Home తాజా వార్తలు పెరిగిన ‘ఆటో’ బ్యాడ్ బ్యాంక్

పెరిగిన ‘ఆటో’ బ్యాడ్ బ్యాంక్

Bad banking increased in auto loan companies

 

కరోనా ఆంక్షల వల్ల దెబ్బతిన్న ఆటో ఫైనాన్స్ పరిశ్రమ
నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో పెరిగిన లోన్ డిఫాల్ట్ కేసులు
మొదటి త్రైమాసికంలో భారీ నష్టాలు

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధించడం వల్ల మొండి బకాయిలు పెరిగాయి. దీని వల్ల ఆటో ఫైనాన్స్ కంపెనీలకు అధిక స్థాయిలో మొండి బకాయిలు పెరగనున్నాయి. జూన్ త్రైమాసిక ఫలితాలను తొలిసారిగా ప్రకటించిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ తన మొండి బకాయిలు 19 శాతం పెరిగినట్టు ప్రకటించింది. టూ, త్రీ వీలర్ సెగ్మెంట్‌లో డిఫాల్ట్‌లు పెరగడం వల్ల మొండి బకాయిలు పెరుగుతున్నట్టు సంస్థ ప్రకటించింది. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఫైనాన్స్ ఇప్పటికే జూన్ త్రైమాసికంపై హెచ్చరికలు చేసింది. లాక్‌డౌన్ ఆంక్షల వల్ల మొదటి త్రైమాసికంలో కంపెనీకి వసూళ్లు, కొత్త వ్యాపార ఉత్పత్తి పరంగా చాలా సవాల్‌తో కూడినదిగా ఉందని సంస్థ తెలిపింది.

కరోనా ఆంక్షల కారణంగా గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో టిఎంఎఫ్‌ఎల్ పంపిణీ 12 శాతం తగ్గి రూ.13,258 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో ఇదే విధమైన ధోరణి ఉండొచ్చని సంస్థ భావిస్త్తోంది. ఇతర బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీలు కూడా జూన్ త్రైమాసికంలో ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నాయి. బ్యాంకులు కూడా పెద్ద ఆటో రుణాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నాయి. అయితే అధిక రిస్క్ ప్రొఫైల్ ఉన్న వినియోగదారులకు రుణాలు ఇస్తున్నందున ఎన్‌బిఎఫ్‌సిలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని ఒక ఎన్‌బిఎఫ్‌సి అధికారి తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.4 లక్షల కోట్ల మార్కెట్ ఉన్న దేశీయ ఆటో ఫైనాన్స్ పరిశ్రమ కరోనా సంక్షోభం కారణంగా చాలా వరకు ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు.