Wednesday, April 24, 2024

ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్..

- Advertisement -
- Advertisement -

కదం తొక్కిన మాక్స్‌వెల్, అలెక్స్ కారి
ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్

మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 302 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బైర్‌స్టో (112) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు బిల్లింగ్స్ (57), క్రిస్ వోక్స్ 53 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో ఆతిథ్య ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మాక్స్‌వెల్, వికెట్ కీపర్ అలెక్స్ కారిలో అసాధారణ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టారు. 303 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇంగ్లండ్ బౌలర్లు రూట్, వోక్స్ వెంటవెంటనే వికెట్లు పడగొట్టడంతో ఒక దశలో ఆస్ట్రేలియా 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో మాక్స్‌వెల్, అలెక్స్ కారి అసాధారణ పోరాట పటిమతో జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును ముందుకు నడిపించారు.

ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు మాక్స్‌వెల్, అటు కారి అద్భుతంగా ఆడడంతో ఆస్ట్రేలియా మళ్లీ పుంజుకుంది. కారి సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, మాక్స్‌వెల్ తన మార్క్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన మాక్స్‌వెల్ 90 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో నాలుగు బౌండరీలతో 108 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 212 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కారి 114 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇద్దరు అసాధారణ రీతిలో చెలరేగడంతో ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సిరీస్ కూడా ఆస్ట్రేలియా వశమైంది. అంతేగాక టి20 సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకుంది.

Australia win ODI Series with 2-1 against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News