Friday, March 29, 2024

బ్యాలెట్‌తోనే పెట్టేద్దామా !

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
ఎపికి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరిన ఎస్‌ఇసి
అందుబాటులో లేని వివిప్యాట్‌లు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సిఇఒ లేఖ
డివిజన్ల పునర్విభజనకు సర్కార్ నై.. త్వరలోనే ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం

Parishad elections

 

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రధానంగా ఎన్నికలు బ్యాలెట్ బాక్సుతో నిర్వహించాలా లేక ఇవిఎంలతో వెళ్లాలా? అనే దానిపైనే తర్జనభర్జన పడుతోంది. కరోనా నేపథ్యంలో దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఇప్పటికే ఎస్‌ఇసి సేకరించింది. అధికార టిఆర్‌ఎస్ పార్టీ బ్యాలెట్ బాక్సులతోనే ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేయగా, సిపిఐ, సిపిఎంలు కూడా బ్యాలెట్ బాక్సుకే ఓటేశాయి. అయితే కాంగ్రెస్ ఎటువంటి అభిప్రాయాన్ని తెలియజేయలేదు. బిజెపి మాత్రం ఇవిఎంలతోనే నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే కరోనా కంటే ముందు ఎపిలో పంచాయతీ ఎన్నిలను నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్రంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను ఇవ్వాలని ఎపి ఎస్‌ఇసి కోరారు.

దీంతో వాటిని అక్కడకు తరలించారు. ఇప్పుడు ఎపిలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో వాటిని వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినట్లు తెలిసింది. అదే సమయంలో ఇవిఎంలతో ముందుకు వెళ్లాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివిప్యాట్‌లు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆధునాతన టెక్నాలజీకి చెందిన వివిప్యాట్‌లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేవని తెలిసింది. దీంతో వివిప్యాట్‌లు కేటాయింపులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన మేరకు ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాలెట్ బాక్సుకే రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపుతోంది. వాటితోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రక్రియ మరింత సులువు అవుతుందని భావిస్తోంది. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జిహెచ్‌ఎంసి అధికారులు డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో పడ్డారు.

త్వరలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను నిర్వహించి.. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియను పూర్తిచేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఏడున ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం అధికారులు డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించారు. దీని ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లలో ఓటర్ల సంఖ్య 73,56,382గా ఉంది. దీనిపై ఈ నెల 3వ తేదీన జిహెచ్‌ఎంసి కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. అలాగే ఇవిఎంలు, ఎన్నికల సన్నద్ధతపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సమావేశం కానున్నారు. ప్రస్తుత పాలకమండలి గడువు పూర్తి కావస్తున్నందునఈసారి డివిజన్ల పునర్విభజన ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ముందస్తుగా నిర్వహించినా, పదవీకాలం పూర్తయ్యే వరకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రస్తుతం పాలకమండలి కొనసాగుతుందని ఒక అధికారి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిహెచ్‌ఎంసి చట్టం తీసుకొస్తే, ఏమైనా మార్పులు జరగవచ్చునని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News