*టిఆర్‌ఎస్‌లో చేరడానికి పలువురు కాంగ్రెస్ నేతలు రెడీ
*వంద స్థానాలు గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి
*వార్ వన్‌సైడే : ఎంపి కవిత
*కోదండరామ్ పార్టీ పెడితే స్వాగతిస్తాం
*అందరూ ఏకమైనా తమకేమీ ఇబ్బందిలేదని స్పష్టీకరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌లో చేరేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారని నిజామాబాద్ ఎంపి కవిత వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడు తూ వలసల వల్ల వచ్చే ఎన్నికల్లో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ముందస్తు ఎన్నికలు వచ్చినా ఫర్వాలేదని, తాము సిద్ధంగానే ఉన్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపిగా పోటీ చేయాలా లేక ఎంఎల్‌ఎగా పోటీ చేయాలా అనే విషయాన్ని పార్టీ తేలుస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 100 స్థానాలు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని, ‘వార్ వన్ సైడ్’ అవుతుందన్నారు. కోదండరాం రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తామని, రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకమైనా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. మంత్రి కెటిఆర్ రిజిస్ట్రేషన్ మీద వెళితే తప్పేంటని, ఆయన వెళ్లింది రాష్ట్రం కోసమే కదా అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రివర్గంలో మహిళలు లేకపోతే ఏంటని, గత ప్రభుత్వంలో ఆరుగురు మహిళలు మంత్రులుగా ఉండి ఏంచేశారని ప్రశ్నించారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తనకు సమాచారం లేదని, ఒకవేళ ఉన్నట్లయితే మహిళను తీసుకోవాలని కోరుతామన్నారు. మరి కొన్ని నూతన కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని అడిగామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉందన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ వాణిని గట్టిగా వినిపిస్తామని చెప్పారు. పసుపు బోర్డు విషయంలో కేంద్రంలో కదలిక తెచ్చామని, అయితే ఏర్పాటు చేయించడంలో ఇంకా సఫలం కాలేదన్నారు. హైకోర్టు విభజనతో పాటు విభజన చట్టంలోని ఇతర హామీలన్నింటిని కేంద్రం నెరవేర్చాలన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల ముసాయిదాను అడ్వొకేట్ జనరల్ కూడా ఆమోదించారని, ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి సింగరేణి యాత్ర ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటి చేస్తానంటున్నారు అది ఆయన హక్కు అన్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తే దానిపై పార్టీలో చర్చిస్తామన్నారు. అన్ని చట్టాలను పటిష్టం చేస్తున్నామని దీనిలో భాగంగానే పరుష పదజాలానికి సంబంధించి సెక్షన్ 506, 507లపై ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నదన్నారు.
మంత్రి లకా్ష్మరెడ్డికి ప్రతిపాదనలు
వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డిని కలిసిన ఎంపి కవిత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పలు ప్రతిపాదనలు అందచేశారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన వైద్యశాలను 500 పడకల స్థాయి నుంచి 700 పడకలకు పెంచాలని కోరారు. జగిత్యాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని, నిజామాబాద్, జగిత్యాలలో వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభించాలని కోరారు. కోరుట్లలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరినట్లు మీడియాకు తెలిపారు. బోధన్‌లోని నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేనందున తరగతులు నిజామాబాద్‌లో నిర్వహిస్తున్నామని త్వరలో భవనం నిర్మిస్తామని, సిబ్బందిని నియమించాలన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో బోధన్, జగిత్యాలలో డయాలిసిస్ కేంద్రాలు ప్రారంభించాలని, వీటిని సిద్ధం చేయాలని మంత్రి లకా్ష్మరెడ్డి ఈ సంధర్భంగా అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్‌లో వైద్య సౌకర్యాల మెరుగుకు చర్యలు
నిజామాబాద్ జిల్లాలో వైద్య సదుపాయాల పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మ్రంతి సి.లకా్ష్మరెడ్డికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత విన్నవించారు. ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సౌకర్యాలను మెరుగు పర్చాలన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌కి వెళ్ళిన కవిత జిల్లాలోని వైద్య ఆరోగ్య పరిస్థితులపై వివరించారు. జిల్లా ప్రధాన వైద్యశాలను 500 నుంచి 700 పడకలకు పెంచాలని, జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి, నిజామాబాద్, జగిత్యాలలో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. జగిత్యాలలో మాతా శిశు కేంద్రాన్ని త్వరగా పూర్తి చేసి, జగిత్యాలకు మరో రెండు, నిజామాబాద్‌కు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నందిపేటలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు, నిజామాబాద్, బోధన్, జగిత్యాలలోని వైద్యశాలల్లో సిబ్బంది కొరతను తీర్చాలని సూచించారు.