Home తాజా వార్తలు యాక్సిస్ బ్యాంక్ దొంగలు దొరికారు

యాక్సిస్ బ్యాంక్ దొంగలు దొరికారు

Axis Bank ATM

 

14 మంది నిందితులు, 11మంది తమిళనాడు, 3 పశ్చిమ బెంగాల్
నలుగురు నిందితుల అరెస్టు
ఎస్‌ఓటి, సిసిఎస్, ఎల్‌బి నగర్ పోలీసులు అదుపులోకి
మే 7వ తేదీన చోరీ. మూడు నెలలు వేట
దృష్టి మరల్చి రూ.58,97,600 చోరీ
ప్రత్యేక నిఘాతో రాంజీ ముఠా పట్టివేత  

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన వనస్థలిపురం యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం బ్యాంక్ చోరీ కేసును రాచకొండ పోలీసులు చేధించారు. 14మంది ముఠాలో 11మంది తమిళనాడులోని రాంజీ గ్రామానికి చెందిన వారు కాగా, ముగ్గురు పశ్చిమ బెంగాల్ చెందిన వారు ఉన్న వీరిలో నలుగురిని అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. వారిలో గ్యాంగ్ లీడర్ పార్టివన్ దీపక్ అలియాస్ దీపు, సత్యరాజ్, యోగేష్, సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 4,10,000, టాటా ఇండికా కారు, ఆరు మొబైల్ ఫోన్లు, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తమిళనాడు రాష్ట్రం తిరుచిరాలపల్లి జిల్లా, రాంజీనగర్, పుంగనూర్ గ్రామం, న్యూ కాటూర్, గాంధీనగర్‌కు చెందిన పర్టివన్ దీపక్ అలియాస్ దీపు వీరి గ్యాంగ్‌కు నాయకుడుగా వ్యవహరిస్తున్నాడు, మళ్లైపట్టి, సర్వేకరకు చెందిన తంగరాజ్ సత్యరాజ్, పుంగనూర్ గ్రామం, మిల్ కాలనీ, గాంధీనగర్‌కు చెందిన యోగ రాజ్, కరూర్ జిల్లా, తందోనిమాలికి చెందిన సురేష్‌ను అరెస్టు చేశారు. ముఖేష్, శరవణన్ అలియాస్ బీడి సరవణన్, ఆర్ముగమ్, తోమోదరన్, కుమారన్, కుమార్, వడివేలు, రాజు, గోకుల్, ఆదిత్య పరారీలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన 11మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే,7వతేదీ, 2018న వనస్థలిపురం, ఆటోనగర్ ఏరియాలోని ఎటిఎంలో డబ్బులు లోడ్ చేసేందుకు వచ్చిన సిబ్బంది దృష్టి మరల్చి టాటా విస్టా కారులో ఉన్న రూ.58,97,600 చోరీ చేసి పరారయ్యారు.

దృష్టి మరల్చి దోపిడీ…
ఎంటిఎంలో డబ్బులు లోడ్ చేసేందుకు వచ్చిన సిబ్బంది బ్యాంక్ లోపలికి ఇద్దరు వెళ్లగా సెక్యూరిటీ గార్డు, మరో ఉద్యోగి వాహనం వద్ద ఉన్నారు. వీరి కోసం అక్కడే ఉన్న 14మంది సభ్యుల ముఠా వాహనం వద్దకు ఒకరు వచ్చి రూ.500, 200 100 నోట్లను కింద వేసి డబ్బులు కింద పడ్డాయని చెప్పారు. తమ డబ్బులు కిందపడినవి కావచ్చని ఇద్దరు ఉద్యోగులు వెళ్లి వాటిని తీసుకుంటుండా ముఠాలోని ఓ వ్యక్తి వచ్చి కారులోని డబ్బుల పెట్టెను తీసుకుని వెళ్లాడు. రోడ్డుకు అటువైపు అప్పటికే ఆటోలో ఉన్న ముఠా సభ్యులు వెంటనే డబ్బులు తీసుకుని పరారయ్యారు. ఆటోలో దిల్‌సుఖ్ నగర్‌కు చేరుకుని అక్కడి సులభ్ కాంప్లెక్స్‌లో డబ్బులను పెట్టెలోనుంచి సంచిలోకి మార్చుకుని రైలులో పరారయ్యారు. ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో దృష్టి మళ్లించి బ్యాగులు, దోపిడీలు, వాహనాలు చోరీ చేశారు. వీరిపై వనస్థలిపురం, ఎపిలోని విశాఖపట్టణం, తమిళనాడులో కేసులు నమోదయ్యాయి.

నిరంతర వేట…
కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు సవాల్‌గా తీసుకుని సిసిటివి ఫుటేజ్ పరిశీలించారు. ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్, సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్ బాబు ఆధ్వర్యంలో టీములను ఏర్పాటు చేశారు. వీరు సిసిటివి ఫుటేజ్‌ను ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు పంపించారు. వారు దీనిని పరిశీలించి ఇది తమిళనాడుకు చెందిన రాంజీ ముఠా పనని చెప్పారు. ఈ ముఠా గతంలో భోపాల్‌లోని ఓ ఏటిఎంలో చోరీకి పాల్పడి రూ.43 లక్షలకు పైగా దోచుకెళ్లినట్లు తెలిపారు. ప్రత్యేక టీములు తమిళనాడులోని రాంజీ, కేరళ, కర్నాటకకు వెళ్లారు. ముఠా సభ్యులు రాంజీకి వెళ్లి డబ్బులు వారి ఇచ్చి వేసి పరారయ్యారు. దీంతో అక్కడ వారు లేకపోవడంతో పోలీసులు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి వీరిని పట్టుకునేందుకు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు. మూడు నెలల నుంచి వారిని పట్టుకునేందుకు వేటాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి కదలికలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ దోపిడీ చేసేందుకు రావడంతో ఎల్‌బి నగర్‌లోని ఆటోనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం ఇస్తే చంపేస్తారు…
గుజరాజ్‌కు చెందిన వ్యాపారి ఇక్కడికి వచ్చి మిల్లు స్థాపించడంతో అతడి పేరు మీద రాంజీ అని పిలుస్తారు. రాంజీ ముఠా సభ్యులను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులకు అక్కడి స్థానికులు ఎలాంటి సహయం చేయరు. గతంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఓ వ్యక్తిని హత్య చేశారు. అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు అందరూ కలిసి చోరీ చేసిన సొత్తును పంచుకుంటారు. అక్కడి వారు తమిళం తప్ప వేరే భాష మాట్లాడరు. ఇది పోలీసులకు అవాంతరంగా మారింది. ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకుని మరీ దర్యాప్తును కొనసాగించారు.

డబ్బులు కింద పడ్డాయంటే నమ్మవద్దు : మహేష్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్
డబ్బులు కింద పడ్డాయని ఎవరైనా చెబితే నమ్మవద్ద, మీ దగ్గర ఉన్న అసలు డబ్బులు ఉన్నవా లేదా అని చూసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కోరారు. ఎవరైనా డబ్బులు కిందపడినవని చెబితే ఒకసారి చూసుకోవాలని అన్నారు. దృష్టి మరల్చే దొంగలను తమ డబ్బులను కిందవేసి డబ్బులు తీసుకుని పారిపోతారని తెలిపారు.

Axis Bank ATM Bank Loot gang arrested