిండియా 36/1

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సిండ్‌డే టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బుమ్రా, సిరాజ్, అశ్విన్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరచడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంబించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
ఆరంభంలోనే
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బర్న్(0)ను బుమ్రా వెనక్కి పంపాడు. అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బుమ్రా బంతిని అంచన వేయడంలో విఫలమైన బర్న్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ కూడా పెవిలియన్ చేరాడు. 3 ఫోర్లతో 30 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన వేడ్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 35 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

Mana Telangana news,Telangana Online News,Cricket news in telugu,latest Cricket news, latest sports news
స్మిత్ డకౌట్
ఈ దశలో జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కూడా నిరాశ పరిచాడు. అశ్విన్ అద్భుత బంతితో అతన్ని ఔట్ చేశాడు. 8 బంతులు ఆడిన స్మిత్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో లబూషేన్, ట్రావిడ్ హెడ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా వికెట్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడక తప్పలేదు. ఇదే క్రమంలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. వీరి జోరును చూస్తుంటే ఆస్ట్రేలియా కోలుకుంటున్నట్టే కనిపించింది. కానీ కీలక సమయంలో బుమ్రా అద్భుత బంతితో ఈ జంటను విడగొట్టాడు. 92 బంతుల్లో నాలుగు ఫోర్లతో 38 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపించిన ట్రావిడ్ హెడ్‌ను అతను వెనక్కి పంపాడు.
సిరాజ్ బోణీ
ఆ వెంటనే లబూషేన్ కూడా ఔటయ్యాడు. 132 బంతుల్లో నాలుగు ఫోర్లతో 48 పరుగులు చేసిన లబూషేన్‌ను హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. సిరాజ్‌కు టెస్టుల్లో ఇదే తొలి వికెట్ కావడం విశేషం. తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్‌ను కూడా సిరాజ్ వెనక్కి పంపాడు. సమన్వయంతో ఆడుతున్న గ్రీన్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ కోలుకోలేక పోయిది. భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 72.3 ఓవర్లలో 195 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
మయాంక్ డకౌట్
తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మిఛెల్ స్టార్క్ వేసిన అద్భుత బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. అరంగేట్రం టెస్టు ఆడుతున్న గిల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్ 38 బంతుల్లో ఐదు ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పుజారా ఏడు పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 159 పరుగులు చేయాలి.

Australia all out at 195 in Boxing day test against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News