Home తాజా వార్తలు పేరుకే స్వచ్ఛ భారత్!

పేరుకే స్వచ్ఛ భారత్!

Toilets Scheme in Suryapet

 

ప్రభుత్వ పథకాలకు అధికారుల గండం
పేదలకు అందని పథకం
మరుగుదొడ్లు నిర్మించుకోలేక ఇబ్బంది పడుతున్న పేదలు
అవగాహన కల్పించని ఫీల్డ్ సిబ్బంది
కలెక్టర్ ఆదేశాలను పాటించని మండల స్థాయి అధికారులు

మన తెలంగాణ/సూర్యాపేట : అధికారుల నిర్లక్షం కారణంగా ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. కింది స్థాయి ఉద్యోగుల ఉదాసీన వైఖరి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేని పేదలు… ఇబ్బందులకు గురవుతున్నారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఇంటిలో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్న ప్రచారం అటకెక్కింది. ఫీల్డ్ సిబ్బంది నిర్లక్షంగా వవహరించడంతో పేదలు పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇటీవల ప్రభుత్వం ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండాలని చేసిన ప్రయత్నాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ పారిశుద్ధం, విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇటీవల మరుగుదొడ్ల పథకంపై అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. అయినా స్థానిక సిబ్బందిలో పేరుకుపోయిన నిర్లక్ష జాడ్యం వదలడం లేదు.

పేదలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకునేలా ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు కోరుతున్నారు. సర్పంచులు కొత్తగా ఎన్నిక కావడంతో వారి సహకారంతో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉంటేను రేషన్ కార్డు, సంక్షేమ పథకాలు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ ప్రజల సమస్యలు తీర్చని సర్పంచులపై నిబంధనల ప్రకారం ర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలలో 60 శాతం వరకే మరుగుదొడ్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1712 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలాల వారిగా 71 మండలాలు, పట్టణాలలోని శివారు కాలనీల్లో పేదలు నివసించే ఇళ్లల్లో మరుగుదొడ్డి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పేద కుటుంబం ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే సంకల్పంతో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 12 వేల రూపాయలు అందిస్తున్న విషయం తెలసిందే.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇంటింటి మరుగుదొడ్లు నిర్మించి ఏ ఒక్క మహిళ కూడా ఆరుబయట ప్ర దేశాలలో మల, మూత్ర విసర్జన చేయకుండా ఉండాలనే సంకల్పంతో సిఎం కెసిఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వం నుండి రూ. 12 వేల రూపాయలు అందిస్తోంది. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్గించారు. దీనిలో భాగంగానే కొన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా స్థానిక సర్పంచులు చొరవ తీసుకొని వారే స్వయంగా ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సూర్యాపేట, స్వచ్ఛ తెలంగాణ సాకారం కావాలంటే గ్రామాలలో ప్రతి ఇంటి మరుగుదొడ్లు నిర్మించుకోవాలి.

గ్రామాలలో మహిళల ఇబ్బందులు… గ్రామాలలో ఎంతో మంది పేద ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకోలేదు. గ్రామాలలో మహిళలు మల, మూత్ర విసర్జన చేయడానికి సుమారు అర కిలోమీటర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని గ్రామాలలో ఖాళీ స్థలాలు లేక కొంత మంది మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్న ట్లు తెలుస్తోంది. వర్షం వస్తే వాళ్ల బాధలు అంతా…. ఇంతా…కాదు. ప్రతి ఒక్క పేద కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టి వారు మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. వర్షాలు వస్తే మరుగుదొడ్డి లేని పేద ప్రజలు బయటకు వస్తుంటే వారిని చూసి చలించిపోక తప్పదు. రాత్రి సమయాలలో వారు బయటకు వెళ్లాలంటే పాములు, తేళ్లు, ఏముంటాయోనని భయాందోళనకు గురవుతున్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాకం… గ్రామాలలో మరుగుదొడ్లు మంజూరు చేయించాలి. కానీ వారు మరుగుదొడ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవడానికి వస్తే డబ్బులు ఇస్తేనే మంజూరు చేయిస్తామని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రజలకు చెప్తున్నట్లు సమాచారం. వారు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలోని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉందా… లేదా అని చూసి లేని వారి వివరాలు సేకరించి వారికి మరుగుదొడ్లు మంజూరు చేయించి నిర్మించే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. కానీ గ్రామాలలో అలా కన్పించడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకుంటున్న వారు పునాది దశ పూర్తి కాగానే రూ. 4 వేలు బిల్లు వస్తుంది. కానీ దానికి ఫీల్డ్ అసిస్టెంట్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుండి మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి డోర్ (తలుపు) అందిస్తున్నారు. కానీ అవి కూడా పక్కదారి పడుతున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించే విధంగా చర్యలు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సర్వే చేయించి మరుగుదొడ్లు నిర్మించాలి : చిట్టెక్కి వెంకన్న

ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్, సర్పంచు గ్రామంలో సందర్శించి మరుగుదొడ్డి నిర్మించుకోని వారిని గుర్తిం చి వారికి మరుగుదొడ్లు మంజూరు చేయించి వారు నిర్మించుకునే విధంగా కృషి చేయాలని తెలిపాడు. వారికి అవగాహన కల్పించి నిర్మించుకునేంత వరకు వారు బాధ్యత తీసుకొని ప్రభుత్వం నుండి వస్తున్న 12 వేల రూపాయలను అందేలా చూడాలి.

మరుగుదొడ్డి నిర్మాణానికి కృషి : సర్పంచ్ శ్యామలేటి కోటేష్

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా కృషి చేస్తానని రావిపహాడ్ సర్పంచ్ శ్యామలేటి కోటేష్ చెప్పా డు. మరుగుదొడ్డి నిర్మించుకోని వారి వివరాలు తెలుసుకొని వారికి మరుగుదొడ్డిపై అవగాహన కల్పించి నిర్మించుకునేలా చూస్తా.గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి జిల్లాలోనే గ్రామాన్ని అగ్రగామిగా నిలిపి నన్ను ఆదర్శంగా తీసుకునేలా గ్రామాన్ని తయారు చేస్తా.

Awareness Conference on Toilets Scheme in Suryapet