Home తాజా వార్తలు మోరీ రంధ్రంలో పడిన చిన్నారి

మోరీ రంధ్రంలో పడిన చిన్నారి

గౌలిగూడ టెలిఫోన్ కేంద్రం వద్ద రోడ్డుమీద కచ్చామోరీపై రంద్రం
 కాలుజారి లోపల పడిపోయిన చిన్నారి దివ్య
కాలువలోపలి నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఇది తన కూతురుకి పునర్జన్మ : తండ్రి చంద్రకాంత్

 

మనతెలంగాణ/ గోషామహల్ : ఆ చిన్నారి మృత్యువు దాకా వెళ్లి.. అదృష్ఠవశాత్తు బతికి బయటపడింది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంతో పాప మృత్యుంజయురాలుగా బయటపడింది. సుమారు ఆర్ధగంటపాటు శ్రమించి లోపల కాలువలో జారిపడిన చిన్నారిని సురక్షితంగా కాపాడారు. మళ్లీ పాపకు పునర్జన్మనిచ్చారు. బల్దియా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది.  ఈ ఘటన ఆదివారం ఉదయం 11 గంటలకు గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం.. గౌలిగూడ టెలిఫోన్ కేంద్రం వెనకాల వీదుల్లో సి. చంద్రకాంత్, లత దంపతులు.. వీరికి వెన్నెల (8) దివ్య (4) ఇద్దరు కూతుళ్లు.. కాగా చంద్రకాంత్ వృత్తిరీత్య కార్పొరేంటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటివద్దే ఉన్నారు. ఉదయం వేళలో పెద్దకూతురు వెన్నెల, చిన్నకూతురు దివ్య టిఫిన్ చేసేందుకు గౌలిగూడ టెలిఫోన్ కేంద్రం వద్దకు వచ్చారు.

అల్పాహారం తిన్న కొద్దిసేపటికి ఇద్దరుతోపాటు మరో ముగ్గురు చిన్నారులు అక్కడికి నుంచి ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో దివ్య తనకు మూత్రం వస్తుందని అక్క వెన్నెలతో చెప్పింది. దీంతో అక్కడే గోడ పక్కనే మూత్రం కోసం పంపించింది. వెంటనే మూత్రం కోసం వెళ్లగా.. అక్కడే కచ్చామోరీపై స్లాబ్‌పై పెద్ద రంద్రం పడింది. ఇది గమనించిన దివ్వ అక్కడే మూత్ర విసర్జన చేస్తుండగా.. బురదలో కాలు జారి… ఒక్కసారిగా కాలువలోకి పడిపోయింది. అయితే అక్కడే మెకానిక్ చూసి వెంటనే పరుగెత్తుకుంటే వచ్చి అయ్యో పాప కాలువలో పడిందంటూ కేకలు, అరుపులతో హహాకారాలు చేశారు. దీంతో అక్కడున్న జనం కచ్చామోరీ వద్దకు చేరుకున్నారు. లోపల కాలువలో దివ్య బయటి నుంచి కనిపించకపోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. అక్క వెన్నెల ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. కాలువ లోపల అంత చీకటిగా ఉండటంతో దివ్య ఆచూకి కానరావడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. చేసేదేమీలేక తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ తన కూతురు ఎక్కడుందోనంటూ బోరున రోదించారు. స్థానికులు వెంటనే కూతవేటూ దూరాన ఉన్న గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రాజకుమార్ గౌడ్‌కు సమాచారం అందించారు.

వెంటనే ఫైర్‌ సిబ్బంది క్రాంతికుమార్, సురేశ్, రమణ, వసంతరావులు నిచ్చేన సహాయంతో తాడుతో అక్కడికి చేరుకున్నారు. కాలువ లోపల ఆంధకారం ఉండటం.. లోపలి నుంచి దివ్య కేకలు, అరుపులు, రోదనలు వినిపించాయి. దీంతో సిబ్బంది టార్చ్‌లైట్లు తీసుకుని మరోమారు కాలువలోపలికి దిగారు. కాలువలోపల వెతకగా దివ్య కొద్దిదూరాన కాలువలోనే బురద, నీటిలో కూర్చొని ఎడుస్తూ కనిపించింది. వెంటనే క్రాంతికుమార్ పాప వద్దకు చేరుకుని.. దివ్యకు దైర్యం చెప్పి అక్కున చేర్చుకుని.. అతి జాగ్రత్తగా నిచ్చేన సహాయంతో పైకి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. తన పాప సురక్షితంగా ప్రాణాలతో బయటికిరావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఒక్కసారిగా భాష్పాంజలి రాల్చారు. అనంతరం దివ్యను తన తల్లిదండ్రులకు అప్పగించారు. తన బిడ్డకు ఇది పునర్జన్మ అంటూ తండ్రి చంద్రకాంత్ పేర్కొన్నారు. తన బిడ్డను ప్రమాదకర పరిస్థితి నుంచి సురక్షితంగా కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని జీవితాంతం గుర్తుంచుకుంటాను. మీరు చేసిన మేలు ఏనాటికి మార్చిపోను అంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

కాలువపై రంద్రం పడిన మరమ్మతులుచేయని బల్దియా

బల్దియా వర్గాల తీవ్ర నిర్లక్ష్యానికి కాలువపై ఏర్పడిన రంద్రమే పరాకాష్ఠ అంటూ స్థానికులు అధికారులు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చామోరీపై రంద్రం పడిన వెంటనే మరమ్మతులుచేయాలంటూ అధికారులకు పదేపదే చెబుతున్నాం కానీ ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని వారు మండిపడ్డారు. స్థానికులు అప్రమత్తం కావడంతోనే చిన్నారి దివ్య సురక్షితంగా ప్రాణాలతో బతికి బయటపడిందన్నారు. బల్దియా నిర్లక్ష్యం వల్ల మున్ముందు ఎంత మంది ప్రాణాలు తీసుకుంటారో అంటూ వారి పనితీరుపై మండిపడ్డారు.