Home తాజా వార్తలు ప్రజల భాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి…

ప్రజల భాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి…

CC Cameras

 

వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్

వరంగల్: నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజల భాగస్వామ్యంతో గల్లీగల్లీ సిసి కెమెరాల ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులతో నెల నేర సమీక్ష సమావేశాన్ని శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో పోలీస్‌స్టేషన్ల వారిగా పోలీస్ అధికారులతో పాటు డిసిపి, ఎసిపి, ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు. అధికారుల పనితీరుతో పాటు కేసుల నమోదు వాటి పరిష్కరణ, నిందితులు అరెస్ట్‌లు, కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై ప్రస్తావించారు. పోలీస్‌స్టేషన్లకు ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన వాటిపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. ముఖ్యంగా అదృశ్యమైన మైనర్ బాలికలకు సంబంధించిన వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి, గుట్కా, మట్కా, వ్యభిచారం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల్లోని వాహనాలను దర్యాప్తులో భాగంగా రోజుల తరబడి పోలీస్‌స్టేషన్లలో ఉండకుండా త్వరితగతిన న్యాయస్థానం అనుమతులు పొంది సదరు వాహన యజమానులకు అందజేయాలన్నారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో నూతనంగా చేపట్టిన రోడ్ల నిర్మాణంలో భాగంగా రోడ్లపై లైన్‌మార్క్‌లు, సూచన బోర్డులు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేందుకు సదరు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల కన్నా 20 శాతం రోడ్డు ప్రమాదాల తగ్గించే దిశ అధికారులు తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్ డిసిపిలు నరసింహ, నాగరాజుతో పాటు ఎసిపిలు, ఇన్స్‌పెక్టర్లు, ఆర్‌ఐలు సబ్ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

Authorities should Work to Arrange CC Cameras