* విచ్చల విడిగా వెలసిన కట్టడాలు
* 10 ఎకరాల భూములు కబ్జా
* ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు
* నిర్విరామంగా కొనసాగుతున్న కబ్జాల పర్వం
* చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతల అండదండలతో రియల్ వ్యాపారులు కబ్జా చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. లక్షలాది రూపాయల మామూళ్లు పొందుతున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తుండగా ఇప్పటికే ఇద్దరు తహసీల్దార్లపై బదిలీ వేటు పడింది. అయినప్పటికీ ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతుండగా నస్పూర్ శివారులో ఆటో నగర్ కోసం కేటాయించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా కట్టడాలు చేపట్టారు. దాదాపు ఎకరానికి 3 కోట్ల రూపాయలు ధరలు పలుకుతుండగా కబ్జా పర్వం నిర్విరామంగా కొనసాగుతుంది. నస్పూర్ శివారులోని సర్వే నెం. 64లో దాదాపు 10 ఎకరాల భూమిని అప్పటి ఎంఎల్‌ఏ దివంగత గోనె హన్మంతరావు ప్రజల సమక్షంలో ఆటో నగర్‌కు కేటాయించినట్లు అధికారులకు తెలిపారు. అప్పట్లో మంచిర్యాలకు మెకానిక్‌లు ఎవరు రాకపోవడం వలన వారిని ప్రొత్సహించే విధంగా ఆటో నగర్‌కు స్థలం కేటాయించారు. అయితే ఆటో నగర్ భూములు ఎక్కడికక్కడే అన్యాక్రాంతం కాగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కట్టడాలు వెలిశాయి. అదే విధంగా నస్పూర్ పంచాయతీ పరిధిలోని 63వ నెంబర్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తు చేతుల్లోకి వెళ్లాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కనిపించని విధంగా మారాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం కావడంతో ఒక సారిగా భూముల ధరలు పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వ భవనాలను నిర్మించేందుకు ఒక్క చోటా 10 ఎకరాల భూములు లభించడం లేదు.
జిల్లా కేంద్రం కావడం వలన ప్రభుత్వ భూముల అవసరం ఎంతో ఉన్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. సర్వే నెం. 64లో చెరువు శిఖం భూములను కూడా ఆక్రమించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం 20 ఎకరాలు, వ్యవసాయం 122 ఎకరాల భూములను అసైన్డ్ చేశారు. అయితే ఈ అసైన్డ్ చేసిన భూములు కూడా నేడు చేతులు మారాయి. అదే విధంగా చెరువు శిఖం భూముల్లో పక్కనే ఉన్న పట్టా భూముల పేరిట కబ్జాలు చేశారు. కొందరు నాయకులు అధికారుల అండదండలతో పట్టా భూములను కొనుగోలు చేసి, వాటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారుల సహాయంతో కబ్జా చేసి, వారి పేరిట రికార్డుకు ఎక్కించుకొని కోట్లాది రూపాయలకు విక్రయాలు జరుపుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన నిర్వాసితునికి నస్పూర్ ఏరియాలోని 64 సర్వే నెంబర్‌లో 2 ఎకరాలు, 42 సర్వే నెంబర్‌లో 3 ఎకరాల భూమిని కేటాయించి అధికారులు అవినీతిని చాటుకున్నారు. ఎక్కడో ముంపుకు గురైన నిర్వాసితునికి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కట్టబెట్టడం ఏమిటని కొందరు టిఆర్‌ఎస్ నేతలు స్వయంగా సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల అక్రమాలు పరాకాష్టకు చేరుకోగా అతని పేరిట చేసిన పట్టాను అధికారులు రద్దు చేశారు. నస్పూర్‌లో ఒక నాయకునికి 10 సంవత్సరాల క్రితం 2 ఎకరాల భూమిని ఇనాం పేరిట కట్టబెట్టగా దానికి మరో మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, దానిని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించినట్లు సమాచారం. మరో నేత మూడు ఎకరాల భూమిని ఇనాంగా పొందడం విశేషం, ప్రభుత్వ భూములను పొందేందుకు ఎలాంటి అర్హతలు లేకపోయినప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో పడి నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడే దారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూముల వ్యవహారంలో కబ్జా వ్యవహారాలపై ఉన్నతాధికారులకు విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల విలువ చేసే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.