Home లైఫ్ స్టైల్ పునరుత్పత్తిపై అవగాహన తప్పనిసరి..

పునరుత్పత్తిపై అవగాహన తప్పనిసరి..

Awareness on reproduction is mandatory

గర్భనిరోధకాలు, మాతా శిశు ఆరోగ్యం, ప్రసవానంతర సంరక్షణ, ప్రసూతి సమస్యలు ..ఇలాంటి వాటిపై మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంత మహిళలకు అవగాహన కల్పించి, కృషి చేసినందుకుగాను వైద్య దంపతులు రాణి బాంగ్, అభయ్ బాంగ్‌లకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. వెనుకబడిన ప్రాంతాలలో, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలలో వీరిద్దరూ కమ్యూనిటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ (SEARCH) సహ వ్యవస్థాపకులుగా, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతాలలో మహిళలు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారో ఓ ఇంటర్వూలో వివరించారు.

గడ్చిరోలిలో మొదటి గైనకాలజిస్టు రాణిబాంగ్. అమెరికాలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో కంప్యూటరైజ్డ్ కోర్సు చేశారు. స్త్రీ జననేంద్రియ వ్యాధి గ్రస్తులను చూడటానికి ఒక్క అధ్యయన సంఘం కూడా లేకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లు ఆమె చెబుతున్నారు. అక్కడ ఉన్నవన్నీ హాస్పిటల్‌లో చూపించుకునే కేసులే. ఇటువంటి సమాజంలో మహిళల ఆరోగ్యానికి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. దీనిపై మొదట పరిశోధన చేయాలనుకున్నారు ఈ దంపతులు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోని వివిధ గ్రామాల మహిళలతో మాట్లాడారు. వాళ్ల కున్న ఆరోగ్యపరమైన సమస్యలను వరుసగా చెప్పమన్నారు. వారిలో ఎక్కువ శాతం సంతానం లేమి సమస్య కనిపించింది. ఆ సమస్యతో చాలామంది మహిళలు చనిపోతున్నారు. ఎందుకని మీరు దీనిని ప్రమాదకరంగా తీసుకోవటం లేదు అని అడగ్గా.. పురిటి నొప్పులకు ఆ స్త్రీ ఒక్కసారే చనిపోతే ఫరవాలేదు కానీ ఆ స్త్రీకి పిల్లలు పుట్టలేదు అని తెలిస్తే ప్రతిరోజూ బాధపడుతూ చావాల్సిందే అంటూ అక్కడి మహిళలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సమస్య ఎంత లోతుగా ఉందో గ్రహించానంటారామె.
ఆ ప్రాంతంలో 92 శాతం మంది మహిళలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ఎక్కువగా రుతుసంబంధ సమస్యలు, పునరుత్పత్తి అంటువ్యాధులు లాంటివి ఉన్నాయి. గర్భస్రావాలు కూడా ఎక్కువే. గర్భనిరోధక ఉత్పత్తులు లేకపోవడం, లైంగికవిద్య గురించి అవగాహన లేకపోవడం వంటివి సమస్యలు. ఈ అధ్యయన ఫలితాలను ప్రపంచ స్థాయి వేదికల్లో చర్చించానంటారామె. స్త్రీ సంక్షేమం అంటే కేవలం తల్లి, శిశు ఆరోగ్యం మాత్రమే కాదు. ప్రసవానంతర సంరక్షణ,ప్రసూతి రక్షణ కూడా స్త్రీలకు అవసరం. అందువల్లే పిల్లల, స్త్రీల సంరక్షణకే కృషి చేయడమే తమ లక్షమంటున్నారు ఈ వైద్య దంపతులు.
1989లో ఈ సమస్యను అనేక మ్యాగజైన్లలో ప్రచురించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యలపై స్పందించి అనేక మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. 1992 లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి వివిధ దేశాల ప్రభుత్వ ఆరోగ్య శాఖా మంత్రులు హాజరయ్యారు. రాణిబాంగ్ ఒక్కరే ప్రభుత్వేతర కార్యకర్తగా వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులందరూ ఆమె అధ్యయనాన్ని ప్రశంసించారు.
మహిళల పునరుత్పత్తి కి సంబంధించిన సమస్యలు పూర్తిగా నిర్లక్షంగా ఉన్నాయి. జాతీయ ఆరోగ్య ఎజండాలో ప్రసూతి, కుటుంబ వ్యవస్థ అనేది ముఖ్యమైన విషయంగా ప్రస్తావించబడింది. ఇప్పటికీ గ్రామీణ మహిళల్లో 10 కేసుల్లో 9 కేసులు గర్భ నిరోధక సమస్యలు, ప్రసవ సంబంధ సమస్యలతోనే వస్తున్నారు. గడ్చిరోలి లోని మహిళలు చాలా మంది వైద్యపరమైన సహాయాన్ని కోరుతున్నారు. ఇటీవల కాలంలో రోగ నిరోధకత మెరుగుపడినట్లు, జనన రేటు తగ్గినట్లు గమనించాము. ఆ దంపతుల అవగాహన కల్పించడం వల్ల కొంతవరకు ఆ మహిళల ఆలోచనా విధానం మెరుగుపడినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా సిబ్బంది కల్పించడం, ప్రసూతి సమయంలో సంరక్షణ బాధ్యతలు తెలుసుకోవటం లాంటి బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలంటున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య చర్యలు చేపట్టటంలో కొంత విజయం సాధించినట్లు చెబుతున్నారు ఆ వైద్యులు. రొమ్ముక్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్ల పై గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు మరింత అవగాహన కల్పించాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పోషకాహార లేమితో హైపోథైరాయిడ్, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఒబేసిటి, గుండెపోటు లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాతావరణ కాలుష్యం , రసాయన కారక ఆహార పదార్థాలు లాంటివి పునరుత్పత్తి వ్యవస్థకి కారణాలవుతున్నాయని, భావితరాలకు తీరని నష్టాన్ని చేకూరుస్తాయన్నారు. ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు వెంటాడుతున్నాయి. లైంగికపరమైన విజ్ఞానం లేకపోవటం మరో ప్రధానకారణం. బాలికలు తమకు తెలీక గర్భనిరోధక మాత్రలు వాడటం, వైద్యసలహాలను పాటించకపోవటం చేస్తున్నారు. ఈ మాత్రలు మార్కెట్‌లో అన్నిచోట్లా సులభంగా లభ్యమవుతున్నందున ఎక్కువగా వాడుతున్నారు. దీంతో గర్భస్రావం పూర్తిగా జరగటం లేదు. ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని విచారం వ్యక్తంచేస్తున్నారు ఈ వైద్యులు.