Friday, March 29, 2024

వానాకాలంలో మక్కలపై నిషేధం

- Advertisement -
- Advertisement -

Ban on Maize crop during the Vanakalam season

 

70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్‌కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో భేటీ
ఓ టివి ఛానెల్‌లో రైతులతో ముఖాముఖీ

మన తెలంగాణ/హైదరాబాద్ : పంటల ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతోందన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయని, ఇక్కడి నేలలకున్న వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు, క్షార నేలలు ఉన్నాయని సిఎఎ వెల్లడించారు. రాష్ట్రంలో సమశీతోష్ణమండలంలో ఉన్నందున అన్ని రకాల పంటలు పండుతాయని వివరించారు. 900 మిల్లీమీటర్ల సగటు వర్షపాతంతో తెలంగాణలో వ్యవసాయానికి అన్నిరకాల అనుకూలత ఉందని, దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతోందని అన్నారు. పటాన్‌చెరులో అంతర్జాతీయ వ్యవసాయ సంస్థ అయిన ఇక్రిశాట్ ఏర్పడడానికి మనరాష్ట్రంలో ఉన్న మంచి నేలలే కారణమని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ పంటలన్నీ ప్రపంచ మార్కెట్లో హాట్‌కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

త్వరలో ఓ న్యూస్ ఛానల్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడతానని ఆయన తెలిపారు. ఏ పంటను ఎలా ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయవద్దని దానికి బదులుగా కందులు వేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో సోనాకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ సోనాకు షుగర్ ఫ్రీ రైస్ అని పేరుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు 10లక్షల ఎకరాల్లో సోనా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాసంగిలో మక్కలు పండించాలన్నారు. అలాగే 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాలలో పసుపు పంటను, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్ వేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం చెప్పే పంటలు రైతులతో వేయించే బాధ్యత కలెక్టర్లదేనని సిఎం పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో వ్యవసాయ రం గంపై జిల్లా అధికారులతో మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు మరే రాష్ట్రంలో కూడా అమలు జరగడం లేదన్నారు.

వ్యవసాయానికి అద్భుతమైన పరిస్థితులు

తెలంగాణకు వరదలు, తుపాన్లు, బలమైన ఈదురుగాలులు వంటి ప్రకృతి విపత్తులు చాలా తక్కువని, అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలత ఉందని వివరించారు. తెలంగాణ రికార్డు స్థాయిలో పంటలు పండిస్తోందని, ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ కింద ఎఫ్ సీఐకి ఇచ్చామని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేదని, ఏనాడూ 50 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 7 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు తెరిచి మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏ రాష్ట్రం ఈ విధంగా చేయడంలేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పత్తి కూడా బాగా పండుతోందని, ప్రపంచస్థాయి నాణ్యత దిశగా పయనిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, సూక్ష్మ నీటిపారుదలపై 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. ఇక మీదట రైతులు కూడా నియంత్రిత వ్యవసాయం చేయాలని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలని, ఏ పంటలు వేయాలన్న దానిపై రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి పండిద్దామని, ప్రతి రైతు లక్షాధికారి కావాలన్నదే తమ అభిమతమని సిఎం తెలిపారు.

70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలి

నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను తెలంగాణలో అందిస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. వేలాది పాడి పశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలన్నారు. తెలంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలన్నారు. 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలని, గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారని, ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతులు పొందాలని, వ్యవసాయంలో అన్ని రికార్డులను బద్దలు కొడుతున్నామన్నారు. పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీలు ఇస్తున్నామని సిఎం వివరించారు.

40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు

ప్రస్తుతం 25 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు అందుబాటులో ఉన్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో పండిన పంటలకు ఈ గోదాములు సరిపోవన్నారు. ఈ నేపథ్యంలో 40 లక్షల టన్నుల నిల్వ సామర్ధం గల గోదాంల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేట్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దీనికోసం ప్రతిజిల్లాల్లో స్థల సేకరణ చేపట్టామన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటను వేయకపోతే రైతుబంధు ఇవ్వదని, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతుబంధు పథకం కోసం రూ.2వేల కోట్లను విడుదల చేశామని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయం అంతర్జాతీయ మార్కెట్‌కు ఎదగాలని, 6.5 మిల్లీమీటర్‌ల పైన ఉన్న బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌సి జెడ్స్‌కు శ్రీకారం చుడతామన్నారు.

రైతులకు ఉచిత నీటి సరఫరా తెలంగాణలోనే..

రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని సిఎం తెలిపారు. తెలంగాణలో వ్యవసాయానికి అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయని, ఇక్కడి నేలలకున్న వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా లేదని, నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు, క్షార నేలలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ సమశీతోష్ణమండలంలో ఉన్నందున అన్ని రకాల పంటలు పండుతాయని వివరించారు. 900 మిల్లీమీటర్ల సగటు వర్షపాతంతో తెలంగాణలో వ్యవసాయానికి అన్నిరకాల అనుకూలత ఉందని, దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతోందని అన్నారు.

కల్తీవిత్తనాలు అమ్మితే పిడి యాక్ట్

దేశంలో రైతుబంధు పథకం ఎక్కడా లేదని, రైతుబీమా సదుపాయాలు పెరుగుతూ వస్తున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్ వంద శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. కల్తీవిత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ పెడతామన్నారు. కాటన్ పంటకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని, గతేడాది 1కోటి 23లక్షల ఎకరాల్లో రెండు పంటలు కలిపి వచ్చిందన్నారు. ఈ ఏడాది కోటి 33 లక్షల ఎకరాల పంటలు వేస్తారన్న అంచనాలో ఉన్నామన్నారు. 70లక్షల ఎకరాల్లో పత్తి వేయాలని, 40లక్షల ఎకరాల్లో వరి పంటలు వెయ్యాలని కెసిఆర్ సూచించారు. పత్తి-, వరి ఏ రకమైన వరి వెయ్యాలన్న విషయాన్ని ప్రభుత్వం చెబుతుందన్నారు. వర్షాకాలంలో మక్కా కాకుండా కందులను వేయాలన్నారు. రాష్ట్రం లో 26లక్షల టన్నుల టర్నోవర్ ఉందని, యాసంగి కాలంలో మక్కలు వేయాలని కెసిఆర్ పేర్కొన్నారు. 15లక్షల వరకు కంది పంటను వేయాలని,- మొత్తం పంటను మద్ధతు ధరతో ప్రభుత్వమే పూర్తిగా కొనుగోళ్లు చేస్తుందన్నారు. 2లక్షల ఎకరాల్లో కూరగాయలు వేస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News