Home తాజా వార్తలు బాహుబలి3, 4 మోటార్ల వెట్ రన్ విజయవంతమైంది…

బాహుబలి3, 4 మోటార్ల వెట్ రన్ విజయవంతమైంది…

Bahubali 3, 4 Motors

 

ధర్మారం: బాహుబలి 3, 4 మోటార్ల వెట్ రన్ విజయవంతమైంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి నందిమేడారం ఆరవ ప్యాకేజీలోని భూగర్భంలో నిర్మించిన 3వ బాహుబలి మోటారుకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంజనీర్ ఇన్‌చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సిఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, నీటిపారుదలశాఖ టెక్నికల్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాష్, ఈఈ నూనె శ్రీధర్, నవయుగ డైరెక్టర్ వెంకట రామారావు, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు. అలాగే బుధవారం సాయంత్రం వేళ బాహుబలి 4వ మోటారును సైతం అధికారులు పరిశీలించి విజయవంతంగా ప్రారంభించారు.

నీటిపారుదలశాఖ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో, నవయుగ, బిహెచ్‌ఎల్ ఇంజనీర్లు, నవయుగ సిబ్బంది పూలవర్షం కురుస్తుండగా సంబరాలు జరుపుకున్నారు. ఉన్నతాధికారరులు స్వీట్లు పంచుకొని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మేడారం రిజర్వాయర్ సమీపంలోని డెలివరీ సిస్టమ్ వద్ద ఒక్కసారిగా ఉబికి వచ్చిన గోదావరి జలాలకు అధికారుల బృందం పూజలు నిర్వహించారు. గత నెల 24, 25తేదీల్లో రెండు మోటార్లను ఆన్‌చేసిన అధికారులు తాజాగా మూడవ, నాల్గవ బాహుబలి మోటార్‌లను విజయవంతంగా అందుబాటులోకి తేవడం గమనార్హం.

మూడో, నాల్గవ బాహుబలి మోటార్‌ల ప్రారంభోత్సవం అనంతరం ఇంజనీర్ ఇన్‌చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ సీజన్‌లో అందుబాటులోకి తెస్తామని అన్నారు. కాళేశ్వరం పరిధిలోని లింక్ వన్, టు లను సిద్ధం చేస్తున్నామని, కోటి ఎకరాల మాగాణి లక్షంగా ముందుకు సాగుతున్నామని నల్ల వెంకటేశ్వర్లు, శ్రీధర్‌రావు దేశ్‌పాండే చెప్పారు.

శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనులు శరవేగంగా నడుస్తున్నాయని, ఈ ఖరీఫ్ నాటికి శ్రీరాంసాగర్ ఆయకట్టు 13లక్షల ఎకరాలకు సాగునీరు అందించి కాళేశ్వరం సత్తా ప్రపంచానికి చాటిచెప్పి సిఎం కెసిఆర్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. కాళేశ్వరం పనులు శరవేగంగా జరగడంతో ప్రభుత్వ సహకారం, ఏజెన్సీలు, ఇంజనీర్ల కృషి అభినందనీయమని నల్ల వెంకటేశ్వర్లు, శ్రీధర్‌రావుదేశ్‌పాండేలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ శ్రీధర్, డీఈఈ నర్సింగారావు, ఏఈఈలు ఉపేందర్, నర్సింగరావు పాల్గొన్నారు.

 

Bahubali 3, 4 Motors Wet Run Successfull