Home వార్తలు బాజీరావ్ మస్తానీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంట

బాజీరావ్ మస్తానీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంట

Ranveer-Singh*అయిదు అవార్డులతో అగ్రస్థానంలో 8మూడు అవార్డులు ‘పీకూ’ సొంతం
*ఉత్తమ నటుడిగా రణ్‌వీర్ సింగ్ 8ఉత్తమ నటిగా దీపికా పదుకునే 8ఉత్తమ దర్శకుడిగా సంజయ్‌లీలా భన్సాలీ 8ఉత్తమ కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రా ప్రధాన తారాగణంగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంట పండింది. సినీ తారల తళుకుబెళుకుల మధ్య ముంబయ్‌లోని యష్‌రాజ్ స్టూడియోలో జరిగిన 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలో ఈ బిగ్ మూవీ అయిదు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకొని సత్తా చాటింది. ఆతర్వాత ‘పీకూ’ చిత్రం మూడు అవార్డులు సొంతం చేసుకొని హైలైట్‌గా నిలిచింది. ‘బాజీరావ్ మస్తానీ’ ఉత్తమ చిత్రంగా నిలిచి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. దాంతోపాటు హీరో రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు దక్కించుకున్నారు. ఈ చిత్రంలో నటించిన ప్రియాంకా చోప్రాకు ఉత్తమ సహాయ నటిగా, ఉత్తమ నేపథ్య గాయనిగా సినిమాలో పాడిన శ్రేయా ఘోషల్ ఫిల్మ్‌ఫేర్‌లను సొంతం చేసుకున్నారు. ఇక స్టార్ బ్యూటీ దీపికా పదుకునే… ‘పీకూ’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. అదేవిధంగా క్రిటిక్స్ విభాగంలో ‘పీకూ’ ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్‌ను సొంతం చేసుకుంది. క్రిటిక్స్ విభాగంలో మితాబ్ బచ్చన్ (పీకూ) ఉత్తమ నటుడిగా, కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్) ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా అనిల్ కపూర్ (దిల్ దడ్కనే దో), తెలుగు కథా రచయిత విజయేంద్రప్రసాద్ (భజరంగీ భాయిజాన్) ఉత్తమ కథా రచయితగా అవార్డును గెల్చుకున్నారు. తొలి పరిచయం కేటగిరీలో ఉత్తమ నటుడిగా సూరజ్ పంచోలి (హీరో), ఉత్తమ నటిగా భూమి పెడ్నేకర్ (దమ్ లగా కే హైసా), ఉత్తమ దర్శకుడిగా నీరజ్ (మసాన్)లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
తారల సందడి…
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలో పలువురు సినీ తారలు సందడి చేసి అలరించారు. తళుకుబెళుకులతో ఆహుతులను చూపుతిప్పుకోకుండా చేశారు. సినీ స్టార్లు సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, జాక్విలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్, రానా, మాధురీ దీక్షిత్, రవీనా టాండన్, సన్నీలియాన్, పరిణితి చోప్రా, నేహా దుపియా, హ్యూమా ఖురేషి, రేఖ, వరుణ్ ధావన్, రాధికా ఆప్టే, జరీన్ ఖాన్, ఎవిలిన్ శర్మ, శ్రియా, ఇలియానా, సోనాలి బెంద్రే, అక్షర హాసన్ తదితరులు ఈ వేడుకలో హల్ చల్ చేశారు. పలువురు బ్యూటీక్వీన్లు హాట్‌హాట్‌గా దర్శనమిచ్చి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.