Thursday, April 25, 2024

భారత మహిళల ఓటమి

- Advertisement -
- Advertisement -

Australia win first ODI against India

బ్రౌన్ మ్యాజిక్, రాణించిన హేన్స్, హీలీ, తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపు

మెక్‌కు: భారత మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 41 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు రాచెల్ హేన్స్, అలీసా హీలీ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఆరంభం నుంచే ఇటు హేన్స్ అటు హీలీ దూకుడుగా ఆడారు. ఈ జోడీని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు పోటీ పడి ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. హేన్స్ కాస్త సమన్వయంతో ఆడగా హీలీ మాత్రం దూకుడును ప్రదర్శించింది. ఇద్దరు కుదురు కోవడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.

కీలక ఇన్నింగ్స్ ఆడిన హీలీ 77 బంతుల్లో 8 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసి ఔటైంది. ఈ క్రమంలో హేన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించింది. తర్వాత వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. హేన్స్ కూడా దూకుడును పెంచింది. ఇద్దరు అద్భుతంగా ఆడడంతో ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ హేన్స్ 100 బంతుల్లో ఏడు బౌండరీలతో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లానింగ్ ఏడు ఫోర్లతో అజేయంగా 53 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఇద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు జోడించారు. ఇదిలావుండగా వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 25వ విజయం కావడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు వరుసగా ఇన్ని విజయాలు సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను కెప్టెన్ మిథాలీ రాజ్ ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ 107 బంతుల్లో మూడు ఫోర్లతో 63 పరుగులు చేసింది. యస్తికా భాటియా (35), రిచా ఘోష్ (32), గోస్వామి (20) తమవంతు పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News