Friday, April 19, 2024

కరోనాకు పతంజలి వైద్యం

- Advertisement -
- Advertisement -

Baba Ramdev Patanjali launches ayurvedic medicine for corona

 

విడుదల చేసిన బాబా రాందేవ్
7 రోజుల్లో వంద శాతం రికవరీ
కరోనా కిట్ ధర రూ. 545
నివారణ కోసమూ వాడవచ్చు

హరిద్వార్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్న వేళ ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేదిగా ప్రకటించుకుంటూ తొలి ఆయుర్వేద మందును యోగా గురు రాందేవ్ మంగళవారం విడుదల చేశారు. రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఈ మందును తయారుచేసింది. హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠంలో కరోనా వైరస్ సోకిన రోగులకు ప్రయోగాలు జరిపినపుడు కొరోనిల్, శ్వాసరి పేరిట తాము తయారుచేసిన ఆయుర్వేద ఔషధాలు వంద శాతం పనిచేశాయని మంగళవారం హరిద్వార్‌లో విలేకరుల సమావేశంలో రాందేవ్ ప్రకటించారు. కరోనా రోగులు వారం రోజుల్లో వంద శాతం పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. ఈ కరోనా కిట్ ధర రూ. 545 అని పతంజలి ఆయుర్వేద ఎండి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఈ కిట్‌లో 30 రోజులకు అవసరమైన ఔషధాలు ఉంటాయని, ఈ మందులను కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చని ఆయన వివరించారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచే మందు కాదని, కరోనాను అరికట్టే ఔషధమని రాందేవ్ అన్నారు.

హరిద్వార్‌కు చెందిన దివ్య ఫార్మసీ, పతంజలి ఆయర్వేద్ లిమిటెడ్ ఈ మందును తయారుచేశాయి. జైపూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పతంజలి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయక్తంగా జరిపిన పరిశోధనల ఫలితమే ఈ మందు అని రాందేవ్ చెప్పారు. ఈ మందులను 280 మంది కరోనా పాజిటివ్ రోగులపై ప్రయోగ పరీక్షలు జరపగా వీరిలో 69 శాతం మంది 3 రోజులలో కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. కరోనా రోగులు ఈ మందును వాడితే కేవలం 7 రోజులలో వంద శాతం పూర్తిగా కోలుకుంటారని ఆయన తెలిపారు.

స్వచ్ఛమైన తిప్పతీగ, తులసి, అశ్వగంధలతో కొరోనిల్ ఔషధాన్ని తయారుచేసినట్లు ఆయన చెప్పారు. కరోనా కిట్‌లో కొరోనిల్, శ్వాసరి, అను తేల్ అనే మూడు ఔషధాలు ఉంటాయి. కొరోనిల్‌తో పాటు తీసుకోవలసిన శ్వాసరి అనే మందు శ్వాసకోశ వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలను నయం చేస్తుంది. అనూ తేల్ అనేది ముక్కులో వేసుకునే డ్రాప్స్. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. వచ్చే సోమవారం నుంచి కరోనా కిట్ కోసం మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వవచ్చని రాందేవ్ తెలిపారు.

పరిశోధనల వివరాలు మాకు ఇవ్వండి
పతంజలి సంస్థను వివరణ కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: కోవిడ్-19 చికిత్సకు కరోనా కిట్ పేరిట యోగా గురు రాందావ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ విడుదల చేసిన ఆయుర్వేద మందుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మందుకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం వివరాలు తమకు అందలేదని కేంద్ర ఆయుష్ శాఖ మంగళవారం ప్రకటించింది. వెంటనే ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను తమకు సమర్పించాలని పతంజలి సంస్థను ఆయుష్ శాఖ ఆదేశించింది.

ఆయుర్వేద మందులతో సహా అన్ని మందులకు సంబంధించిన ప్రకటనలు 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్(అబ్జక్షనబుల్ అడ్వర్టజ్‌మెంట్స్) చట్ట నిబంధనలతోపాటు కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలకు లోబడి ఉంటాయన్న విషయాన్ని పతంజలి ఆయుర్వేద సంస్థకు తెలియచేయడం జరిగిందని ఆయుష్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయుష్ పరిధిలోకి వచ్చే పరిశోధనలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయాన్ని కూడా ఆయుష్ మంత్రిత్వశాఖ ఉటంకించింది. కరోనా వైరస్ చికిత్సకు తాము కనిపెట్టినట్లు చెబుతున్న మందుకు సంబంధించిన ప్రకటనలను, ప్రచారాన్ని నిలిపివేయాలని కూడా మంత్రిత్వశాఖ పతంజలి సంస్థను ఆదేశించింది.

కోవిడ్ చికిత్సకు తయారుచేసిన మందుల పేర్లు, వాటి తయారీ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌ను ఆదేశించామని కేంద్రం తెలిపింది. అంతేగాక ఈ పరిశోధనలు ఏ ఆసుపత్రిలో లేదా చికిత్సా కేంద్రంలో జరిగాయో తెలియచేయడంతోపాటు ఇందుకు పాటించిన నియమ నిబంధనలు, ఎంతమంది రోగులపై పరిశోధనలు జరిపారు, సంస్థాగత ఎథిక్స్ కమిటీ ఆమోదం, సిటిఆర్‌ఐ రిజిస్ట్రేషన్, పరిశోధనల వివరాలు తదితర వివరాలను తమకు సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. వీటిపై తమ అధ్యయనం పూర్తయ్యేవరకు ఈ మందుకు సంబంధించిన ప్రకటనలు, ప్రచారాన్ని నిలిపివేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. అంతేగాక పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కనిపెట్టినట్లు ప్రకటించుకున్న కరోనా మందుకు సంబంధించి జారీచేసిన లైసెన్సు, ఇతర అనుమతుల వివరాలకు సంబంధించిన కాపీలను తమ అందచేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News