Home ఆఫ్ బీట్ ఉద్యోగం పోయినా… భద్రత ఉండాలంటే..!

ఉద్యోగం పోయినా… భద్రత ఉండాలంటే..!

Automation is competing for human activities

పాత టెక్నాలజీల్ని కొత్తవి ఆక్రమిస్తున్నాయి. మనుషులు చేసే పనులకు ఆటోమేషన్ పోటీ పడుతోంది. ప్రైవేటు ఉద్యోగుల ముందు ఈ తరహా సవాళ్లెన్నో ఉన్నాయి. ఉన్నట్టుండి ఓ కంపెనీ ‘రాజీనామా చేయండి’ అని అడిగితే… వెంటనే మరో కంపెనీ వెల్‌కమ్ చెప్పే పరిస్థితులను అన్ని వేళలా ఊహించలేం. టెలికం, ఈ-కామర్స్, ఐటీలో ఉద్యోగాలు కోల్పోవడం సాధారణంగా మారింది. ఇక మెరుగైన అవకాశాల కోసం, తమ నైపుణ్యాలను మెరుగుపెట్టుకునేందుకు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేవారూ ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినా లేదా వదిలిపెట్టినా ఆర్థికంగా సమస్యలు ఎదురు కాకుండా…అందుకు ముందు నుంచే సన్నద్ధం కావాలి. కొత్త జాబ్ దొరికేవరకూ అవసరాలు ఆగకూడదు. వీటి కోసం అత్యవసర నిధి ఏర్పాటు బీమా రక్షణ, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని రంగాల ఉద్యోగులకూ ఇవి తప్పనిసరి. ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నది నిపుణుల సలహా.

ముందు నుంచే పొదుపు..
ఉద్యోగం పోతే రోజువారీ అవసరాలు ఆగకూడదు. రుణాలు తీసుకుని ఉంటే వాటికి చేసే చెల్లింపులూ ఆగకూడదు. వివాహమై, పిల్లలున్నవారికి కుటుంబ ఖర్చులు ఎక్కువే ఉంటాయి. అందుకే కనీసం ఓ ఆరు నెలల కుటుంబ, ఇతర అవసరాలకు సరిపడా నిధుల్ని ఉద్యోగంలో ఉన్నపుడే పక్కన పెట్టుకోవాలి. ఇంటి ఖర్చులనూ, బీమా పాలసీలను పరిగణనలోకి తీసుకోవాలి. కొంచెం కూడా రిస్క్ ఇష్టం లేని వారు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ చేసే సిప్ పెట్టుబడులు లేదా రికరింగ్ డిపాజిట్లను కూడా కలుపుకుంటే మంచిది. ఎంత మొత్తం కావాలో స్పష్టత వచ్చాక ఆ మేరకు నిధిని సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఈ నిధి సమకూరేంత వరకు ప్రతి నెలా ఇతర అవసరాలను త్యాగం చేయడానికి వెనకాడకూడదు.

అత్యవసర నిధి సమకూరాక వీలును బట్టి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అవసరమైన సమయంలో వెంటనే తీసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఈ రెండింట్లో లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి ఎక్కువ. బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలపై 4 శాతమే వడ్డీ కాగా, దీంతో పోల్చుకుంటే లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి రెండు శాతం ఎక్కువే ఉంటుంది. ఇలా అత్యవసర నిధి సమకూరాక ఉద్యోగం కోల్పోయినా, లేదా మీ అంతట మీరు మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాన్ని వదిలినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. నెలవారీ అవసరాలకు ఇబ్బంది ఏర్పడదు. అన్ని చెల్లింపులూ యథావిధిగా అత్యవసర నిధి నుంచి చేసేయవచ్చు. బీమా రక్షణ తప్పనిసరి…: ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో మీకంటూ ఆరోగ్య బీమా రక్షణ తప్పకుండా కొనసాగడం అవసరం.

బీమా పాలసీలో మీతోపాటు జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ తప్పకుండా ఉండాలి. ఇలా కాకుండా సీనియర్ సిటిజన్ ఇన్సూరెన్స్ పేరుతో పెద్దలకు ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆ పాలసీని తీసుకోవడం మంచి ఆలోచనే. సాధారణంగా కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకూ కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థ నుంచి తప్పుకుంటే, బీమా రక్షణ కొనసాగుతుందా? అన్నది స్పష్టం చేసుకోవాలి. కవరేజీ కొనసాగదంటే విడిగా పాలసీ తీసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ముఖ్యంగా ఖర్చులకు కళ్లెం వేయాలి.. ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ ఖర్చులను నియంత్రించుకోవడం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. మరీ ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయే ముప్పు ఉన్నవారికి ఇది మరీ అవసరం.

క్రెడిట్ కార్డు ఉండి దానిపై రుణం తీసుకుని ఉంటే, వీలైనంత వేగంగా చెల్లింపులు చేసేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఇక ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఏవి త్యాగం చేసినా దీర్ఘకాలిక అవసరాలకు ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. తాత్కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకోవడం అవసరం. రెండు మూడు నెలలే కదా, ఆపితే ఏం కాదులేనన్న ధోరణి వల్ల నష్టమే. ఉద్యోగం లేని పరిస్థితులను అధిగమించేందుకు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Automation is competing for human activities

Telangana Latest News