Home తాజా వార్తలు దలాల్ స్ట్రీట్‌లో ఇక ధగధగ

దలాల్ స్ట్రీట్‌లో ఇక ధగధగ

bse

అయోధ్య తీర్పుతో తొలగిపోయిన రాజకీయ, విధాన అనిశ్చితి
భారత్‌పై పెరగనున్న విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం
మార్కెట్ల నిపుణుల అంచనా

ముంబయి: వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు సర్వత్రా ఆమోదం లభించింది. దీనిపై దలాల్ స్ట్రీట్ నిపుణులు సైతం సానుకూలంగానే స్పందించారు. సుమారు వందేళ్లుగా నలుగుతున్న వివాదం ఓ కొలిక్కి రావడం దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని మార్కెట్ పండితులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ తీర్పుతో ప్రధాన రాజకీయ, విధానపరమైన అనిశ్చితి ముగిసిపోయిందని వారంటున్నారు. దీంతో భారత్‌పై విదేశీ మదుపరుల విశ్వాసం బలపడుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వారు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పట్ల విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరచడంలో ఈ తీర్పు తోడ్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే స్టాక్‌మార్కెట్లో కీలక సూచీలైన పెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతున్నాయి.

తాజా పరిణామాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడి కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ మరింతా దూసుకుపోతుందని భావిస్తున్నారు. ‘ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. దేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే కచ్చింతగా యుపి వాటా లక్ష కోట్ల డాలర్లుగా ఉండాలి’ అని సీనియర్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా అభిప్రాయపడ్డారు. ‘ వ్యవస్థను సరళతరం చేసే ఏ నిర్ణయమైనా ఇండియాపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది’ అని కెఆర్ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ఎండి దేవన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. ‘ మొదట కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపు, అనంతరం అయోధ్య తీర్పు దేశీయ వ్యవస్థకు మంచిదని, ఎల్‌టిసిజి, వ్యక్తిగత పన్ను రేట్లను మార్చడం వంటి మరిన్ని సంస్కరణలు వస్తాయని సంజయ్ భాసిన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని, బెంచ్‌మార్క్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడం ఇక సులభమని ఆయన అన్నారు.

ఈ తీర్పువల్ల అయోధ్యలో రామమందిరం, మసీదు నిర్మాణం పూర్తయ్యాక ప్రతిరోజు అయోధ్యను సందర్శించే విదేశీ టూరిస్టుల సంఖ్య 50 వేలనుంచి లక్షకు చేరుకుంటుందని కేడియా అభిప్రాయపడ్డారు. ‘ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మార్చిన వైఫ్ణోదేవి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లాగానే అయోధ్య కూడా మారుతుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అయోధ్య భూ వివాదంలో సుప్రీంకోర్టు మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Ayodhya verdict big positive for market