Home రంగారెడ్డి డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన

డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య

VKB

మనతెలంగాణ/వికారాబాద్ జిల్లా : నగదు రహిత చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు తమ ఖాతాను మొబైల్ నెంబరుకు అనుసంధానం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య సూచించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో నగదు రహిత, డిజిటల్ బ్యాంకు విధానంపై బ్యాంకర్లు, ఎంపిడిఒలు, వివిధ వ్యాపార యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, మారిన పరిణామాల రీత్యా వ్యక్తిగద అవసరాలను తీర్చుకునేందుకుగాను నగదు రహిత చెల్లింపులు ఎలా చేయాలో ప్రజలు తెలుసుకునేందుకు బ్యాంకర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెల్లింపుల విషయంలో మామూలుగా టెలిఫోన్ వాడే ప్రతి ఒక్కరు సులభంగా లావాదేవీలు చేపట్టాలని చెప్పారు. ప్రజలలో నగదు రహిత చెల్లింపులపై ఉన్న అపోహలను తీర్చాలని సూచించారు. బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలున్ననప్పటికీ అవి వాడుకలో లేదని, వీటిని వినియోగించుకోవడంతోపాటు లబ్దిదారులకు రూపే కార్డులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లావాదేవాలను పాయింట్ ఆఫ్ సేల్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యుఎస్‌ఎప్‌డి, యుపిఐ అదేవిధంగా ఇ-వాలెట్‌లు లాంటి ఐదు రకాల సేవల ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధమైన సేవలను వినియోగించుకునేందుకు కావాల్సిన ఆప్ ను డౌన్‌లోడ్ చేసుకునే విధానంపై బ్యాంకర్లు ఖాతాదారులకు సూచించాలని తెలిపారు. ఎటిఎం, డెబిట్ కార్డు స్వైప్ చేసి నగదు చెల్లించవచ్చనే విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆమె పేర్కోన్నారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటే 20 సెకన్లలో డబ్బులు పంపించవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా నీటి పన్ను, విద్యుత్ తదితర బిల్లులను కూడా ఇంటి నుంచే చెల్లించవచ్చని వివరించారు. యుఎస్‌ఎప్‌డి )*99% విధానం గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, దీనికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదన్నారు. యుపిఐ ద్వారా ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు డబ్బును పంపవచ్చని తెలిపారు. ఇ-వాటెల్ విధానం కూడా చాలా సులభతరంగా ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఒ పిడబ్లు జాన్సన్, లీడ్ బ్యాంకు మేనేజర్ శర్మ, స్టేట్ బ్యాంకు ఎజిఎం సూర్యప్రకాష్, బ్యాంకర్లు, ఎంపిడిఒలు, వ్యాపార సంస్థ యజమానులు తదితరులు పాల్గొన్నారు.