Home దునియా మరో కైలాసగిరి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం

మరో కైలాసగిరి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం

సర్వశుభాలను ప్రసాదించే చల్లని తల్లి.. ఏడు వందల యేండ్ల చరిత్రగల ఆలయం… ముగ్గురమ్మల మూలపుటమ్మ సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ…బాయిల పుట్టిన అమ్మ బల్కంపేట ఎల్లమ్మ. ఈ తల్లిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని భక్తుల నమ్మకం. పేద ధనిక భేదం లేకుండా అందరినీ చల్లంగా చూస్తుంది ఎల్లమ్మ తల్లి. తెలంగాణ గ్రామీణ జానపద సంప్రదాయాలు ఉట్టిపడే బల్కంపేట ఎల్లమ్మ ఆలయ విశిష్టతే ఈ వారం దర్శనం…

ఎక్కడ ఉన్నది.. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉండి భక్తులను ఆకట్టుకుంటుంది.
ఎలా వెళ్లాలి..  అమీర్‌పేట్ క్రాస్‌రోడ్స్ నుంచి హోటల్ గ్రీన్ పార్క్ మీదుగా వెళ్లాలి. ఎలిఫెంట్ హౌజ్ దాటుతూ బల్కంపేట రోడ్డు మీది నుంచి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

balkampet yellamma temple story in telugu

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉన్న పోచమ్మ తల్లిని నవ వధూవరులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పేద,ధనిక తేడా లేకుండా అక్కడ పెట్టే భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఎల్లమ్మకు ప్రీతిపాత్రమైన ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

ఆలయ చరిత్ర అప్పటికి భాగ్యనగర అంకురార్పణ కూడా జరగలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. రాజా శివరాజ్ బహద్దూర్ హయాంలో బెహలూఖాన్ గూడా అది. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డొచ్చింది. అమ్మవారి ఆకృతి కదిలిస్తే కదలడం లేదు. ఊళ్లో వాళ్లను పోగుచేసి కదిలించే ప్రయత్నం చేసినా కదల్లేదు. శివుడికి అత్యంత ఇష్టమైన శివసత్తులను పిలిస్తే, ‘కదిలించొద్దు ఇక్కడ్నుంచే పూజలందిచాలని సూచించారు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించారు. మూలవిరాట్టు బావిలో ఉండటంతో భక్తులు ఒడ్డున నిలబడి పూజించేవాళ్లు. క్రమంగా రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించి ఓ ఆలయం వెలిసింది. అలా ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా ప్రసిద్ధికెక్కింది.

జలదుర్గగా ప్రసిద్ధి అమ్మవారిని భక్తులు బల్కంపేట ఎల్లమ్మ ..రేణుకా ఎల్లమ్మగా పిలిస్తుంటారు. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్త జనం మహాతీర్థంగా స్వీకరిస్తుంటారు. అమ్మవారి కళ్యాణం..రథోత్సవం ..బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయిక్కడ. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సావాలను ముల్లోకాల నుంచి దేవతలూ తిలకిస్తారని స్థానికుల నమ్మకం. ఈ ఉత్సవాలకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. దేశం నలుమూలల నుంచి శివసత్తులు తరిలి వస్తుంటారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని వారు మరో కైలాసగిరిగా భావిస్తుంటారు. వీధుల్లో రథంలో అమ్మవారు ఊరేగుతుంటే భక్తులు ఆనందంతో తరిస్తుంటారు.

ఆలయనిర్మాణం ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారంపై గోపురం నిర్మితమై ఉంది. గోపురంపై అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజ స్తంభం ప్రతిష్టితమై ఉంది. ఆలయ ప్రాకారాన్ని ఆనుకుని ఆలయం చుట్టూ ప్రా కార మండపం ఉంది. ఈ మండపం లోని గోడలపై జగన్మాత వివిధ రూపాలలో ఉన్న తైలవర్ణ చిత్రాలు కనువిందుచేస్తాయి. ఆల య ప్రాంగణంలో వినాయకుడు కొలువుదీరాడు.

ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చినవాళ్లు ముందుగా వినియకుడిని దర్శించుకున్నాకే లోపలికి వెళ్తుంటారు. వాస్తవానికి అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా కొలువుదీరింది. అయితే తర్వాతి కాలంలో మూలవిరాట్టును ప్రతిష్టించారు. 20 ఏళ్ల క్రితం హంపీ పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్ఠించారు. నాగదేవత వద్ద నిత్యం నాగదోష, కాల సర్పదోష పూజలు జరుగుతుంటాయి. పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉందిక్కడ.