Home ఆఫ్ బీట్ కాబోయే పేద తల్లులకు రెక్కలసాయం

కాబోయే పేద తల్లులకు రెక్కలసాయం

( మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)

Nurses

గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయంలో వైద్య సహాయం అందక ఎంతోమంది గ్రామీణులు చనిపోతూ వుంటారు. ఇలాంటి మరణాలు మనల్ని ఆలోచనలో పడేస్తూ వుంటాయి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ని ఇలాగే ఒక గర్భిణి మరణం ఆలోచనలో పడవేసింది. వికారాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో ఓ నిండు గర్భిణికి సమయానికి వైద్య సేవ అందకపోవడంతో మరణించింది. ఆమె మరణం కలెక్టర్ గారిని కదిలించింది. సరైన సమయానికి ఏఎన్‌ఎం (ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫరీ) సేవలు ఆమెకు అందినట్టయితే ఆ మరణం సంభవించేది కాదు. అయితే ఏఎన్‌ఎం కార్యకర్తలు పలు గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలు అందించడానికి వాహన సదుపాయం లేని పరిస్థితి.

రహదారులు వున్న గ్రామాలతోపాటు, రహదారులు లేని గ్రామాలకు వెళ్ళాలన్నా ఏఎన్‌ఎం కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి ఆరోగ్య సబ్ సెంటర్, ఏఎన్‌ఎం కార్యకర్తలు ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాలి. ప్రతిరోజూ పదిహేను కిలోమీటర్లకు పైగా పర్యటించాలి. దీని కోసం వీరు బస్సులు లేదా షేర్ ఆటోల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఏఎన్‌ఎం కార్యకర్తలకు సరైన వాహన సదుపాయం లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సదుపాయాలు అందడం లేదని గతంలో వికారాబాద్ జిల్లా పాలనాధికారిగా పని చేసిన దివ్యా దేవరాజన్ గ్రహించారు.(ఇపుడామె ఆదిలాబాద్ కలెక్టర్) ఇతర అధికారులతో చర్చించి ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కొన్నారు.

సకాలంలో వైద్య సేవలు

ఆ ఆలోచనే “ప్రాజెక్టు రెక్కలు”. ఏఎన్‌ఎంలకు వాహనాలు అందించడం, వైద్య సేవలను గ్రామీణులకు చేరువ చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా మొదట మోటర్ సైకిల్ నడపటం వచ్చిన పదిమందికి వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద ఏఎన్‌ఎంలు సులభంగా గ్రామాలకు చేరుకుంటూ వుండటంతో గ్రామీణులకు వైద్య సేవలు అందించడం సులభమైంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు రావడంతో కలెక్టర్ గారు మరో ముందడుగు వేశారు. వికారాబాద్ జిల్లా తొలి వార్షికోత్సవంలో డ్రైవింగ్ లైసెన్స్ వున్న 101 మంది ఏఎన్‌ఎంలకు మోటర్ బైక్‌లు అందించారు. వీటిలో వాక్సినేషన్ కిట్టూ, ఇతర సామాగ్రి పెట్టుకునే సదుపాయం కూడా కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ కొనసాగిస్తున్నారు.

తక్కువ ధరకు వాహనాలు

ఏఎన్‌ఎంలకు మోటర్ సైకిళ్ళు చాలా తక్కువ ధరకే లభించే అవకాశం కలిగింది. కలెక్టర్ నిధుల నుంచి ఒక్కో వాహనానికి పదివేల రూపాయలు అందించారు. ప్రజారోగ్య శాఖ కూడా మరో పదివేల రూపాయలను అందించడానికి ముందుకు వచ్చింది. వాహనాలు సరఫరా చేస్తున్న సంస్థ వాహనం ధరలో ఐదు వేల రూపాయలు తగ్గించడానికి అంగీకరించింది. దాంతో ప్రతి ఏఎన్‌ఎంకి వాహనం ధరలో పాతిక వేల రూపాయల వరకూ తగ్గింది. మిగతా మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుణంగా అందించడంతో ఏఎన్‌ఎంలకు వాహనాలు అందడం చాలా సులభమైంది. వికారాబాద్ జిల్లాలో విజయం సాధించిన ఈ పథకాన్ని తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మెదక్, యాదాద్రి, భువనగిరి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు ఈ పథకాన్ని పరిశీలించి, వారి జిల్లాల్లోనూ అమలు చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు.

ఆర్థిక భారం తగ్గింది…

“ మారు మూల పల్లెలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం ఉండదు. కాలినడకన వెళ్లాల్సి వచ్చేది,ఇలాంటి పరిస్ధితుల్లో గర్భిణీ స్త్రీలకు సకాలంలో వైద్య సేవలు అందించ లేక పోయేవాళ్లం. ఇపుడు కలెక్టర్ గారు మాకు వాహన సౌకర్యం కల్పించడం వల్ల ఎక్కువ గ్రామాలు కవర్ చేయగలుగుతున్నాం. తక్కువ ధరకే బైకులు ఇవ్వడం వల్ల మాకు ఆర్ధికంగా భారం అనిపించ లేదు.” షబానా.
(శివారెడ్డి పేట)

సమస్యలు లేకుండా విధుల్లో…

“ గతంలో గ్రామాలకు చేరుకోవాలంటే ఆటోల మీద,బస్సుల మీద ఆధారపడేవారం. చాలా సమయం వృథా అయ్యేది. మాకు ప్రభుత్వం బైకులు ఇవ్వడం వల్ల సకాలంలో మారు మూల గ్రామాలకు చేరుకొని సేవలు అందిస్తున్నాం. రోజుకు రెండు మూడు గ్రామాలు తిరిగే అవకాశం కలిగింది. అందరం ఎలాంటి సమస్యలు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నాం.’ రాజకూమారి,
గన్నారం