* ప్రజలకు ఉచితంగా న్యాయసేవలు అందించడం అభినందనీయం
* న్యూ మోడల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా జడ్డి తిరుమలరావు
మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను చేపడు తున్నా యని, అధికారులు ప్రభుత్వాలు ప్రవేశపెడు తున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం స్థానిక టౌన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన న్యూ మోడల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత న్యాయం అందజేయడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న కృషి పథకాలపై అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలు అమల్లో జాప్యం జరుగుతుందని వాటిని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నల్లగొండ జిల్లాలో న్యాయ సేవ సాధికార సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మొదటిసారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ఆయన సూచించారు. సంక్షేమ కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డి. తిరుమలరావు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఉచిత సత్వర న్యాయం అందజేయడానికి న్యూ మోడల్ లీగల్ సర్వీసెస్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు బహుళ స్థాయిలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అసంఘటిత రంగంలో భవన కార్మికులు, పేంటింగ్ వేసేవారు, ఫ్లంబర్స్, మార్భుల్స్, సెంట్రీ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, ఇటుక బట్టీలలో పని చేసేవారు, కంపెనీలలో, షాపులలో పనిచేసే వారు, తదితరులు వస్తారని ఆయా రంగాల్లో పనిచేసేవారికి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు వివిధ పథకాల అమల్లో ఎదురయ్యే సమస్యలకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డేని నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ, మోప్మా, ఐసీడీఎస్, మెడికల్ అండ్ హెల్త్, డ్వామా, తూనికలు కొలతలు, న్యాయశాఖలు, ప్రత్యేక స్టాల్స్‌లను ఏర్పాటుచేసి ప్రజలకు తమ శాఖల ద్వారా అమలు చేసే పథకాలను తెలియజేయడంతో పాటు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు తగిన సలహాలు, సూచనలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాసాధికార సంస్థ సెక్రటరీ ప్రభాకర్‌రావు, డీఆర్‌డీఓ ఆర్.అంజయ్య, డిప్యూటీ లేబర్ కమీషనర్ రాజేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కే. ఉమామహేశ్వరావు, ప్రభుత్వ ప్లీడర్ జి. వెంకటేశ్వర్లు, వివిధశాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.